Begin typing your search above and press return to search.

మూడోసారీ నేనే ప్ర‌ధాని: మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. రీజ‌న్ ఇదేనా?

By:  Tupaki Desk   |   13 May 2022 9:31 AM GMT
మూడోసారీ నేనే ప్ర‌ధాని:  మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. రీజ‌న్ ఇదేనా?
X
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ఆయ‌న రెండు సార్లు ప్ర‌ధాన మంత్రి గా ఉన్నారు. స‌హ‌జంగా.. ఆర్ ఎస్ ఎస్ వాది అయిన‌.. మోడీ.. ఆ సిద్ధాంతాల ప్ర‌కారం ఏ ప‌ద‌వినైనా రెండు సార్ల‌కు మించి తీసుకునే అవ‌కాశం లేదు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిస్తే.. ఎవ‌రు ప్ర‌ధాని అవుతారు... అనే చ‌ర్చ కొన్నాళ్లుగా పార్టీలో గుంభ‌నంగా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో మీడియాలో గుజ‌రాత్‌కే చెందిన‌ అమిత్ షా, మ‌హారాష్ట్ర‌కు చెందిన నితిన్ గ‌డ్క‌రీ, యూపీకి చెందిన ప్ర‌స్తుత సీఎం యోగి ఆదిత్య‌, ఇదే రాష్ట్రానికి చెందిన రాజ్‌నాథ్‌పేర్లు వినిపించాయి.

ఇంకా దీనిపై చ‌ర్చ కొన‌సాగుతూనే ఉంది. ఇటీవ‌ల ఓ జాతీయ ప‌త్రిక కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి నితిన్‌, అమిత్‌షాల మ‌ధ్యే పోటీ ఉంటుంద‌ని.. ఆర్ ఎస్ ఎస్ ఎవ‌రికి మ‌క్కువ చూపుతుందో వారే ప్ర‌ధాని అవుతార ని.. ఒక క‌థ‌నం ప్ర‌చురించింది. మ‌రి ఈ క‌థ‌నం ఎఫెక్టో.. లేక మ‌రేమో.. తెలియ‌దు కానీ... ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఒకింత వేగంగానే స్పందించేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి .. జ‌రుగుతున్న చ‌ర్చ ల్లో ఆయ‌న అనూహ్యంగా స్పందించారు. వ‌చ్చే సారి కూడా ముచ్చ‌ట‌గా మూడో ద‌ఫా ప్ర‌ధాని తానేన‌ని మోడీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ప్రధానమంత్రి పదవిలో కొనసాగడంపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు విశ్రాంతి తీసుకోవాలన్న ఉద్దేశం అసలే లేదని వ్యాఖ్యానించారు. రెండుసార్లు ప్రధాని పదవి చేపడితే అంతా అయి పోయినట్లు కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ విపక్ష నాయకుడి మాటలను గుర్తు చేసుకున్నారు. గుజరాత్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం పొందుతున్న వృద్ధులు, వితంతువులు, పేద ప్రజలతో మోదీ వర్చువల్గా ముచ్చటించారు. ఈ సందర్భంగా తాజా వ్యాఖ్యలు చేశారు.

``ఒకరోజు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు(శ‌ర‌ద్ ప‌వార్‌) నన్ను కలిశారు. రాజకీయంగా నన్ను ఆయన తరచుగా విమర్శిస్తుంటారు. కానీ నేను ఆయనను గౌరవిస్తాను. అప్పుడు ఆయన.. ``మోడీజీ.. ఈ దేశం మిమ్మల్ని రెండుసార్లు ప్రధానిని చేసింది. మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు?' అని అడిగారు. రెండుసార్లు ప్రధాని అయితే అన్నీ సాధించినట్టేనని ఆయన అభిప్రాయంతో ఉన్నారు. కానీ, మోడీ అందరికంటే చాలా భిన్నమని ఆయనకు తెలీదు.

మోడీ గుజరాత్ గడ్డ మీద పెరిగాడు. అందుకే నేను దేన్నీ అంత తేలికగా తీసుకోను. విశ్రాంతి తీసుకోవాలని అనుకోను. సంక్షేమ పథకాలను వంద శాతం మంది లబ్ధిదారులకు అందేలా చూడటమే నా కల. అందుకే వ‌చ్చే సారికూడా ప్ర‌ధాని ప‌ద‌విలో నేనే ఉంటే త‌ప్పేముంది!`` అని మోడీ వ్యాఖ్యానించారు. ఇక‌, దీనిని బ‌ట్టి.. ప్ర‌ధాని పీఠంపై జ‌రుగుతున్న చ‌ర్చ‌కు న‌రేంద్ర మోడీ ఇలా చెక్‌పెట్టార‌ని అనుకోవాలా? అంటున్నారు ప‌రిశీల‌కులు.