Begin typing your search above and press return to search.

ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్.. ఇవీ రేట్లు?

By:  Tupaki Desk   |   5 May 2021 7:36 AM GMT
ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్.. ఇవీ రేట్లు?
X
కరోనాతో అల్లాడుతున్న రోగులకు ఉపశమనం కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా తప్ప వేరే ప్రత్యామ్మాయం లేని ఈ రోగాన్ని అరికట్టేందుకు డిసైడ్ అయ్యింది. టీకా డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో 45 ఏళ్లు పైబడిన వారికి టీకా వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.

తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఈ టీకాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. కోవిడ్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ టీకా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

18-44 మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్ ఇప్పుడు లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్) డాక్టర్ గడల శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు.

కేంద్రం మూడో దశ టీకా మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కు ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు. ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్ద వేసే టీకాలను ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.

ఇన్నాళ్లు రూ.150కే ప్రభుత్వం నుంచి కొని రూ.250కి టీకాలను ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలకు వేసేవి. కానీ ఇప్పుడు నేరుగా కొని వేస్తుండడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాల ధరలకు రెక్కలొచ్చాయి. కోవాగ్జిన్ ధర ఒక్కో డోసుకు రూ.1300, కోవిషీల్డ్ అయితే రూ.700 చొప్పున వసూలు చేస్తున్నట్టు సమాచారం.