Begin typing your search above and press return to search.

ఇంత మొరటుగా 'బుస' మాటలు అవసరమా పేర్ని

By:  Tupaki Desk   |   16 Jun 2023 10:58 AM GMT
ఇంత మొరటుగా బుస మాటలు అవసరమా పేర్ని
X
రాజకీయం అన్న తర్వాత సవాలచ్చ ఉంటాయి. భావం ఏదైనా.. ప్రజలకు చెప్పాలనుకున్నది చెప్పేలా.. టార్గెట్ చేసినోళ్లకు దిమ్మ తిరిగేలా నేతల తీరు ఉండాలి. 'సిద్దడు అద్దంకి వెళ్ళొచ్చినట్టు'గా వ్యవహారం ఉండకూడదు. అందునా అధికారపక్షం తరపున మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. తాను టార్గెట్ చేస్తున్న అధినేతకు ప్రజాభిమానం భారీగా ఉండి.. తాము చేసే తీవ్రమైన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేని వేళ.. మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.

రాజకీయ మైలేజీ కోసం మాట్లాడటం మామూలే. అలాఅని.. ఒక స్థాయి మాటలు మాట్లాడేటప్పుడు సమయం.. సందర్భం చాలా అవసరం. కానీ.. ఇలాంటివన్నీ మిస్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బయటకు వచ్చి.. మైకు పట్టుకొని మాట్లాడినంతనే విరుచుకుపడే నేతల్లో ముందు వరసలో ఉంటారు పేర్ని నాని. ఆ మాటకు తగ్గట్లే.. తాజాగా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టేశారు.

అప్పుడెప్పుడో నెలల క్రితం నిర్వహించిన బహిరంగ సభలో.. తనను ప్యాకేజ్ స్టార్ అంటూ ఆరోపణలు చేసే వారికి వార్నింగ్ ఇస్తూ..తనను ప్యాకేజీ స్టార్ అంటూ తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ.. తన కాలికున్న చెప్పును సభాముఖంగా చూపించటం తెలిసిందే. ఆ సందర్భంగా పవన్ చెప్పు చూపిన వైనంపై చాలానే పరిణామాలు చోటు చేసుకన్నాయి. అదంతా జరిగిపోయిన గతం.

కత్తిపూడి సభలో పవన్ చెప్పు చూపించింది లేదు. అలాంటప్పుడు అప్పుడెప్పుడో జరిగిపోయిన చెప్పు ఎపిసోడ్ ను తెర మీదకు తీసుకొచ్చి.. నువ్వు ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా.. అంటూ పేర్నినాని ఫైర్ కావటం ఎబ్బెట్టుగా ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. వైసీపీ నేతలు సైతం పేర్ని నాని మాటల్ని తప్పు పడుతున్నారు. సమయం.. సందర్భం లేకుండా పవన్ మీద మాట్లాడే మాటలు ఆయనకు మరింత సానుభూతి తెచ్చి పెబుతున్నాయన్న విషయాన్ని వైసీపీ నేతలు కొందరు తమ ప్రైవేటు సంభాషణల్లో ప్రస్తావించటం గమనార్హం.

ప్యాకేజీ స్టార్ అంటూ బోలెడన్నిసార్లు మాట అయితే అన్నామే తప్పించి.. ఒక్క ఆధారాన్ని కూడా చూపించకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారన్నది వైసీపీ నేతల వాదన. ఈ కారణంతోనే ప్యాకేజీ స్టార్ మాటను పక్కన పెట్టేసి.. చంద్రబాబుకు దత్తపుత్రుడన్న మాటకే ఎక్కువ స్పందన ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాజిక్ లేని వాదన వినిపిస్తే.. పెద్ద ప్రయోజనం ఉండదన్న విషయాన్ని వదిలేసి.. పేర్ని నాని లాంటి వారి వ్యాఖ్యలు పార్టీకి ప్రయోజనం కంటే కూడా నష్టాన్నే కలిగిస్తాయని చెబుతున్నారు.

రెండు చెప్పులు చూపించిన సందర్భంగా పేర్ని నాని నోటి నుంచి వచ్చిన 'బుస'.. 'మక్కెలిరిగిపోతాయి' లాంటి మొరటు మాటల్ని మాట్లాడకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన సినిమాల్ని అధికార పార్టీ అడ్డుకుంటుందని పవన్ చేసిన ఆరోపణను తీవ్రంగా స్పందించిన పేర్ని నాని.. ఒక్క సినిమాను చూపిస్తావా? అన్న ప్రశ్నకు.. సోషల్ మీడియాలో వకీల్ సాబ్.. బీమ్లానాయక్ సినిమాల్ని ఉదహరిస్తున్నారు.

ఇవి సరిపోవన్నట్లు.. తన సినిమా విడుదల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు పట్టుకుంటారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ కు వొంగి వొంగి దండాలు పెట్టిన పరిస్థితి ఎప్పుడూ లేదని.. అలాంటిది ఆమాటలు మాట్లాడటం వల్ల నష్టమే ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడే మాటల్లో కంటెంట్ కంటే కంపు మాటలే ఎక్కువగా ఉండటంతో పేర్ని నానికి మైలేజీ రావటం కాదు.. భారీ డ్యామేజ్ గా మారిందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.