Begin typing your search above and press return to search.

మీడియా దెబ్బకు రాచరికాన్నే వదిలేశాడట

By:  Tupaki Desk   |   27 Feb 2021 5:30 PM GMT
మీడియా దెబ్బకు రాచరికాన్నే వదిలేశాడట
X
పదవి ఎవరికి చేదు కాదు. హోదా కోసం చాలామంది తపిస్తుంటారు. అలాంటిది జన్మతో పాటు వచ్చిన రాచరిక హోదాను వదిలేసి.. సామాన్యుడిలా బతకాలనుకోవటం అంత తేలికైన విషయం కాదు. వందల కోట్లు సంపాదించినా.. అందుకు తగ్గ హోదా దక్కలేదంటే అదే పనిగా ఆరాటపడేవారిని చాలామందిని చూస్తుంటాం. అలాంటిది. రాచరికహోదాను వదిలేసి.. నా బతుకు నేను బతుకుతా.. నన్ను వదిలేయండి మహా ప్రభు అని చెప్పటం వెనుక ఉండే టార్చర్ ను తొలిసారి చెప్పుకొచ్చారు ప్రిన్స్ హ్యారీ.

తాను.. తన సతీమణి మేఘన్ మోర్కల్ గత ఏడాది రాచరికాన్ని కదిలేస్తున్నట్లుగా ప్రకటించటం.. అనంతరం బకింగ్ హోం ప్యాలస్ సైతం అదే విషయాన్ని ఇటీవల ప్రకటించటం తెలిసిందే. ఇంతకూ ప్రిన్స్ హ్యారీ రాచరికాన్ని ఎందుకు వదిలేసినట్లు? దానికి కారణం ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు. అమెరికాలోని సీబీఎస్ చానల్ లో జేమ్స్ కార్డన్ హోస్ట్ గా నిర్వహించే లేట్ లేట్ షో కార్యక్రమంలో హ్యారీ పాల్గొన్నారు.

తనపై వచ్చే విమర్శలకు సమాధానం ఇస్తూ.. తాను ప్రజాసేవ నుంచి దూరంగా పారిపోవాలని అనుకోలేదని స్పష్టం చేశారు. తానెప్పుడూ ప్రజల నుంచి దూరంగా పారిపోవాలని అనుకోలేదని.. బ్రిటన్ మీడియా కారణంగా ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడిందన్నారు. మీడియా కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు చెప్పిన ఆయన.. ఒక దశలో తన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని చెప్పారు.

బ్రిటన్ రాచరిక కుటుంబాన్ని వీడి బయటకు రావటానికి కారణం మీడియానే అని చెప్పారు. వారు పెట్టిన ఒత్తిడితోనే తాను రాచరికం నుంచి బయటకు వచ్చినట్లుచెప్పారు. బ్రిటన్ మీడియా తమ కుటుంబాన్ని ఊపిరి ఆడనివ్వకుండా చేశారన్నారు. తాను బాధ్యతల్ని వదిలి పెట్టలేదని.. ఒక్క అడుగు వెనక్కి వేయటం మాత్రమేనని చెప్పారు. బ్రిటన్ మీడియా ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే అన్న ఆయన.. తానుబ్రిటన్ ను విడిచి పెట్టటానికి ముందు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

బ్రిటన్ లోని టాబ్లాయిడ్ లు తమపై జాతివివక్షను ప్రదర్శించాయన్నారు. హ్యారీ పెళ్లాడిన మెఘన్ తండ్రి శ్వేతజాతీయుడు కాగా.. తల్లి ఆఫ్రికన్ అన్నది మర్చిపోకూడదు. దీంతో.. బ్రిటన్ పత్రికలు రాసిన రాతలు తమను తీవ్రంగా బాధించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. రాణి ఎలిజెబెత్ మీద నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ది క్రౌన్ సిరీస్ లో వాస్తవాలేమీ చూపించలేదన్నారు.. నిజ జీవితంలో తమ కుటుంబం ఎదుర్కొన్న ఒత్తిళ్ల కంటే కూడా మీడియా కథనాల వల్ల ఎక్కువ ఒత్తిళ్లు ఎదుర్కొన్నట్లు స్పష్టం చేశారు. ఈ వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.