Begin typing your search above and press return to search.

ద్వారంపూడికి అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చేసిన పవన్!

By:  Tupaki Desk   |   18 Jun 2023 10:50 PM GMT
ద్వారంపూడికి అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చేసిన పవన్!
X
కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కి అల్టిమేట్ వార్నింగ్ జనసేన అధినేత పవన్ నుంచి వచ్చింది. కాకినాడ సభలో పవన్ ప్రసంగం చేయలేదు. ఏకంగా ద్వారంపూడి మీద మాటలతో బాంబులే వేశారు. తన కోపంతో నిప్పులే కురిపించారు. ద్వారంపూది నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చేస్తా. నిన్ను ఈసారి ఎన్నికల్లో అసలు గెలవనివ్వను. నేను ఈ సవాల్ చేస్తున్నా. లేకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అంటూ జనసేనాని విశ్వరూపమే చూపించారు.

నిజానికి పవన్ లో ఆవేశం పాలు ఎక్కువ అంటారు. కానీ ఆయన ఎవరి మీద ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది లేదు. ఏకంగా నీవే నా టార్గెట్ అంటూ పవన్ ఒక్క లెక్కన మండిపోయారు. ద్వారపూడి మీద విమర్శలు చేస్తున్నపుడు పవన్ విశ్వరూపమే చూపించారు. నేను ఇక్కడికే వచ్చేశా. ఈ మంగళగిరిలోనే ఉంటా. నిన్ను ఓడించేవరకూ నేను నిద్రపోను అంటూ చాలెంజ్ చేశారు.

చూడు ద్వారంపూడి గుర్తు పెట్టుకో. ఈ రోజు నుంచే నీ పతనం మొదలైంది, నిన్ను మాజీని చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అంతే అని ఆవేశంతో పవన్ ఊగిపోయారు. ఏం ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావా. నీవు మారేందుకు ఒక్క చాన్స్ ఇస్తున్నా మారకపోతే డీటీ నాయక్ మీ తాతను బేడీలేసి తీసుకెళ్లినట్లు నీక్కూడా భీమ్లా నాయక్ సినిమా చూపిస్తా అంటూ పవన్ స్ట్రాంగ్ వారింగ్ ఇచ్చేశారు.

కాకినాడలో ఎక్కడికి వెళ్ళినా ద్వారంపూడి మీదనే ఫిర్యాదులు వస్తున్నాయని, ముఖ్యమంత్రి అండతో రెచ్చిపోతున్నారని, గోదావరి జిల్లాలు తనకు రాసిచ్చేశారు అని భావిస్తున్నారని, ఏకంగా ఈ ప్రాంతానికి తానే సీఎం అని అనుకుంటున్నారని పవన్ మండిపడ్డారు. రెండున్నరేళ్ళ క్రితం తాగి మత్తులో ద్వారంపూడి తన మీదనే చాలా దారుణంగా మాట్లాడారని, ఇక కాకినాడలో వీర మహిళకు జనసైనికుల మీఅ రౌడీ మూకలతో దాడులు చేయించారని పవన్ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పుకొచ్చారు.

ఆ రోజు నేను మా వాళ్లకు ఒక్క మాట చెప్పి ఉంటే చంద్రశేఖరరెడ్డి అన్న వాడే ఉండేవాడు కాదని పవన్ చెప్పడం విశేషం. నేరాలు చేస్తూ సొంత సామ్రాజ్యం నిర్మించుకుంటున్న ద్వారంపూడి లాంటి వారిని రాజకీయాల నుంచి తప్పించాల్సిందే అపుడే రాష్ట్రం బాగుపడుతుంది అని పవన్ స్పష్టం చేశారు.

ద్వారంపూడి లాంటి వారు రాజకీయాల్లో ఉండకూడదనే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అంటున్నారు. వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్న ద్వారంపూడి లాంటి వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలని పవన్ కోరారు. మొత్తానికి కాకినాడలో చెబుతాను అంటూ పిఠాపురం సభలో ఊరించిన దాని కంటే పది రెట్లుగా పవన్ విశ్వరూపమే చూపించారు. పవన్ గత పదేళ్ల రాజకీయ జీవితంలో కూడా ఇంతటి ఆవేశపూరితమైన ప్రసంగం చేయలేదంటే అది ఏ రేంజిలో ఉందో చూడాల్సిందే.