Begin typing your search above and press return to search.

చిరంజీవిని పవన్ తప్పుపడుతున్నారా ?

By:  Tupaki Desk   |   21 Aug 2022 5:06 AM GMT
చిరంజీవిని పవన్ తప్పుపడుతున్నారా ?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడేమి మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదు. కడప జిల్లా సిద్ధవటంలో పవన్ పర్యటించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు పరిహారం ఇచ్చే విషయంపై బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోజు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబట్టే ఏపీకి ఇప్పుడీ దుస్ధితి వచ్చిందని తెగబాధపడిపోయారు. వైసీపీలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు, మంత్రులుగా పనిచేసిన వారే దగ్గరుండి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయించినట్లు ఆరోపించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసింది సోదరుడు చిరంజీవి. ఆ పార్టీలో నూరుశాతం యాక్టివ్ గా ఉన్నది బావ అల్లు అరవింద్, పవన్+మరో సోదరుడు నాగుబాబే. వీళ్ళకు అదనంగా మరికొందరు కూడా పార్టీ వ్యవహారాలను చూసేవారు. చిరంజీవితో పాటు కుటుంబంలోని ఇంతమంది పార్టీలో ఉండేసరికి ప్రజారాజ్యం పార్టీ కాస్త కుటుంబ పార్టీ గా మారిపోయింది. అలాగే కాపుల్లోని కొందరు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల పార్టీ మీద కాపుల పార్టీగా ముద్ర పడిపోయింది.

పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకున్న చిరంజీవికి తీవ్ర ఆశాభంగమయ్యింది. గెలిచిన 18 మంది ఎంఎల్ఏలను పట్టిపెట్టుకోవటం కష్టమైంది. ఎప్పుడైతే సీఎం అవ్వటం కష్టమని తేలిపోయిందో వెంటనే పార్టీ నిర్వహణ భారమనుకున్నారు. అందుకనే ప్రజారాజ్యంను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. పార్టీని విలీనం అన్నది పవన్ పాత్ర లేకుండానే జరిగిందా ?

ఎందుకంటే ప్రజారాజ్యం అనుబంధ శాఖ యువ రాజ్యానికి పవనే అధ్యక్షుడు. పైగా సోదరుడు కూడా కాబట్టి పవన్ కు తెలీకుండా చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా ముందు కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాత నేతలతో చిరంజీవి మాట్లాడేవారు. పైగా విలీనం ప్రతిపాదనను పవన్ వ్యతిరేకించినట్లు కూడా ఎక్కడా లేదు. అంటే విలీనానికి పవన్ ఆమోదం కూడా ఉన్నట్లే లెక్క. అప్పట్లో ఏమీ మాట్లాడకుండా ఇపుడు అది కూడా అసందర్భంగా విలీనంపై వ్యతిరేకంగా మాట్లాడటమే విచిత్రంగా ఉంది.