Begin typing your search above and press return to search.

బాబుని ఇరికించేసిన పవన్... సీఎం సీటు రెండు చేయాల్సిందే...?

By:  Tupaki Desk   |   18 Jun 2023 8:00 AM GMT
బాబుని ఇరికించేసిన పవన్... సీఎం సీటు రెండు చేయాల్సిందే...?
X
ఏపీలో రాజకీయాన్ని కీలక మలుపు తిప్పేది జనసేన అని ఆ పార్టీ వారూ అంటూంటారు. ఇపుడు అదే జరిగేలా ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తులు కుదుర్చుకోవాలీ అంటే మాత్రం కచ్చితంగా సీఎం సీటుని షేర్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితిని పవన్ కల్పించారు. వ్యూహాత్మకంగానే పవన్ సీఎం పదవి మీద మాట్లాడి టీడీపీని బుక్ చేశారు అని అంటున్నారు.

గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ సీఎం పదవి తనకు కావాలని కోరుకున్నారు. పదేళ్ల పాటు తాను ప్రత్యక్షంగా చేస్తూ చూస్తున్న రాజకీయ అనుభవంతో తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేస్తామని అంటున్నారు. తమ ప్రభుత్వ అజెండాను కూడా ఆయన ఆవిష్కరిస్తున్నారు.

ఒక విధంగా పవన్ మనసులో ఏముందో అది బయటపెట్టేసారు. ఏపీలో వచ్చేది టీడీపీయేనని ఒక వైపు ఆ పార్టీ అంటోంది. ఇపుడు జనసేన ప్రభుత్వం అని పవన్ అంటున్నారు. మరి పొత్తులకు ఆస్కారం ఉంటుందా లేదా అంటే ఉంటుంది కానీ అదిఇచ్చి పుచ్చుకునే తీరుని బట్టి ఆధారపడి ఉంటుందని అంటున్నారు. పొత్తులలో భాగంగా ఎక్కువ సీట్లను జనసేన డిమాండ్ చేయడం కచ్చితం అని అంటున్నారు.

జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే జూనియర్ పార్టనర్ అన్న తేడా లేకుండా జనసేనకు కూడా కీలక వాటా ఇవ్వాల్సిందే అంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే టీడీపీ వీక్ నెస్ ని చూసి మాత్రమే అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ఈసారి ఇబ్బంది అవుతుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే జనసేన, బీజేపీలతో పొత్తులకు ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు.

అయితే ఈ రెండు పార్టీలతో 2014 నాటి పొత్తులు ఇపుడు సాధ్యం కావని అంటున్నారు. ఎక్కువ ఎంపీ సీట్ట్లతో పాటు కీలకమైన చోట్ల ఎమ్మెల్యే సీట్లు బీజేపీ కోరే అవకాశాలు ఉన్నాయి. అలాగే జనసేన విషయం తీసుకుంటే తమకు అధికారంలో వాటా కోరేందుకు సరిపడా సీట్లు పొత్తులో భాగంగా డిమాండ్ చేస్తారని అంటున్నారు.

అందువల్ల పొత్తులు కుదిరితే కనుక టీడీపీ ఏ వంద సీట్లకు మాత్రమే పోటీ చేయడానికే వీలుంటుంది అంటున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే పొత్తులు ఫలించి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక కచ్చితంగా జనసేనకు కూడా గెలిచిన సీట్లను బట్టి అధికారంలో వాటా ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.

పవన్ పదే పదే జనసేన ప్రభుత్వం వస్తుంది అని చెబుతున్నారు రేపటి రోజున పొత్తు పెట్టుకున్నా సీఎం సీటు విషయంలో ఒప్పందం చేసుకోకుండా ముందుకు వెళ్తే పవన్ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పైగా జనసేన క్యాడర్ నుంచి కూడా వ్యతిరేకత రావచ్చు. ప్రజలు సైతం విశ్వసించే సీన్ ఉండదు. అందుకే ఈ రోజు బహిరంగ సభల్లో మాట్లాడిన దాన్నే జనసేన పొత్తులలో కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది.

ఒక విధంగా టీడీపీని జనసేన ఈ విధంగా ఇరికించేసిందా అన్న చర్చ వస్తోంది. అధికారం కావాలని ఉన్నపుడు తమ పాత్ర కూడా కీలకం అయినపుడు సీఎం సీటులో షేరింగ్ ఇస్తే తప్పేంటి అన్న వాదన జనసేనలో ఉంది. లేకపోతే తాము ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన నుంచి రావచ్చు. అదే జరిగితే ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలి టీడీపీకే దెబ్బ పడుతుంది. జనసేన తాను అనుకున్న సీట్లను పొత్తులలో అయినా విడిగా అయినా గెలిచేందుకే వారాహి యాత్ర అని అంటున్నారు.

మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏపీలో కూటమి రాజకీయాలు పొత్తు వంటకాలు అన్నీ కూడి కలిపితే అయిదేళ్ల సీఎం పదవిని రెండు ముక్కలు చేసి పంచుకోవాల్సిందేనా అన్న చర్చ సాగుతోంది. టీడీపీ కూడా ఈ కీలక దశలో ఒంటరిగా వెళ్తామని డేరింగ్ స్టెప్ తీసుకుంటుందా అన్న చర్చ కూడా లేకపోలేదు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ పొత్తుల కధ సీఎం పీఠం విషయం ఏ రూపు తీసుకుంటాయో చూడాల్సి ఉంది అని అంటున్నారు.