Begin typing your search above and press return to search.

పవన్ మెచ్చిన వైసీపీ మాజీ మంత్రి...?

By:  Tupaki Desk   |   7 Aug 2022 1:30 PM GMT
పవన్ మెచ్చిన వైసీపీ మాజీ మంత్రి...?
X
పవన్ కళ్యాణ్ కి వైసీపీ అంటే గిట్టదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ వైసీపీ నేతలు ఉన్నారే అంటూ ఆయన స్పీచ్ ని ప్రారంభిస్తారు. అయితే పవన్ కూడా ఇన్నేళ్లలో ఇపుడిపుడే కాస్తా రాజకీయం నేర్చుకుంటున్నారు. అందరి వైసీపీ నేతలు కాదు కానీ కొందరు అంటూ ఆయన కొంత కన్సిషన్ ఇస్తూ కూడా అలా టార్గెట్ చేసిన వారి మీదనే హార్హ్ గా మాట్లాడుతుంటారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి జగన్ అంటే ఎందుకో తెలియని ద్వేషం అని అంతా అంటారు. ఆయన పేరు వింటే ఒంటికాలి మీద లేచే పవన్ అదే జగన్ కి దగ్గర బంధువు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలా నేస్తం అయ్యాడో మరి. ఇదంతా చూస్తే భలే తమాషాగా ఉంటుంది.

ఇక జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ముగ్గురుకి చాలెంజి విసిరారు. అందులో ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. ఆయన మూడు నెలల క్రితమే మాజీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో బిగ్ షాట్. మరి ఆయనకు పవన్ కి మధ్య ఇంతటి సయోధ్య ఎలా వచ్చిందో చూడాలి.

దానికి కూడా ఒక కారణం ఉంది అంటున్నారు. ఈ మధ్య ప్రకాశం జిల్లాలో కొందరు జనసేన నాయకుల మీద వైసీపీ వారు కేసులు పెట్టిస్తే పవన్ అవి తప్పుడు కేసులు బాలినేని లాంటి వరు అయినా జోక్యం చేసుకుని వారిని విడిపించాలని కోరారు. దానికి పాజిటివ్ గా రియాక్ట్ అయిన బాలినేని జనసేన నేతల మీద కేసులు లేకుండా చూశారు. బహుశా అక్కడే బంధం పడినట్లు ఉంది. దానిని కంటిన్యూ చేస్తూ ఇపుడు ఈ చాలెంజిలో ఆయనను పవన్ తీసుకువచ్చారు.

ఈ చేనేత చాలెంజి ఏంటి అంటే చేనేత వస్త్రాలను ధరించి ఫోటో తీసుకుని షేర్ చేయాలి. ఈ చాలెంజిలో పవన్ మరో ఇద్దరిని కూడా భాగస్తులను చేశారు. వారే టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్. వారిద్దరూ అంటే పవన్ కి మిత్రులే. బాలినేని ఇపుడు కొత్త మిత్రుడు అన్న మాట. ఏపీలో వైసీపీని గద్దె దిగాలని తీవ్రాతితీవ్రంగా వ్యతిరేకిస్తూ డిమాండ్ చేస్తున్న పవన్ కోరి మరీ బాలినేనికి ఈ చాలెంజి విసరడమే ఇపుడు రాజకీయ చర్చగా ఉంది.

దీని మీద బాలినేని ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఆయన వరకూ చూస్తే ఇలాంటి విషయాల్లో పాజిటివ్ గానే రియాక్ట్ అవుతారు. కానీ అక్కడ ఉన్నది జగన్. పవన్ అంటే జగన్ ఏ మాత్రం సానుకూలత చూపించరు. అలాంటి పవన్ తో ఏ రకమైన స్నేహ బంధం అయినా వైసీపీ వారికి ఇబ్బందే. అందునా జగన్ దగ్గర బంధువుకు అది ఇరకాటమే. మరి ఈ సంగతి తెలిసేనా పవన్ ఆయన్ని ఇలా ఇరికించేశారు అని కూడా అంటున్నారు.

మరో వైపు చూస్తే పవన్ కి ఈ చాలెంజ్ చేసింది ఎవరో కాదు తెలంగాణా మంత్రి కేటీయార్. ఆయన చాలెంజి ని పవన్ స్వీకరించారు. మరి పవన్ చాలెంజ్ ని ఆయన ఎంపిక చేసిన ముగ్గురులో ఎవరు స్వీకరిస్తారో చూడాలి. ప్రత్యేకించి అందరి దృష్టి బాలినేని మీద ఉంది. ఇంతకీ బాలినేని చేనేత పంచె కడితే వైసీపీ కంచె దాటినట్లే అని ప్రచారం చేసేవారూ ఉంటారు. మొత్తానికి చేనేతా చేనేతా ఎంత పని చేశావు అని ఆనక మధనపడాల్సి ఉంటుందేమో.