Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ట్వీట్ అస్త్రం ఎవరినుద్దేశించి?

By:  Tupaki Desk   |   3 April 2022 3:30 PM GMT
పవన్ కళ్యాణ్ ట్వీట్ అస్త్రం ఎవరినుద్దేశించి?
X
ఊరికే రారు మహానుభావులు అన్నట్టు జనసేనాని పవన్ కళ్యాణ్ ఏది చేసినా దాని వెనుక ఏదో ఒక నిగూఢ అర్థం ఉంటుంది. చాలా నర్మగర్భంగా ఆయన ట్వీట్లు ఉంటాయి. సోషల్ మీడియాను ఫక్తు ప్రశ్నించడానికే పవన్ వాడుతుంటారు. ప్రజల పక్షాన ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటారు. తన భావాలను సూటిగా పంచులు, కవతిల రూపంలో వ్యక్తీకరిస్తుంటారు.

సాహిత్యం, పుస్తకాలు చదవడం బాగా అలవాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ గొప్ప వ్యాఖ్యలను వాటిలోంచి తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో మరో ఆసక్తికరమై కోటేషన్ ను పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. అదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సోషలిస్ట్ దిగ్గజం రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఉన్న ఓ కొటేషన్ ను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. “శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది..అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే..” అని గొప్ప స్ఫూర్తినిచ్చే కొటేషన్ ను పవన్ ట్వీట్ చేశాడు.

బీసీ, ఎస్సీలు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతపై రామ్ మనోహర్ లోహియా ఆలోచనా విధాన్ని ప్రతిఫలించేలా రయిత వాకాడ శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారని పవన్ వివరించారు. అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు పవన్ ఎందుకు చేశారు? ఎవరిని ఉద్దేశించి చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది.

మంచి కోట్ అని పెట్టారా? లేక ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అని అందరూ ఆరాతీస్తున్నారు. ఇది వరకూ కూడా పవన్ కళ్యాణ్ గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పిన సూక్తులు, కొటేషన్లు పంచుకున్నారు. ప్రస్తుతం చేసిన ట్వీట్ గురించి మాత్రం చర్చ సాగుతోంది.