Begin typing your search above and press return to search.

పవన్ కి అసలు సంగతి ఇపుడు అర్ధమైందా...?

By:  Tupaki Desk   |   10 July 2023 7:00 AM GMT
పవన్ కి అసలు సంగతి ఇపుడు అర్ధమైందా...?
X
తాను ఏకంగా 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నానని పవన్ తాజాగా మరోసారి చెప్పుకున్నారు. అలా నలిగి నలిగి పనిచేస్తేనే ఈ స్థితికి వచ్చామని ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేత సమావేశంలో చెప్పారు. తనలా ప్రతీ సైనికుడూ కష్టపడాలని ఆయన సూచించారు. తాను వారాహి రధమెక్కి చేస్తున్న ప్రసంగాలు జనాల్లోకి బలంగా దూసుకుని వెళ్తున్నాయని పవన్ అంటున్నారు.

అయితే అలా ప్రజలలో వచ్చిన పాజిటివ్ రియాక్షన్స్ ని ఒడిసిపట్టుకుని పార్టీని పటిష్టపరచే చర్యలకు ఎందుకు ఉపక్రమైంచడంలేదని పవన్ పార్టీ నేతలకు తనదైన శైలిలో క్లాస్ తీసుకున్నారు. నేను వచ్చాను వెళ్లాను అన్నట్లుగానే పార్టీ యాక్టివిటీ ఉంటే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీ అన్నాక ప్రతీ నాయకుడు బాధ్యతగా ఉండాలని, పార్టీ భావజాలాన్ని జనంలో ఉంచాలని తన యాత్రల ద్వారా వస్తున్న స్పందనను అంతా పోగు చేసి పార్టీని ఎక్కడికక్కడ బలంగా తయారు చేయాలని ఆయన కోరడం విశేషం.

దీనికి సంబంధించి తన వద్ద ఉన్న ఫీడ్ బ్యాక్ ని ఆయన వారికి వన్ టూ వన్ భేటీలో చెబుతాను అన్నారు. అంతే కాదు ఒక ప్రశ్నావళిని తయారు చేసి ప్రతీ నాయకుడిని ఇస్తామని పార్టీ కోసం ఏమి చేశాం, ఏమి చేయాలి అన్నది నాయకులు తెలుసుకోవాలని పవన్ దిశా నిర్దేశం చేసారు.

ఇక పవన్ మరో మంచి మాట కూడా చెప్పారు. తనకు జనాలు ఎపుడు రాకుండా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. 2018లో శ్రీకాకుళం జిల్లా రాజాం కి తాను పర్యటనకు వెళ్తే ఇసుక వేస్తే రాలనంతగా జనాలు వచ్చారని, అయితే ఆ తరువాత ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. జనాలు రావడం ఎపుడూ తనకు ఉందని అది పెద్ద విషయం కాదని వచ్చిన జనాలను పార్టీ వైపుగా మళ్ళించి బలమైన నిర్మాణం చేయాల్సిన బాధ్యత క్యాడర్ లీడర్ తీసుకోవాలని ఆయన సూచించారు.

పార్టీకి జనంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నయని ఆయన చెప్పారు. తాను ఏ ప్రసంగం చేసినా జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని అన్నారు. జనంలో మార్పు రావాలని ఉంది. వైసీపీ ప్రభుత్వం మొదటి రోజునే ప్రజల విశ్వాసం కోల్పోయిందని, జనసేన కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే రోడ్డు మీదకు వచ్చిందంటే ఆ ప్రభుత్వం ఎంతలా ఫెయిల్ అయిందో అని ఆయన అన్నారు.

ఆనాటి నుంచి పెరుగుతున్న వ్యతిరేకత కాస్తా ఇపుడు ఏపీలో వైసీపీకి డెబ్బై శాతం పైగా జనాలు రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉందని పవన్ చెప్పుకొచ్చారు. దీనిని మనం అందిపుచ్చుకుంటే ఏపీలో మార్పు తీసుకుని రావచ్చు అని అన్నారు. తాను కూడా ప్రజలతో నిరంతరం టచ్ లో ఉంటున్నానని, వారు కూడా జనసేన పట్ల అనుకూలంగా ఉన్నారని పవన్ చెప్పుకొచ్చారు.

అందువల్ల తాను ఒక్కడినే కాకుండా పార్టీ అంతా ఒక్కటిగా మారి పనిచేయాలని పవన్ కోరడం విశేషం. ఇదిలా ఉంటే జనసేన విషయంలో అదే మైనస్ అని మొదటి నుంచి అంతా అంటున్నదే. పార్టీ నిర్మాణం పైనా పటిష్టత పైనా పవన్ దృష్టి సారించకపోతే ఆయనతోనే పార్టీ అన్నట్లుగా మారుతోందని వ్యాఖ్యానాలు వినిపించాయి. అయితే ఇపుడు పవన్ కి తత్వం బోధపడింది అని అంటున్నారు.

అందుకే తన సభలు సూపర్ హిట్ అయినా రిజల్ట్ ఎందుకు రావడంలేదు అన్న అంతర్మధనం ఆయనలో బయల్దేరిందని చెబుతున్నారు. ఇది ఒక విధంగా జనసేనకు మేలు చేసేదే అంటున్నారు. పవన్ కి వాస్తవాలు అర్ధమవుతున్నాయని ఈ విధంగా ఆయన పార్టీని పటిష్టం చేసుకోవడం మీద దృష్టి పెడితే ఏపీలో జనసేన బలమైన ఫోర్స్ గా మారుతుంది అని అంటున్నారు. లేకపోతే నేల విడిచి సాము చేసినట్లుగానే అవుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా 2024 ఎన్నికలకు సంబంధించి పవన్ ఎవరినీ నమ్ముకోకుండా తానే ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.

ఒక వేళ పొత్తులు కనుక లేకపోతే ప్లాన్ బీ అన్నట్లుగా పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలనుకుంటున్నారు. ఆ విధంగా సొంతంగా బలపడితేనే రాజకీయంగా రాటుదేలగలమన్న మూల సూత్రం ఇపుడు పవన్ కి వంటబట్టిందని అంటున్నారు. ఈ పరిణామాలతో జనసేనలో సమూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయని అంటున్నారు.