Begin typing your search above and press return to search.

వారానికి ఒక్క‌సారి వ‌స్తేనే త‌ట్టుకోలేక‌పోతున్నారు.. నేనేంటో చూపిస్తా: ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   18 Dec 2022 12:40 PM GMT
వారానికి ఒక్క‌సారి వ‌స్తేనే త‌ట్టుకోలేక‌పోతున్నారు.. నేనేంటో చూపిస్తా:  ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ అధికార‌పార్టీ వైసీపీపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం న‌డుస్తోంద‌ని, దీనిని అంతం చేయాలంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని అధికారం నుంచి త‌రిమి కొట్టాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని తెగేసి చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత త‌న‌ద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. వైసీపీ నేతలు మాట్లాడే మాటలన్నీ పనికిమాలినవని దుయ్య‌బ‌ట్టారు. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం చెబుతాన‌న్నారు.

అదేస‌మ‌యంలో వైసీపీ నేత‌లు త‌న‌ను రాజ‌కీయంగా, ఆర్థికంగా సినిమాలు ఆడ‌కుండా ఎంత తొక్కాలని చూసినా తాను అంత పైకి లేస్తానని ప‌వ‌న్ అన్నారు. అధికారం అంటే తెలియ‌ని, చూడని కులాలకు అధికారం ఇచ్చి చూడాలన్నారు. త‌న‌ను వైసీపీ నాయ‌కులు `వీకెండ్ పొలిటీషియన్` అంటున్నారని, అయితే, తాను వారానికి ఒకసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నారని పవన్ అన్నారు. కాపు కులాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది నాయకులు ఎదుగుతున్నారని చెప్పారు.

కొత్త ప్రభుత్వం రాకపోతే ఏపీ అంధకారంలోకి వెళ్తుందని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారుతుంద‌ని చెప్పారు. వైసీపీ నేతలవి ఉత్తర కుమార ప్రగల్భాలని ఎద్దేవాచేశారు. మంత్రి అంబటి రాంబాబు కాపుల గుండెల్లో కుంపటి పెడుతున్నార‌ని దుయ్యబట్టారు. శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని ధ్వజమెత్తారు. తనకు సినిమాలే ఆధారమని, అంబటిలాగా కాదన్నారు.

కాపు నేతలతో త‌న‌ను పచ్చి బూతులు తిట్టిస్తున్నారని ప‌వ‌న్‌ మండిపడ్డారు. తానెలా తిరుగుతానో చూస్తామని వైసీపీ గాడిదలు ఓండ్ర పెడుతున్నాయని, బాధ్యత లేకుండా మాట్లాడే నేతలకు బలంగా సమాధానం చెబుతానని పవన్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత తనదన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.