Begin typing your search above and press return to search.

కత్తిపూడిలో పవన్ స్పీచ్ లో ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   15 Jun 2023 9:30 AM GMT
కత్తిపూడిలో పవన్ స్పీచ్ లో ఏం చెప్పారు?
X
నెలల తరబడి ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. తన ఎన్నికల ప్రచారాన్ని‘వారాహి’తో షురూ చేయాలన్న పవన్ కోరిక తీరింది. ఏపీలో వారాహి ఎలా తిరుగుతుందో చూద్దామన్న వైసీపీ నేతల మాటలు.. ఎలా తిరగదో చూస్తామన్న పవన్ కల్యాణ్ మాటల్ని పక్కన పెట్టేస్తే.. షెడ్యూల్ కు తగ్గట్లే.. అన్నవరం సత్యదేవుడి సమక్షంలో వారాహికి పూజలు నిర్వహించి.. అక్కడి నుంచి మొదలైన వారాహి విజయయాత్ర కత్తిపూడికి చేరుకుంది. దాదాపు పది రోజుల పాటు సాగనున్న యాత్రలో.. తొలి బహిరంగ సభను కత్తిపూడిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. కత్తిపూడిలో కత్తిలాంటి స్పీచ్ ఇచ్చిన పవన్ కల్యాణ్ దాదాపు గంటన్నర పాటు మాట్లాడారు.

తన ప్రసంగంలో తన రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసే అంశాల్ని ప్రస్తావిస్తూ.. తన ఆశల్ని.. ఆశయాల్ని ప్రజలకు చెబుతూనే.. తనను వీడని కన్ఫ్యూజన్ మాటల్ని అక్కడక్కడా ప్రస్తావించారు. ఇంతకూ పవన్ ఏమన్నారు? ఆయన స్పీచ్ లో హైలెట్ పాయింట్లు ఏమున్నాయి? అన్నది పవన్ మాటల్లోనే చూస్తే..

- సొంత బాబాయి హత్య కేసులో చేతికి రక్తపు మరకలు అంటుకున్న వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు.. చిన్నాయన కూతురు తన తండ్రి హత్యకు కారకులెవరో తెలియాలని పోరాడుతుంటే, చంపిన వారిని వెనకేసుకొస్తున్న వారి పాలనలో మనం ఎంత భద్రంగా ఉన్నామో ప్రజలు ఆలోచించాలి..?

- 18 ఎస్సీ పథకాలను రద్దు చేసిన ప్రభుత్వంలో, బీసీ సబ్ ప్లాన్ అటకెక్కించిన నాయకత్వంలో, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేదే లేదని తెగేసి చెప్పిన నాయకుడి పాలనలో మనమున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

- సంపదను దోచి, మళ్లీ దాన్ని ప్రజలకు పంచే నాయకులు కావాలో, సంపద సృష్టించి అన్నీ వర్గాలకు పంచి పెట్టే పాలన కావాలో ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

- అధికార మదంతో ఎన్ని అడ్డంకులు, ఎన్ని వ్యూహాలు పన్నినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ శాసనసభలో అడుగు పెట్టకుండా ఎవరూ ఆపలేరు. నిజాయతీ గల శాసన సభ్యులు చట్ట సభల్లో ప్రజా సమస్యలపై మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తాం. ప్రజల గొంతు బలంగా వినిపిస్తాం.

- వచ్చే సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ ఒంటరిగా వస్తుందా? ఉమ్మడిగా వస్తుందా? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదు. ఆ రోజు వస్తే కచ్చితంగా ప్రజల మధ్యనే పారదర్శకంగా చెబుతాం. కుట్రలు, కుతంత్రాలతో గత ఎన్నికల్లో నేను ఓడిపోయాలా చేశారు.

- లక్ష మంది ఓటర్లు ఉన్న భీమవరంలో 1.08 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇది కుట్ర కాకా ఇంకేంటి? ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను.

