Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. పెద్దిరెడ్డి సంచలన ఆరోపణ

By:  Tupaki Desk   |   29 Jan 2021 3:50 AM GMT
నిమ్మగడ్డ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. పెద్దిరెడ్డి సంచలన ఆరోపణ
X
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దుందుడుకు చర్యలపై ఏపీ మంత్రులు నిప్పులు చెరిగారు. ఓ రేంజ్ లో తిట్టిపోశారు. మంత్రి పెద్ది రెడ్డి అయితే సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఏపీ ప్రభుత్వం మధ్య ‘పంచాయితీ వార్’ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

తాజాగా పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఏకంగా ఎస్ఈసీ నిమ్మగడ్డపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. విచక్షణాధికారాల పేరుతో బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. గురువారం ఆయన తిరుపతిలో మాట్లాడారు.. కరోనా ఉన్నప్పటికీ.. కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని అన్నారు. 2002 నుంచే ఏకగ్రీవాల ఎన్నికల ఆనవాయితీ నడుస్తోందని.. ఎన్నికల్లో.. అక్రమాలకు పాల్పకుండా.. 19ఏ చట్టం తెచ్చామని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు రాగానే నిమ్మగడ్డ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనుచరుడిగా ఓ రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిమ్మగడ్డపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిధిదాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇది ఫ్యాక్షనిస్టు ధోరణిని తలపిస్తోందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ సూత్రధారిగా మారారని విమర్శించారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయ్యారని.. అందులో భాగంగానే అధికారులపై దుందుడుకుగా దాడికి సిద్ధమయ్యారని మండిపడ్డారు.

పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుస్తుందనే భయంతోనే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.. నిమ్మగడ్డను అంటిపెట్టుకుని ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. టీడీపీకి ఓట్లు రావనే భయంతోనే ఎస్ఈసీ చెలరేగుతున్నాడని అన్నారు. గ్రామాల్లో గొడవలు లేకుండా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిని ఆకాంక్షించేవారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తోడ్పాటు అందించాలని కోరారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు.

మంత్రి వెల్లంపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా టైంలో ఎన్నికల పేరుతో నిమ్మగడ్డ శునకానందం పొందుతున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కంటే చంద్రబాబు శ్రేయస్సే ఆయనకు ముఖ్యమని ఆరోపించారు.