Begin typing your search above and press return to search.

రాజ‌ధానిపై నివేదిక సిద్దం..30 వేల కోట్ల దుబారా..బాబుకు చెమ‌ట‌లేనా...?

By:  Tupaki Desk   |   23 Oct 2019 12:03 PM GMT
రాజ‌ధానిపై నివేదిక సిద్దం..30 వేల కోట్ల దుబారా..బాబుకు చెమ‌ట‌లేనా...?
X
ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని నిర్మిస్తాం.. రాష్ట్రాన్ని దేశంలో కాదు.. ప్ర‌పంచంలోనే ముందు వ‌రుస‌లో నిల‌బెడ‌తాం .. అంటూ .. ప‌దే ప‌దే ప్ర‌క‌టించిన టీడీపీ అధినేత‌ - గ‌త సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు చిక్కుల్లో ప‌డ్డారా? ఆది నుంచి ఈ రాజ‌ధానిపై విమ‌ర్శ‌లు చేసిన వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ రాజ‌ధానిపై అధ్య‌యనం కోసం వేసిన పీటర్ కమిటీ తాజాగా త‌న నివేదిక‌ను వెల్ల‌డించింది. రాజధాని - ప్రాజెక్టులు - నిర్మాణాలు - అవకతవకలపై పీటర్ - పొన్నాడ సూర్యప్రకాశ్ - అబ్దుల్ బషీర్ - నారాయణ రెడ్డి - ఇయన్ రాజు - ఆదిశేషు సభ్యులుగా జ‌గ‌న్ ప్ర‌భ్యుత్వం క‌మిటీని నియ‌మించిన విష‌యం తెలిసిందే.

సుదీర్ఘ అధ్య‌య‌నం అనంత‌రం ఈ క‌మిటీ త‌న నివేదిక‌ను జ‌గ‌న్ స‌ర్కారుకు అందించింది. ఈ క్ర‌మంలో కొన్నిసూచ‌న‌లు చేస్తూనే.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రాజ‌ధాని విష‌యంలో చేసిన దుబారా.. అయిన వారికి అందించిన ప‌ల‌హారాలను కూడా క‌మిటీ త‌న నివేదిక‌లో కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. రాజధాని లోని ప్రతి ప్రాజెక్టు - నిర్మాణాలను పున సమీక్షించాలని నివేదికలో క‌మిటీ స్ప‌ష్టం చేసింది. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు క‌మిటీ గుర్తించింది. అవసరానికి మించి రెట్టింపు వ్యయం చేసారని కూడా క‌మిటీ వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇక‌, ఈ రాజ‌ధాని పేరుతో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సుమారు రు.30 వేల కోట్ల మేర దుబారా చేసింద‌ని క‌మిటీ త‌న నివేదిక‌లో ప్ర‌త్యేకంగా పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇక‌, 75 శాతం పైగా పూర్తి అయిన టవర్లు - ప్రాజెక్టులపై ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వ నిర్ణయానికి వదిలేసింది. ఇదిలావుంటే - రాజధాని - రాష్ట్ర సమగ్రాభివృద్ధి పై ప్రణాళికల రూపకల్పన - సూచనల కోసం సెప్టెంబర్ 13 న మరో నిపుణుల కమిటీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ జిఎన్.రావు నేతృత్వంలోని ఈ కమిటీతాజాగా విజయవాడలో తొలి సమావేశం నిర్వహించింది.

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరిపిన క‌మిటీ స‌భ్యులు వివిధ వర్గాలతో సంప్రదింపులు చేస్తోంది. వారి నుంచి కూడా స‌మాచారం సేక‌రించి వ‌చ్చే నెల‌లో త‌న నివేదిక‌ను అంద‌జేయ‌నుంది. ఏదేమైనా.. చంద్ర‌బాబు చేప‌ట్టిన క‌లల ప్రాజెక్టు.. ఆయ‌న‌ను క‌ల‌త‌కు గురి చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.