Begin typing your search above and press return to search.

బీజేపీ ఫోన్...మా యుద్ధం మాదే అంటున్న పవన్

By:  Tupaki Desk   |   16 Oct 2022 2:18 PM GMT
బీజేపీ ఫోన్...మా యుద్ధం మాదే అంటున్న పవన్
X
ఏపీలో అఫీషియల్ గా బీజేపీతో పవన్ కళ్యాణ్ జనసేన పొత్తు ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 2020 జనవరిలో ఈ పొత్తు కుదురింది. అయితే 2021 ఏప్రిల్ లో జరిగిన తిరుపతి లోక్ సభ బై పొల్ తరువాత ఈ పొత్తు పెద్దగా ముందుకు సాగడం లేదు అన్నది అయితే ప్రచారంలో ఉన్న మాట. పవన్ తోవ పవన్ దే అన్నట్లుగా ఆయన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు.

మరో వైపు చూస్తే బీజేపీ తన శక్తి మేరకు బలం మేరకు జనంలోకి వస్తోంది. అయితే బీజేపీలో మాత్రం జనసేనతోనే మా పొత్తు అని ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఉన్న నాయకులు అంతా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ కూటమిగా ఎన్నికలను ఎదుర్కొంటామని అంటున్నారు. కానీ అదే మాట పవన్ నోటి వెంట రావడంలేదని అంతా అంటారు.

ఇదిలా ఉండగా ఏపీలో టీడీపీతో కలసి నడవాలని జనసేన ఆలోచిస్తోంది అని కూడా ప్రచారం సాగుతోంది. కుదిరితే బీజేపీతో కలిపి 2014 నాటి పొత్తులను రిపీట్ చేయాలని కూడా జనసేన వెయిట్ చేస్తోంది. కానీ బీజేపీ ఇప్పటిదాకా అయితే ఏపీలో టీడీపీతో పొత్తుల మీద పెదవి విప్పలేదు. దాంతో ఈ సందిగ్దం ఇలా కొనసాగుతోంది

ఇదిలా ఉంటే బీజేపీతో పవన్ సంబంధాలు ఎలా ఉన్నాయి అన్నది చర్చకు వచ్చినపుడు గ్యాప్ ఉంది అనే అంటున్నారు. దానికి ఉదాహరణలుగా ఈ మధ్యనే భీమవరం టూర్ కి ప్రధాని మోడీ వస్తే ఆహ్వానం ఉన్నా పవన్ పాల్గొనలేదు అని చెబుతున్నారు. అలాగే ఢిల్లీలో ఆజాదీ అమృతోత్సవ్ కార్యక్రమం మీద ప్రధాని దేశంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తే దానికి కూడా పవన్ వెళ్లలేదు.

దాంతో పాటు పవన్ ఈ ఏడాది మార్చిలో బీజేపీ వారిని బహిరంగంగా అడిగిన రోడ్ మ్యాప్ మీద కూడా వారు ఎటూ తేల్చి చెప్పకపోవడం వల్లనే పవన్ ఇలా దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉండగా విశాఖ తాజా టూర్ లో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రతి చిన్న విషయానికి మా మిత్ర పక్షం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని వారితో చెప్పాలని లేదని విశాఖలో తన పార్టీ నేతల అరెస్టుల మీద కామెంట్స్ చేశారు. ఏపీలో జరిగే అన్ని విషయాల మీద మమ్మీ డాడీ అంటూ కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయలేమని ఆయన అనడమూ విశేషం.

మాదీ ఒక రాజకీయ పార్టీ. మా యుద్ధం మేము చేసుకుంటామని ఆయన అనడం బట్టి కేంద్రంలో బీజేపీ సాయం తమకు వైసీపీతో పోరులో పెద్దగా అవసరం లేదనే అన్నట్లుగా మాట్లాడారు. ఇక మరో విషయం ఏంటి అంటే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు జనసేన కార్యకర్తల అరెస్ట్ మీద ఫోన్ చేసి పవన్ తో మాట్లాడారు. వాటిని ఆయన బహిరంగంగా ఖండించారు కూడా. పవన్ అరెస్ట్ అవుతారు అన్న వార్తల నేపధ్యంలో ఆయన్ని టచ్ చేయాలనుకుంటే ఏం జరుగుతుందో చూస్తారంటూ ఏపీ సర్కార్ మీద నిప్పులే చిరిగారు.

ఆ మీదట పవన్ తో ఫోన్ లో మాట్లాడుతూ తాను విశాఖ వస్తానని సోము చెప్పగా ప్రస్తుతం అంతా బాగానే ఉంది రావాల్సిన అవసరం లేదన్నట్లుగా పవన్ జవాబిచ్చారని అంటున్నారు. అంటే తమ మిత్రుడికి సాయంగా బీజేపీ రంగంలోకి దిగాలనుకున్నా పవన్ మాత్రం తనది ఒంటరి పోరాటమే అని తేల్చి చెప్పారా అన్నట్లుగా చర్చ అయితే సాగుతోంది.

మరో వైపు చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పవన్ తో ఫోన్ లో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నారని సమాచారం. ఒక చంద్రబాబు లోకేష్ బాహాటంగానే జనసేన కార్యకర్తల అరెస్ట్ ని ఖండించారు. అంతే కాదు పవన్ కార్యక్రమాలకు పోలీసులు అడ్డు తగలడాన్ని కూడా వారు తప్పు పట్టారు. ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీ సాయం వద్దు అని పవన్ ఎందుకు అనుకుంటున్నారు అన్నదే పాయింట్ ఇక్కడ.

మేము ఒక స్వతంత్ర పార్టీ, మా పోరాటం మేము చేసుకుంటామని మీడియా ముందే ఎందుకు చెబుతున్నారన్నదే చర్చగా ఉంది. పవన్ వైఖరి చూస్తే బీజేపీ మీద గుర్రుగా ఉన్నారా అన్న మాటలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలు వైసీపీతో స్నేహంగా ఉంటూ రావడాన్ని ఆయన తప్పుపడుతున్నారని, ఆ బంధాలు తెంచుకుంటేనే మన బంధం కలిసేది అని ఆయన ఖండితంగా చెప్పదలచుకున్నారని అంటున్నారు.