Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జోస్యం..గెలుపెవరిదంటే?

By:  Tupaki Desk   |   25 Oct 2020 3:30 AM GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జోస్యం..గెలుపెవరిదంటే?
X
మరో వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌ లు గెలుపు తనదంటే తనదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, ట్రంప్, బిడెన్ లలో ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇక, ట్రంప్, బిడెన్ ల మద్దతుదారులు పందేలు కాసేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాతోపాటు భారత్ వంటి మిత్రదేశాలు కాబోయే అమెరికా అధ్యక్షుడెవరన్న దానిపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ గెలుపుపై తమ అంచనాలను వెల్లడించేందుకు సైకాలజిస్టులు, జ్యోతిష్కులు, తత్వవేత్తలు రంగంలోకి దిగారు. ట్రంప్ న‌కు ఓటమి తప్పదని, బిడెన్ గెలుస్తారని సైకాలజిస్టులు అంటున్నారు. అయితే, ట్రంప్ రెండోసారి కూడా పగ్గాలు చేపడతారని కొందరు జ్యోతిష్కులు అభిప్రాయపడుతున్నారు.

న్యూమరాలజీ ప్రకారం ట్రంప్‌ సంఖ్యాబలం బలంగా ఉందట. ట్రంప్ డెస్టినీ నెంబర్ 22 ని, ఈ సంఖ్య ఉన్నవారు భారీ విజయాలు సాధిస్తారని న్యూమరాలజిస్టులు బల్లగుద్ది చెబుతున్నారు. బిడెన్ ది రెండవ సంఖ్య అని ఇది చాలా బలహీనమైనదని అంటున్నారు. ఈ సంఖ్య వారు కష్టపడ్డా ఉపయోగం ఉండదంటున్నారు. మరోవైపు, గ్రహాలన్నీ ట్రంప్ న‌కు అనుకూలంగా ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా న్యూమరాలజిస్టుల అభిప్రాయంతో ట్రంప్ మద్దతుదారులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కరోనా కట్టడిలో ట్రంప్ విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటోన్న నేపథ్యంలో ఈ గణాంకాలు ట్రంప్ ఫ్యాన్స్ కు ఊరటనిచ్చాయని చెప్పవచ్చు. మరి, న్యూమరాలజిస్టుల లెక్కలు ట్రంప్ ను గెలిపిస్తాయా లేక వారి లెక్క తప్పుతుందా....జ్యోతిష్కుల జోస్యం నిజమవుతుందా అన్నది తేలాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.