Begin typing your search above and press return to search.

దమ్ముంటే సస్పెండ్ చేయి.. తొడగొట్టిన పొంగులేటి

By:  Tupaki Desk   |   6 Feb 2023 8:30 PM GMT
దమ్ముంటే సస్పెండ్ చేయి.. తొడగొట్టిన పొంగులేటి
X
అధికార బీఆర్ఎస్ లో కొద్దిరోజులుగా అసమ్మతి రాజేస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా తొడగొట్టేశారు. ‘దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయాలని’ పొంగులేటి ఏకంగా బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. పార్టీలో సభ్యత్వం లేదని చెబుతున్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం నన్ను ప్రాధేయపడ్డారు.. ఇప్పుడు తనపైనే విమర్శలు చేస్తారా? అని పొంగులేటి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ చేస్తున్న అన్ని విమర్శలకు సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెబుతానని తెలిపారు.

తాజాగా వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిదులు పొంగులేటిని కలిశారు. ఈ విషయం బీఆర్ఎస్ అధిష్టానానికి తెలియడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వైరా నియోజకవర్గంలో 20 మంది నాయకులపై బీఆర్ఎస్ అధిష్టానం బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. రాష్ట్ర మార్క్ ఫెడ్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించింది. అంతేకాక.. వైరా పురపాలక చైర్మన్ జైపాల్ తోపాటు మరో 18 మందిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది.

ఆదివారం ఉదయం దాదాపు 5 మండలాలకు చెందిన నేతలు పొంగులేటితో సమావేశమయ్యారు. పలువురు ముఖ్య నేతలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంగులేటితో భేటి అయిన నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలో అధిష్టానం సీరియస్ గా స్పందిస్తోంది.

తాజాగా విజయమ్మతో పొంగులేటి భేటి ఆసక్తి రేపింది. షర్మిల పార్టీలో పొంగులేటి చేరడం గ్యారెంటీ అన్న చర్చ సాగుతోంది. పార్టీలో చేరిక.. ముహూర్తం దాదాపు ఫిక్స్ అయినట్టుగా చెబుతున్నారు. తన నిర్ణయంపై అనుచరులతో పొంగులేటి సమావేశానికి సిద్ధమయ్యారని అంటున్నారు.పొంగులేటి తాను ఏ పార్టీలో చేరినా జిల్లాలో తన హవా కొనసాగాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. తొలుత బీజేపీలో చేరాలని భావించారు. కానీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పోరు సాగుతున్న ఖమ్మం జిల్లాలో బీజేపీకి పట్టులేదు. ఆతర్వాత కాంగ్రెస్ ఆఫర్ పై ఆలోచించారు. ఇప్పుడు షర్మిల పార్టీ వైపు మొగ్గుచూపుతున్టనట్టు తెలుస్తోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి షర్మిల పార్టీలోకి చేరడానికి అనేక కారణాలున్నాయి. ఆయన మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆంధ్రాలోనే ఎక్కువగా కాంట్రాక్టులు లభించాయి. మరోవైపు పొంగులేటి వియ్యంకుడు కడప జిల్లాకు చెందినవారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కుటుంబంతో సాన్నిహిత్యం పెరిగింది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ హవాతో గులాబీ కండువా కప్పుకోవాల్సి వచ్చిందని ఆయన సన్నిహితుతు చెబుతున్నారు. అయితే అందులో ఉన్న గ్రూపు విభేదాలతో ఇక ఆ పార్టీలో కొనసాగవద్దని నిర్ణయించుకున్నాడని అంటున్నారు.ఇప్పుడు షర్మిల పార్టీలో చేరుతాడనే ప్రచారం నేపథ్యంలోనే బీఆర్ఎస్ సర్కార్ ప్రతీకారా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.