Begin typing your search above and press return to search.

వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్‌

By:  Tupaki Desk   |   19 Nov 2021 2:30 AM GMT
వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్‌
X
హైదరాబాద్‌: మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ హైకోర్టును మెట్లెక్కారు. వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆయన రాజీనామాను ఆమోదించడాన్ని సవాలుచేస్తూ సుబేందర్ సింగ్, శంకర్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పిటిషనర్లు తెలిపారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్ ను లంచ్ మోషన్ స్వీకరించాలని సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి కోరారు. అయితే అత్యవసర విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

కలెక్టర్‌ పదవికి వెంకట్రామారెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్‌) చేశారు. ఆయన వీఆర్ఎస్ ను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. రాజీనామా చేసిన తెల్లారి నుంచే వెంకట్రామారెడ్డి వీఆర్ఎస్‌ అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి 2022 సెప్టెంబరులో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, మరో 10 నెలల సర్వీసు ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ వెంటనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, కౌశిక్ రెడ్డిల పేర్లను ప్రకటించింది.

వెంకట్రామిరెడ్డిపై ఎప్పటి నుంచో అధికార పార్టీ ఏజెంట్‌ అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సర్కార్‌ జీతం తీసుకుంటూ టీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేస్తున్నారనే ఆరోపణలు ప్రతీ నిత్యం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయడంపై అనేక పుకార్లు వచ్చాయి. వెంకట్రామిరెడ్డిది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి. ఆయన స్వతహాగా సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. వెంకట్రామిరెడ్డి సోదరుడు సత్యనారాయణరెడ్డి కూడా కలెక్టర్‌గా పనిచేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా, సిద్ధిపేట కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో అన్నీతానై చూస్తుండేవారనే విమర్శలున్నాయి.

వెంకట్రామిరెడ్డి, కేసీఆర్‌ అంతర్మాత అని ప్రతిపక్ష నేతలు నిత్యం ఆరోపణలు చేస్తుంటారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా అటు తర్వాత సిద్ధిపేట కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కేసీఆర్ చెప్పిన ప్రతీపని కాదనకుండా చేస్తూ ఉంటావారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సిద్ధిపేట కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో అందరూ చూస్తుండగానే వంగివంగి కేసీఆర్ కు దండాలు పెట్టడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆ తర్వాత వరి పంట విషయంలో ఆయన చేసిన హెచ్చరికలపై అనేక విమర్శలు వచ్చాయి.