Begin typing your search above and press return to search.

పందెం కోడికి బలైన పోలీస్ అధికారి..ఎలా అంటే?

By:  Tupaki Desk   |   28 Oct 2020 8:50 AM GMT
పందెం కోడికి బలైన పోలీస్ అధికారి..ఎలా అంటే?
X
కోడిపందేలు.. తెలుగునాట ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందేలు జోరుగా సాగుతుంటాయి. కోడిపందెలు ఎక్కడ.. ఎప్పుడు నిర్వహించిన రూ. లక్షల్లో చేతులు మారుతుంటాయి. దీంతో గెలిచిన వారిలో ఆనందం ఓడిన వారిలో నిస్తేజం అలుముకుంటుంది. అయితే , ప్రభుత్వం కోడి పందేలు ఆడటం నిషేధించినా కూడా పోలీసుల కళ్లు కప్పి ,భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తుంటారు. వారికీ కొందరు ప్రజాప్రతినిధుల అండ కూడా ఉంటుంది అంటూ వార్తలు వస్తుంటాయి. పండుగ రోజుల్లో ఇదో రకమైన సరదా ..అయితే కేవలం మన దగ్గరే కాదు ఫిలిప్పీన్స్ దేశంలోనూ కోడిపందేలు జోరుగా నిర్వహిస్తారు.

అయితే, తాజాగా ఫిలిప్పీన్స్ లో నిర్వహించిన కోడిపందేలలో ఓ పోలీసు అధికారి దురదృష్టవశాత్తు కోడిపుంజు కత్తికి ప్రాణాలు వదిలాడు. ఎక్కడైనా కోడి పందేలు ఆడుతున్నారు అంటే అక్కడికి పోలీసులు వెళ్లి దాన్ని ఆపేస్తుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీనితో ఫిలిప్పీన్స్ లో కోడిపందేలపై నిషేధం విధించారు. ఉత్తర సమర్ ప్రాంతంలో కోడిపందేలు జరుగుతుండడంతో స్థానిక శాన్ జోస్ మున్సిపల్ పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్ ఇన్ చార్జిగా పనిచేస్తున్న క్రిస్టియన్ బోలోక్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లాడు. ముగ్గుర్ని అరెస్ట్ చేసి, పందేలు నిర్వహించారన్న దానికి ఆధారంగా రెండు కోడిపుంజులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసు అధికారి బోలోక్ ఆ పుంజులలో ఒకదానిని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే, దాని కాలికి కట్టి ఉన్న పదునైన కత్తి ఆ పోలీసు అధికారి ఎడమ తొడభాగంలోని రక్తనాళాన్ని తెంపేసింది. దీనితో తీవ్ర రక్తస్త్రావం కావడంతో ఆ పోలీసు అధికారి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన పోలీసు వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ అధికారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.