Begin typing your search above and press return to search.

లైఫ్ లో కాంగ్రెస్ కు ఓటేయనోడు పండుగ చేసుకున్నారట

By:  Tupaki Desk   |   14 May 2023 1:00 PM GMT
లైఫ్ లో కాంగ్రెస్ కు ఓటేయనోడు పండుగ చేసుకున్నారట
X
ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలంటే 1980 తర్వాత పుట్టినోళ్లలో కాంగ్రెస్ ను అభిమానించే వారి కంటే ఏహ్యభావంతో వ్యవహరించే వారే ఎక్కువగా కనిపిస్తారు. దీనికి కారణాలెన్నో. ఇలాంటి వారిలో చాలామంది అయితే ప్రాంతీయ పార్టీలకు పరిమితం అవుతారు. జాతీయ రాజకీయాల్లోకి మోడీ ఎంట్రీకి కాస్త ముందు నుంచి ఆయన్ను అభిమానించిన కారణంగా బీజేపీలోకి షిఫ్టు అయినోళ్లు ఉన్నారు. కాంగ్రెస్ అంటే కస్సుమనేవాళ్లు.. ఆ పార్టీ పుణ్యమా అని దేశం ఇలా తగలబడిపోయిందన్న నిశ్చిత అభిప్రాయం ఉన్నోళ్లు కోట్లాది మంది ఉంటారు.

ఇలాంటివారు కాంగ్రెస్ ను.. కాంగ్రెస్ నేతల్ని అస్సలు ఇష్టపడరు. ఇలాంటి వారికి వైఎస్ లాంటి వాళ్లు మినహాయింపు. వైఎస్ ను వ్యక్తిగతంగా అభిమానించినా.. కాంగ్రెస్ ను ద్వేషించిన ఉదంతాలు చాలామందికి ఎదురవుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీక ఓటు వేసేందుకు ససేమిరా అనేటోళ్లు చాలామందే ఉంటారు. తాము పుట్టి పెరిగిన తర్వాత.. ఈ రోజు వరకు కాంగ్రెస్ కు ఓటు వేయనోళ్లు చాలామందే ఉంటారు.

మరి.. అలాంటోళ్లంతా తాజాగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఎంజాయ్ చేయటం కనిపిస్తుంది. ఇదో కొత్త ట్రెండ్ గా చెప్పాలి.కాంగ్రెస్ కు జీవితంలో ఓటు వేసింది లేదు. కానీ.. ఈ రోజు కాంగ్రెస్ విజయాన్ని అస్వాదిస్తున్నా. మనసంతా చాలా సంతోషంగా ఉందన్న మాట పలువురి నోట వినిపించటం ఆసక్తికరంగా మారింది అంతదాకా ఎందుకు.. కర్ణాటక ఎన్నికల ఫలితాల్ని న్యూస్ చానళ్లు నాన్ స్టాప్ గా చూపించాయి.

ఈ వార్తలు అందించే వారిలోనూ.. ఎన్నికల వార్తల్ని విశ్లేషించే వారిలోనూ తెలియని దరహాసం వారి ముఖాల్లో కనిపించింది. సాధారణంగా రాజకీయ వార్తలు.. అందునా ఎన్నికల ఫలితాల వార్తల్ని అందించే వేళలో.. సాపేక్షంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. మనసులో ఉన్న భావాల్ని బయటకు వెల్లడించేందుకు ఆసక్తి చూపించరు.

అందుకు భిన్నంగా తాజా ఎపిసోడ్ లో మాత్రం ముఖంలో సంతోషం కనిపించటం గమనార్హం. జనాల మూడ్ కు తగ్గట్లే.. పోస్టులు సోషల్ మీడియాలో సిద్ధమవుతాయి. వాటిల్లో కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటిదే ఒకటి మీకు చెప్పాలి. తాజాగా వైరల్ గా మారిన ఒక పోస్టు సారాంశం ఏమంటే.. ''జీవితంలో కాంగ్రెస్ గెలుపుని.. ఆస్వాదించే రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మోడీగారి దయవల్ల తరతరాలుగా కాంగ్రెస్ ను ఇష్టపడని వారికి కూడా ఇప్పుడే అదే బెటర్ పార్టీగా కనిపిస్తుంది'' అంటూ పేర్కొన్నారు.

విపరీతమైన అహంకారం.. అంతకు మించిన అహంభావం.. గెలుపు ధీమా జనాలకు నచ్చట్లేదు. అదానీ.. అంబానీలకు లక్షల కోట్లు కట్టబెట్టేస్తున్నారని.. దర్యాప్తు సంస్థల్ని విపరీతంగా వాడేస్తున్నారని.. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణలు మోడీ మీద అభిమానాన్ని కాస్తా ఏహ్యభావంగా మార్చేస్తున్న పరిస్థితి. అందుకు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినంతనే.. జీవితంలో ఆ పార్టీకి ఓటేయనోడు సైతం పండుగ చేసుకోవటమే నిదర్శనంగా చెప్పాలి.