Begin typing your search above and press return to search.

సీట్లు బాగా తగ్గుతాయ్ పీకే... ఓకేనా...?

By:  Tupaki Desk   |   7 Aug 2022 3:30 PM GMT
సీట్లు బాగా తగ్గుతాయ్ పీకే... ఓకేనా...?
X
సుబ్బి పెళ్ళి ఎంకి చావుకు వచ్చిందని ఒక ముతక సామెత. ఇక్కడ అలాంటిదే అనుకుంటే అనుకోవచ్చు. అయితే ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా కోరుకున్నదే. కానీ ఆయన పెద్దన్న పాత్రలో ఉండాలని అనుకుని అలా అని ఉంటారు. కానీ ఇపుడు అలా జరగనే జరగదు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయనే కొద్ది నెలల ముందు చెప్పారు కదా వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని. ఆ దిశగానే ఇపుడు ఏపీ రాజకీయాల్లో పరిణామాలు మారుతున్నాయి. బీజేపీ కరుణాకటాక్ష వీక్షణాలు టీడీపీ మీద ప్రసరిస్తున్నాయి. ఇక ఈ దెబ్బకు మనం పవర్ లోకి వచ్చేసినట్లే అని చంద్రబాబు చాలా ఉత్సాహంగా ఉన్నారు.

మోదీతో నాలుగేళ్ల తరువాత చేతులు కలిపిన బాబు ఏపీ సీఎం నేనే నన్నెవరూ ఆపలేరు అని ధీమాగా కూడా ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీతో పొత్తు ఈసారి కుదరవచ్చు కానీ సీట్ల దగ్గర పంచాయతీ మాత్రం అంత తేలిగ్గా తేలే వ్యవహారం కాదు అని అంటున్నారు. బీజేపీ ఇపుడు మంచి దూకుడు మీద ఉంది. తెలంగాణాలో పవర్ మాదే అంటోంది. తెలంగాణాలో 2023లో ఎన్నికలు జరుగుతాయి. అక్కడ కచ్చితంగా పాగా వేయాలని బీజేపీ అనుకుంటోంది.

దానికి టీడీపీ సాయం తీసుకుంటుంది. అది వేరే విషయం. కానీ తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక బాబుని భేఖాతరు చేసి పొత్తులలో పెద్దన్న పాత్రకు సిద్ధమవుతుంది. అలా కాదు సెకండ్ ప్లేస్ అంటే కాంగ్రెస్ ప్లేస్ లోకి వచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్రగా అక్కడ మారిందనుకోండి అది కూడా ఏపీ మీదనే అతి పెద్ద ప్రభావం చూపిస్తుంది అనే చెప్పాలి. మాకు బలం బాగా పెరిగింది అంటూ ఏపీలో సీట్ల పేచీకి కమలనాధులు దిగిపోతారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి తీరుతుంది అని బీజేపీ నేతలు ఆశగా ఉన్నారు.

ఇక ఏపీలో 2024లో ఎన్నికలు జరుగుతాయి. అంటే తెలంగాణా ఎన్నికల తరువాత అన్న మాట. దాంతో ఏపీలో బీజేపీ తన ప్రతాపం చూపించడానికి మంచి చాన్స్. ఇప్పటి మాట అయితే కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలకు జిల్లాకు ఒక సీటు వంతున అడగాలని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణాలో పవర్ కనుక వస్తే కచ్చితంగా ఆ సంఖ్య నలభైకి పెంచినా ఆశ్చర్యం లేదు. దాంతో ఇది బాబుకు అతి పెద్ద పేచీ కిందనే లెక్క అంటున్నారు.

చంద్రబాబు తో బీజేపీ పొత్తు 2014 ఎన్నికల్లో కుదిరింది. అప్పట్లో 12 సీట్లు ఇచ్చి చంద్రబాబు మోడీ హవాను తన వైపునకు తిప్పుకున్నారు. అందులో నాలుగు సీట్లు మాత్రమే బీజేపీ గెలిచింది. అది వేరే సంగతి. కానీ ఈసారి మాత్రం ఎలాంటి పరిస్థితి అయినా అలా కాదు పాతిక ముప్పయి సీట్లకు తగ్గరాదు అని కమలనాధులు ఒట్టు పెట్టేసుకున్నారు. దాంతో బాబుకు మా చెడ్డ పితలాటకమే ఎదురుకాబోతోంది. ఇక బాబు కూడా ఏమీ అనలేని పరిస్థితి అపుడు ఉంటుంది. ఎందుకంటే అప్పటికి బాబుతో తన రాజకీయ అవసరాల‌ను తెలంగాణాలో పూర్తిగా వాడేసుకుని బీజేపీ ఒడ్డున ఉంటుంది. ఏపీలో మాతో పొత్తు కావాల్సి వస్తే ఇన్ని సీట్లు ఇవ్వాల్సిందే అని పేచీకి దిగితే బాబుకు అది రాజకీయ గండమే అంటున్నారు.

ఇక ఈ బీజేపీ పొత్తు జనసేనకు కూడా గుదిబండగా మారుతుంది అని అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో జనసేన టీడీపీని 75 సీట్ల దాకా బేరం పెడుతోందని టాక్. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి టీడీపీకి ఇష్టం లేదు, అది కుదరదు కాబట్టి ముప్పయి నుంచి బేరమాడి నలభై దగ్గర ఫిక్స్ చేస్తారని అంటున్నారు. ఇపుడు బీజేపీ కూడా మధ్యన దూరితే పవన్ సీట్లకు భారీ కోత పడుతుంది అని అంటున్నారు. అదెలా అంటే పాతిక సీట్లు బీజేపీకి ఇచ్చి జనసేనకు ముప్పయి సీట్లతో కధ ముగిస్తారు అని అంటున్నారు. అపుడు జనసేన నుంచి పేచీలు ఉన్నా మారాలు చేసినా ఎటూ బీజేపీ మిత్రుడిగా ఉంటుంది కాబట్టి దిగి రావాల్సిందే అన్న మాట ఉంది.

మొత్తానికి పవర్ షేర్ తో మొదలెట్టి సగం సీట్లను ఇవ్వాలని డిమాండ్ చేద్దామనుకుంటున్న జనసేనకు బీజేపీ టీడీపీ వైపుగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే మాత్రం భారీ కోత తప్పదనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో కానీ ఈ కొత్త పొత్తులు ఏపీ రాజకీయాల్లో రకరకాలైన పరిణామాలకు దారి తీయవచ్చు అని అంటున్నారు.