ప్రజలకు కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రజా నాయకులు అవే చెప్పాలి. వారి నుంచి జనాలు అవే ఆశిస్తారు. దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతం అయ్యే ప్రజలకు తమ ఈతిబాధలు ఏ నేత నోట వచ్చినా కొంత స్వాంతన కలుగుతుంది. వాటికి పరిష్కారం చూపిస్తే ఇంకా ఆనందం కలుగుతుంది.
అందుకే నాయకుల సభలకు జనాలు వస్తారు. వారు చప్పట్లు కొట్టరు, హుషార్ చేయరు, అలికిడి హడావుడి అంతకంటే చేయరు. కానీ వారే తమ ఓటు అనే ఆయుధంతో మౌనంగా తీర్పు ఇస్తారు. వారే అసలు తీర్పరులు. కీలక నిర్ణేతలు. అటువంటి వారి విషయంలోనే ఏ నేత ఏమి మాట్లాడినా ఫలితం ఉంటుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం సభలో గర్జించారు. దాదాపుగా సింహ నాదమే చేశారు మిష్టర్ జగన్ నీ సీక్రేట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఎవరినైనా నీ మనిషిని పంపిస్తే వారి చెవుల్లో రక్తాలు కారే పచ్చి నిజాలు చెబుతాను అని పవన్ గంభీరమైన ప్రకటన చేశారు. ఇక చెవులు రిక్కించి వింటానంటే చెబుతాను అని కూడా అన్నారు.
నిజానికి ఎవరో పంపిస్తే వారు చెవులు రిక్కిస్తే చెప్పే సీక్రేట్స్ జనాలకు ఎందుకు. అసలు ఏ రాజకీయ నాయకుడి సీక్రేట్స్ కూడా ప్రజలకు అవసరం లేదు. అవి నిజాలా గాసిప్స్ నా అన్న పట్టింపు కూడా వారికి లేదు. అలాంటి గాలి వార్తలో నిజాలో పుకార్లో నిత్యం వస్తూనే ఉంటాయి.
ఆ మాత్రం దానికి పవన్ లాంటి వారు గొంతు చించుకోవాల్సినదీ లేదు. ఆయన చెప్పాల్సినది ఏంటి అంటే ప్రజా సమస్యల గురించి. ఆయనకు తెలియాల్సిన సీక్రేట్స్ ఏంటి అంటే వైసీపీ పాలనలో తప్పులు. వాటిని జనం ముందు పెడితే రెండు చెవులూ రిక్కించి వింటారు. చాలా ఆసక్తిని చూపిస్తారు.
అంతే తప్ప ఎవరెవరి భాగోతోఅలో జనాలకు ఎందుకు సేనానీ అని అంటున్నారు. నిజమే జగన్ పవన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు అన్న బాధ ఉండవచ్చు. దానికి ఆయన రియాక్ట్ కూడా కావచ్చు. అలాంటి రియాక్షన్స్ అన్నీ మీడియా ముందు ఆయన అయితే బాగుంటుంది. వేలాది జనం వచ్చే చోట పవన్ కోసమే వచ్చే చోట తన సభలో జగన్ కి అంత స్పేస్ ఇచ్చే ఉదార గుణం పవన్ కి ఎందుకు అన్నదే ప్రశ్న.
తన గురించి తక్కువ చెప్పుకుని ప్రత్యర్ధి గురించి మంచో చెడ్డో ఎక్కువ సేపు మాట్లాడడం వ్యూహం తెలిసిన పొలిటీషియన్ చేయాల్సినది కాదేమో అంటారంతా. అందువల్ల పవన్ మాట్లాడాల్సింది జనసేన గురించి. చెప్పాల్సింది తన గురించి. ప్రత్యర్ధిని విమర్శించవచ్చు. కానీ అందులో కూడా ఎక్కువ భాగం పాలసీల మీద మాట్లాడితేనే జనాలు అట్రాక్ట్ అవుతారు వారు చేశారు కదా అన్నారు కదా అని అంటే అది పవన్ ఇష్టం. ఆయన రాజకీయం మాత్రం జన హితం కావాలన్నదే అందరి కోరిక ఆశ.