Begin typing your search above and press return to search.

మా ఎమ్మెల్యే ఎక్క‌డున్నాడో చెప్పాలంటూ.. అసెంబ్లీకి వ‌చ్చేసిన జ‌నం!

By:  Tupaki Desk   |   15 March 2021 12:30 PM GMT
మా ఎమ్మెల్యే ఎక్క‌డున్నాడో చెప్పాలంటూ.. అసెంబ్లీకి వ‌చ్చేసిన జ‌నం!
X
ఎమ్మెల్యేల‌ విధి ఏంటీ..? నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకొని, వాటిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చి, ప‌రిష్కారానికి కృషి చేయాలి. నిత్యం ప్ర‌జల్లో ఉంటూ వారి క‌ష్టాలు తెలుసుకోవాలి. ప్ర‌జ‌లే త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తే.. 24/7 త‌లుపులు తెరిచే ఉంచాలి. అలాంటిది.. అస‌లు ఎమ్మెల్యే ప్ర‌జ‌ల‌ కంటికే క‌నిపించ‌క‌పోతే..? వారి‌గోడు చెప్పుకోవ‌డానికి అవ‌కాశ‌మే ఇవ్వ‌క‌పోతే..? జనం ఏం చేస్తారు..? వేముల వాడ ప్ర‌జ‌ల మాదిరిగా ఏదో ఒక‌టి చేస్తారు.

గ‌తంలో త‌మ ఎమ్మెల్యే క‌నిపించ‌ట్లేదంటూ ప‌లువురు శాస‌న‌స‌భ్యుల‌పై ప్ర‌జ‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. కానీ.. తెలంగాణ‌లోని వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు త‌మ ఎమ్మెల్యే క‌నిపించ‌ట్లేదంటూ ఏకంగా అసెంబ్లీని ముట్ట‌డించ‌డానికి వ‌చ్చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతుండ‌డంతో ప్ర‌భుత్వానికి త‌మ గోడు వినిపించుకునేందుకు య‌త్నించారు.

వేములవాడ నియోజ‌క‌వర్గానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్‌.. చాలా కాలంగా క‌నిపించ‌ట్లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూ అసెంబ్లీ ముట్ట‌డికి బ‌య‌ల్దేరారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకుంటే త‌మ స‌మ‌స్య‌లు ఎవ‌రికి చెప్పుకోవాల‌ని మండిప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీని ముట్ట‌డించేందుకు య‌త్నించారు. వెంట‌నే అల‌ర్ట్ అయిన పోలీసులు.. ఆందోళ‌న చేస్తున్న‌వారిలో ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఎమ్మెల్యే ర‌మేష్ ప్ర‌స్తుతం జ‌ర్మ‌నీలో ఉన్న‌ట్టు స‌మాచారం.