- యాత్ర రథనానికి వారాహి అనే పేరు నేను కోరుకుంటే రాలేదు. నేను నిత్యం పూజించే ఆ తల్లి చల్లని దీవెనలు నా వెంట ఉన్నాయి కనుకే ఈ వాహనానికి వారాహి అనే పేరు వచ్చింది.

- రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న వెయ్యిమంది కౌలు రైతు కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున నా సొంత సంపదను సహాయంగా అందించాం. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాల ద్వారా నా కష్టం నుంచి వచ్చిన సంపదను సాయంగా ఇవ్వగలిగాం.

- వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ రాదు.. ఉద్యోగాలు లేవు.. పన్నుల బాదుడుతో ప్రజలు నలిగిపోతున్నారు. మరో పక్క భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులు చేసి సంక్షేమం అంటున్నారు. ఇదేం పద్దతి? అప్పులు చేసి గొప్పతనం అంటే ఎలా? సంపద సృష్టికి రాష్ట్రంలో అపార అవకాశాలున్నా దాన్ని వినియోగించుకోకుండా, అప్పులు చేసి డబ్బులు పంచడం అంటే భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడమే.

- జనసేన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉంటాయి. దానికి తగినట్లుగా రాష్ట్రంలో అన్నీ మార్గాల ద్వారా సంపదను పెంచి సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేసే బాధ్యతను తీసుకుంటాం. చెత్త పన్ను దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ల ఫీజులు వరకు అన్నీ పన్నులు పెంచేశారు. ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బునే మళ్లీ పంచుతూ రాబిన్ హుడ్ లా ముఖ్యమంత్రి మాట్లాడటం చూస్తే నవ్వొస్తోంది.

- ప్రతిపక్ష నాయకుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నపుడు అమరావతికి సేకరించిన భూమి సరిపోదని, మరో 5 వేల ఎకరాలు సేకరించాలని చెప్పారు. అమరావతి రాజధానిగా సంపూర్ణ మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అయోమయంలో ఉన్నారు.

- కులం తాలుకా రాజధాని అని వైసీపీ ఇప్పుడు ప్రచారం చేస్తోంది. మరి అలాంటప్పుడు విపక్షంగా ఉన్నపుడే దాన్ని వ్యతిరేకించి ఉండాల్సింది. ఇప్పుడు కొత్తగా మూడు రాజధానుల నాటకం ఆడుతున్నారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ను వెనక్కు తోయడానికి మాత్రమే అనేది ప్రజలు గమనించాలి.

- ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి మదాపూర్ శివారున ఉండేది. కొన్ని సంవత్సరాల్లోనే ఇప్పుడు టెక్ ప్రాంతంగా మారింది. అభివృద్ధి రాత్రికి రాత్రి జరగదు. దానికి పాలకుల ముందు చూపు, సమయం చాలా అవసరం. జనసేన పార్టీ కచ్చితంగా రాష్ట్రానికి అమరావతి రాజధానిగా కట్టుబడి ఉంది. అమరావతిలో అన్నీ కులాలున్నాయి. వారిని కలిపే ఆలోచన, పాలసీలను వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తే కచ్చితంగా స్వాగతించే వాడిని. అది జరగలేదు.

- కొత్తగా పెళ్లైన దంపతులకు పెళ్లి కానుక, షాదీ ముబారక్ వంటి పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇటీవల పథకాలు అమలు చేస్తున్నా బోలెడు నిబంధనలు పెట్టారు. జనసేన ప్రభుత్వంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు పెళ్లి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రంతో పాటు కొత్త రేషన్ కార్డు అందిస్తాం. వారు కొత్తింటికి తగిన ప్రాధాన్యం ఇస్తాం. బీపీఎల్ వారికే కాక కొత్తగా పెళ్లైన అందరికి ఈ పథకాన్ని వర్తించేలా చేస్తాం.

