Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పవన్ ‘రౌండ్ టేబుల్’ సమావేశం

By:  Tupaki Desk   |   11 Oct 2021 12:55 PM GMT
ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పవన్ ‘రౌండ్ టేబుల్’ సమావేశం
X
గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న జనసేన అధినేత పవన్‌కల్యాన్ ఒక్కసారిగా దూకుడు పెంచారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో నిత్యం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సహజంగానే యువతలో పవన్‌కు మంచి క్రేజ్ ఉంది. వారిలో ఆలోచన రేకిత్తించి ఓటు బ్యాంక్‌గా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల పవన్ ఎత్తుగడలను చూస్తుంటే సుదీర్ఘమైన కార్యచరణను రూపొందించుకునట్లు అర్థమవుతుంది. దీనికి బీజం హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక పడింది. ఈ వేడుకను ఆయన తనకు అనుకూలంగా మలుచుకోవడం సక్సెస్ అయ్యారు.

అయితే ఆ తర్వాత పవన్‌ వ్యాఖ్యలను వరసబెట్టి మంత్రులు నుంచి వైసీపీ కార్యకర్తల వరకు ఒక్క సీఎం జగన్ మినహా అందరూ ఖండించారు. ఓ రకంగా పవన్‌పై యుద్ధాన్ని కూడా ప్రకటించారు. పవన్ కావాలనే వైసీపీ నేతలను రాజకీయ చదరంగంలోకి దింపి అందులో విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. పవన్ ఒక్కరే ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తే మంత్రివర్గమంతా కలిసి ముకుమ్మడి దాడి చేసి పవన్‌ను ‘హీరో’ చేశారని అనే వారు కూడా ఉన్నారు. అక్టోబర్ 2న జనసే ఆధ్వర్యంలో శ్రమదానం చేయాలని ఉపక్రమించారు. ముందుగా అనుకున్నట్లు ధవళేశ్వరం ఆనకట్టపై శ్రమదానం చేయాలని అనుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ అధికారులు టెక్నికల్ కారణాలతో అనుమతి ఇవ్వలేదు. దీంతో రాజమండ్రిలోని హుకుంపేట సమీపంలోని బాలాజీపేటకు మార్చుకున్నారు. అదే రోజు అనంతపురం జిల్లాలోని కొత్తచెరువు-పుట్టపర్తి రహదారిలో గుంతలకు మరమ్మతులు చేయాలని అనుకున్నారు. పోలీసుల ఆంక్షల నడుమ ఈ రెండు కార్యక్రమను జనసేన నేతలు దిగ్విజయంగా ముగించుకున్నారు. కొత్తచెరువు-పుట్టపర్తి రహదారిపై ఏర్పడిన గుంతలకు ఆర్అండ్‌బీ అధికారులు ఆగమేఘాల మీద మరమ్మతులు చేపట్టారు. రోడ్ల దుస్థితిపై జనసేనాని తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో జిల్లాలోని దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం రూ.8 కోట్లు విడుదల చేశారు. ఇది జనసేన విజయానికి తొలిమెట్టుగా భావించినట్లుగా ఉన్నారు. ఇదే దూకుడుతో ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం అప్పులతో నెట్టుకోస్తోందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విపపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని జనసేన తన కార్యచరణలో భాగం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం’ అనే నినాదంతో పవన్ కల్యాణ్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమావేశలో మేధావులు అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు. ఈ సమావేశానికి జస్టిస్ లక్ష్మణరెడ్డి, ఆంజనేయరెడ్డి, జయప్రకాష్ నారాయణ, ఐవైఆర్ కృష్ణారావు, ఉండవల్లి అరుణ్ కుమార్, చలసాని శ్రీనివాసరావు తదితరులున్నారు. వీరితో పాటుగా ప్రజాసంఘాల నాయకులను, రైతు సంఘాల నేతలను పవన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మేధావులను పిలిచి ఆర్థిక లెక్కలు తేలుస్తారని చెబుతున్నారు. ఇటీవల పవన్ ట్వీటర్లో ఏపీ ఆర్థిక పరిస్థితిపై ట్వీట్ చేస్తుండటంతో ఇందులో భాగమేనని చెబుతున్నారు. ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ అని ఒకసారి. ‘దివాళాదిశగా ఏపీ ఆర్థిక పరిస్థితి’ అంటూ వ్యాఖ్యనిస్తున్నారు. ఆరు లక్షల కోట్లకు పైగా అప్పుల్లో రాష్ట్రం ఏపీకి ఈ పరిస్థితి కారణం ఎవరంటూ ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు.

గతంలో కూడా పవన్‌కల్యాణ్ పలు సమస్యపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఏపీ సమస్యలపై కూడా ఓ సమావేశం నిర్వహించారు. అయితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారే తప్ప. ఆ తర్వాత ఎలాంటి కార్యచరణ చేపట్టకపోవడం విశేషం. ఈ రెండు సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించారు. ఇప్పుడు చేపట్టబోయే రౌండ్ సమావేశాలు ఏమేరకు ఫలితాన్ని ఇస్తాయో? మునుపటి లాగే వదిలేస్తారో లేక ఏపీ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తారో వేచిచూడాలి.