Begin typing your search above and press return to search.

'ఔరంగజేబు' వ్యాఖ్యలపై దిగొచ్చిన పేర్నినాని.. మన్నించాలంటూ వేడుకోలు

By:  Tupaki Desk   |   22 April 2023 10:25 AM GMT
ఔరంగజేబు వ్యాఖ్యలపై దిగొచ్చిన పేర్నినాని.. మన్నించాలంటూ వేడుకోలు
X
ఏపీ విపక్ష నేత చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏదైనా ఘాటు వ్యాఖ్యలు చేయాలంటే ముందుండే వైసీపీ నేతల్లో పేర్ని నాని ఒకరు. చంద్రబాబు.. పవన్ పై విరుచుకుపడే విషయంలో ఆయన మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. అలాంటి తీరుతో తాజాగా ఇరుకున పడిపోయారు పేర్నినాని.

తాను చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారటం.. మైనార్టీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావటంతో ఆయన కాస్తంత తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలు కావాలని చేసినవి కావని.. నొప్పించి ఉంటే మన్నించాలంటూ ముస్లింలను కోరిన పేర్ని.. తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.

ఈ మధ్యన నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో చంద్రబాబును ప్రస్తావిస్తూ ఔరంగజేబును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఔరంగజేబు గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ముస్లింలు పలువురు మండిపడ్డారు.

రాజకీయాల్లో చాలామంది వెన్నుపోటుదారులు ఉండొచ్చని.. కానీ ఔరంగజేబు పేరును ప్రస్తావించటం సరికాదన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రియాక్టు అయిన పేర్నినాని.. తాను చిన్నప్పటి నుంచి చదివిన చరిత్ర.. పాఠ్యాంశాల్లో ఔరంగజేబు రాజకీయ ప్రస్థానం గురించి మాత్రమే తెలుసుకున్నట్లు చెప్పారు.

ఔరంగజేబును ముస్లింలు వలీగా భావిస్తారని తాను ఎక్కడా వినలేదని.. తాను మాట్లాడిన మాటలకు కొందరు ఎక్కువగా ప్రచారం చేశారన్నారు. తనకు అల్లా పైనా.. మహ్మద్ ప్రవక్త మీదా ఎంతో నమ్మకం ఉందని.. తాను ఎన్నోసార్లు దర్గాకు వెళ్లానని వ్యాఖ్యానించారు.

తన మాటలు ఎవరినైనా గాయపరిస్తే తనను మన్నించాలని కోరారు. మొత్తానికి మాట్లాడటమే కానీ.. తాను మాట్లాడిన మాటల తీవ్రతకు తగ్గి.. మన్నించాలని కోరిన వైనం చూసినప్పుడు.. ఇకనైనా మాటల విషయంలో కాస్తంతఅప్రమత్తంగా వ్యవహరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. పేర్ని నానిలో 'ఔరంగజేబు' ఎఫెక్టు ఎంతన్నది రానున్న రోజుల్లో తేలనుందని చెప్పాలి.