- ఓ నాయకుడు గట్టిగా అనుకుంటే కులాల మధ్య సఖ్యత తీసుకురాగలడు. అలాగే విద్వేషాలు రెచ్చగొట్టగలడు. ఎస్సీ, బీసీ నాయకులతో నన్ను తిట్టించి.. మళ్లీ మనం మనం తిట్టుకునేలా చేయడమే వైసీపీ నైజం.

- ఎన్నికల వస్తుంటే వైసీపీకి బీసీగర్జనలు గుర్తుకొస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాత్రం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి, ఎన్నికల్లో 16,800 మంది బీసీలు పదవులకు వైసీపీ ఎసరు పెట్టింది. తెలంగాణలో 18 బీసీ కులాలను తొలగిస్తే వైసీపీ సర్కారు పక్క రాష్ట్రం పెద్దలతో కనీసం మాట్లాడింది లేదు.

- ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే నా ఎస్సీ సోదరులు అంటారు. వారి సంక్షేమానికి కీలకమైన 18 సంక్షేమ పథకాలను తీసేశారు. దళిత డ్రైవర్ ను చంపేసి ఇంటికి పార్శిల్ చేసిన వ్యక్తులకు ఏ పార్టీ వంత పాడుతుందో యువత అర్ధం చేసుకోవాలి.

- కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని చెప్పినా... వైసీపీకి ఓటేస్తే కాపులకు ప్రాధాన్యం లేదు. రాష్ట్రంలో సుమారు 600 నామినెటేడ్ పోస్టుల్లో ఏకంగా 500 వరకు తన సొంత సామాజిక వర్గానికే కట్టబెట్టిన వ్యక్తి. అందరినీ అందలం ఎక్కిస్తానంటే నమ్మడం సాధ్యమా..? ప్రజలు ఆలోచించాలి.

- వైసీపీ పాలనలో పంచాయతీలకు నిధులు లేవు. కనీస పనులు కానరావడం లేదు. కేరళలో పంచాయతీలకు సుమారు 40 శాతం మేర నిధులు కేటాయిస్తారు. కేంద్రం నుంచి ఒక్కో పంచాయతీకు రూ.7 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు కేంద్రం నిధులు వస్తాయి. అవి అందడం లేదు. కనీస పారిశుద్ధ్య పనులు జరగడం లేదు. దీనికి తోడు ప్రతి ఇంటి నుంచి వసూలు చేస్తున్న రూ.90 చెత్త పన్నును ఏం చేస్తున్నారో తెలియదు. జనసేన ప్రభుత్వంలో పంచాయతీల నిధులు కచ్చితంగా వారికి అందేలా పనిచేస్తాం.

- భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి సంబంధించిన రూ.450 కోట్లు ఎటు పోయాయో తెలియదు. ఇసుక పాలసీ పేరుతో వైసీపీ ప్రభుత్వం 3 కంపెనీలకు ఇసుక నిర్వహణ కట్టబెట్టింది. చిత్తూరుకు చెందిన ఓ బడా నాయకుడి కంపెనీలు ఉన్నాయి. అసలు కంపెనీలను పక్కన పెట్టి వైసీపీ నేతలు ఆజమాయిషీ చెలాయిస్తున్నారు.

- జనసేన ప్రభుత్వంలో ఇసుకపై ఆధారపడిన వారికి కాంట్రాక్టులు కేటాయిస్తాం. పేదలకు ఉచిత ఇసుక అందించేందుకు కట్టుబడి ఉన్నాం. అలాగే ఇసుక కాంట్రాక్టులను సైతం దానిపై ఆధారపడిన వారికే ఇస్తాం. మైనింగ్ వనరుల దోపిడీని సాగనివ్వం.

- పోలవరం పూర్తి కావాలంటే జనసేన ప్రభుత్వంతోనే సాధ్యం. పోలవరం పూర్తి కోసం మా ప్రణాళికను త్వరలోనే ప్రజల ముందు పెడతాం. కేంద్రంతో సఖ్యతగా ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే మాత్రం ఊరుకోం.