Begin typing your search above and press return to search.

ఎంత పని చేశారయ్యా : బీజేపీ దెబ్బకు పవన్ విలవిల...?

By:  Tupaki Desk   |   7 Jun 2022 5:30 PM GMT
ఎంత పని చేశారయ్యా :  బీజేపీ దెబ్బకు పవన్ విలవిల...?
X
బీజేపీ పెద్దన్న కాదన్నారు, కుదరదు అని కూడా నిక్కచ్చిగా చెప్పేశారు. నిజానికి తాము ఒకానొక సందర్భంలో రగిలించిన కోరికను తామే తుంచేసి భేషైన రాజకీయం చేశామని అనిపించుకున్నారు. కమలనాధులకు ఇది మంచిగా ఉన్న మధ్యన పడి నలిగిపోయేది మాత్రం జనసేన మాత్రమే. అసలు విషయం ఏంటి ఎందుకిలా జరిగింది. పవన్ ఎందుకు విలవిలలాడాల్సి వస్తోంది అంటే అదే కదా అసలైన మ్యాటర్.

పవన్ తోనే మాకు పొత్తు. పవన్ మా రెండు పార్టీలకు ఉమ్మడి అభ్యర్ధి అని నాడు గట్టిగా చెప్పుకొచ్చారు బీజేపీ వారు. మరి ఎందుకు చెప్పారు, పవన్ తో మాట్లాడి చెప్పారా. తమ ఢిల్లీ పెద్దలను సంప్రదించి చెప్పారా అంటే ఏమో వారికే తెలియాలి. అలా వారు ప్రకటించిన తరువాతనే జన సైనికులలో మరింత నమ్మకం కలిగింది. ఎంతైనా బీజేపీ జాతీయ పార్టీ, మోడీ, అమిత్ షా బ్రాండ్ ఇమేజ్ ఉన్న పార్టీ. దేశాన్ని ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న బలమైన పార్టీ.

అలాంటి పార్టీ ఉమ్మడి సీఎం అభ్యర్ధి పవన్ అంటే రాజకీయంగా బలం చేకూర్చే అంశం గానే చూడాలి కదా. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని జనసేన రాజకీయ బేరాలకు ఇపుడు రెడీ అయింది. అందుకే ఈ మధ్యన మంగళగిరిలో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ ఇంతకాలం మేము తగ్గాం ఇక తగ్గమని చెప్పారు. అంటే అధికారంలో వాటా కావాలని, సీఎం పోస్ట్ లో వాటా కావాలని కచ్చితంగా కోరడమే.

వెనక బీజేపీ లాంటి జాతీయ పార్టీ దన్ను ఉందని, ఆ పార్టీయే తనను ప్రతిపాదించింది కాబట్టి టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీకి ఏమైనా అభ్యంతరం ఎందుకు ఉండాలన్న వైఖరితోనే పవన్ అలా బిగ్ సౌండ్ చేశారు అనుకోవాలి. అయితే ఈ విషయంలో టీడీపీ దిగువ క్యాడర్ ధీటైన జవాబు ఇచ్చినా అధినాయకత్వం మాత్రం సైలెంట్ గానే ఉంది.

ఒక విధంగా మల్లగుల్లాలు పడుతోంది. అయితే ఎక్కువ సేపు టీడీపీ పెద్దలు బుర్రబద్ధలు కోనీయకుండా బీజేపీయే మందు అందించి ఆ తలనొప్పిని తగ్గించింది. అదేంటి అంటే ఉమ్మడి సీఎం అభ్యర్ధి పేరుని తాము ఇపుడు ప్రకటించమని, ఎన్నికల తరువాతనే అంటూ బీజేపీ నాయకులు తాజాగా చెప్పడం జనసేనకు దెబ్బగా ఉంటే టీడీపీ నెత్తిన పాలు పోసినట్లు అయింది.

నిజానికి బీజేపీ నాయకులు ఈ సమయంలో అలాంటి ప్రకటన ఇవ్వనవసరం లేదు, జనసేనలో కొందరు కీలకనాయకులే దాన్ని కెలికి ఇరవై నాలుగు గంటలలోగా ఏపిలో టూర్ చేస్తున్న బీజేపీ జాతీయ పెద్ద జేపీ నడ్డా చేత ఉమ్మడి సీఎం అభ్యర్ధి పవన్ అని చెప్పించాలని డిమాండ్ చేయడం అల్టిమేటం జారీ చేయడంతోనే కమలానికి కాలి అలా నేతల నోట ఆ మాట వచ్చిందన్న మాట.

లేకపోతే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ చెప్పిన మాట ప్రకారమే ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా పవన్ అని అలా ప్రచారంలో ఈ రోజుకీ నానుతూనే వచ్చేది. ఇదంతా జనసేన నాయకులు కొందరు తాముగా చేసుకున్న పుణ్యమే. ఇలా కోరి మరీ కెలికి బీజేపీ నుంచి క్లారిటీ తెచ్చేసుకున్న తరువాత జనసేన పరువు నిజంగా టీడీపీ ముందు పోయేలా చేసుకున్నారు.

దేశంలో ఘనమైనా కూడా ఏపీలో చూస్తే ఒక చిన్న పార్టీ నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీయే ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా పవన్ పేరుని ప్రకటించకపోతే ఏపీలో అత్యంత బలంగా ఉన్న పార్టీ నలభై శాతం ఓట్ల షేర్ ఉన్న తమ పార్టీ ఎందుకు ఈ ప్రతిపాదనను ఒప్పుకుంటుంది, పవర్ షేర్ కి ఎందుకు ఓకే చెబుతుందని తమ్ముళ్ళు అంటున్నారు.

అంటే పవన్ మంగళగిరిలో చెప్పిన ఆప్షన్స్, పెట్టిన కండిషన్లకు కొద్ది రోజుల వ్యవధిలోనే వ్యూహాత్మకమైన జవాబు దొరికేసింది అన్న మాట. ఇదంతా పవన్ రాజకీయంగా వేసిన తప్పుడు ఎత్తుగడగానే అంటున్నారు. ఆయన గుప్పిట తెరిచేసి తన వ్యూహాలు చెప్పేసి కాని కాలంలో రాంగ్ టైమ్ లో వాటిని బయటపెట్టుకోవడం వల్లనే ఇలా జరిగింది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

మొత్తానికి రెండున్నర ఏళ్ళ స్నేహానికి బీజేపీ పవన్ కి ఏమి చేసింది అంటే కీలక సమయంలో టీడీపీతో బేరమాడే శక్తిని కూడా తగ్గించేసింది అని అంటున్నారు. అయితే ఇదంతా జనసేన స్వయంకృతమని కూడా అనే వారు ఉన్నారు. మరి దీన్ని మించిన ఎత్తుగడ ఏమైనా వేసి జనసేన బయటకు వస్తుందేమో చూడాలి.