Begin typing your search above and press return to search.

కోనసీమ అల్లర్లు ప్రభుత్వం కుట్రే: పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   3 Jun 2022 3:02 PM GMT
కోనసీమ అల్లర్లు ప్రభుత్వం కుట్రే: పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు
X
కోనసీమ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా జరిగినవేనని, ఇందులో ప్రభుత్వం కుట్ర ఉందని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లర్లు జరిగిన అమలాపురంలో ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్‌ కానీ, డీజీపీ కానీ, ఇతర మంత్రులు కానీ ఎందుకు పర్యటించలేదని నిలదీశారు. ఓవైపు కోనసీమలో అల్లర్లు చోటు చేసుకుంటే మంత్రులు బస్సు యాత్ర చేయడంపై మండిపడ్డారు. కోనసీమ అల్లర్లలో జనసేన కార్యకర్తలే ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. మంత్రి విశ్వరూప్‌ కొడుకు ఒక ఎంపీటీసీని బూతులు తిట్టి బెదిరించిన వీడియోను కూడా సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు.

కోనసీమలో పరిస్థితులు ప్రశాంతంగా లేవని కేంద్ర నిఘా విభాగం ముందే హెచ్చరికలు జారీ చేసిందని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్‌ విమర్శించారు. కోనసీమ విధ్వంసంలో ప్రభుత్వం కుట్ర ఉందనడానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయని తెలిపారు. డీజీపీ ఇప్పటికీ అమలాపురం వెళ్లకపోవడంలో కుట్ర ఉందని తాము నమ్ముతున్నామన్నారు. ప్రభుత్వం చేసిన కుట్రకు మంత్రి విశ్వరూప్‌ బలయ్యారని పవన్‌ అన్నారు. తనకు తెలిసినంతవరకు మంత్రి విశ్వరూప్‌ మంచి వారు అని తెలిపారు. గొడవలను రెచ్చగొట్టే వ్యక్తి కాదన్నారు.

మే 24న గొడవలు జరిగినప్పుడు వేల మంది నిరసనకారులు బయటకు వస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని పవన్‌ ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యే తగలబడుతున్నా ఫైరింజన్లు లేకపోవడం.. రాకపోవడంలో మర్మమేమిటని ప్రశ్నించారు. రాజకీయంగా అంబేడ్కర్‌ పేరును ఉపయోగించుకోవాలనే ఆలోచనలో జగన్‌ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. కోనసీమ అల్లర్లను క్యాష్‌ చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ ప్రయత్నించకూడదని పవన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అలాగే వైఎస్సార్సీపీ నేతలు దాడులు చేయడం తమ హక్కుగా భావిస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. కోనసీమకే ప్రత్యేకంగా అంబేడ్కర్‌ పేరు పెట్టడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని జనసేన పార్టీ స్వాగతించిందని గుర్తు చేశారు. ఒకే పార్టీలో రెండు వర్గాల మధ్య ఘర్షణను కుల ఘర్షణగా మార్చారని మండిపడ్డారు. ఘర్షణ సమయంలో గన్‌మెన్‌లు గన్లు వదిలివెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ చర్యలకు మంత్రి, ఎమ్మెల్యే బాధితులయ్యారని చెప్పారు. డీజీపీ స్పందించకపోతే అమిత్‌ షాకు లేఖ రాస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో గొడవలు పెంచాలనే కుట్ర జరుగుతోందని పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. మీడియాలో కూడా కుల ప్రస్తావన పెరిగిపోయిందని అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాకు కూడా హఠాత్తుగా పేరు పెడితే గొడవలు జరిగేవన్నారు. ప్రభుత్వం అందరినీ వర్గ శత్రువులుగా భావిస్తూ ఇబ్బంది పెడుతుందన్నారు. ఉద్యమం అంటే కులాలు రావు.. అంతా కలసి వస్తారని అన్నారు.

సామాజిక న్యాయం నిజంగా జరిగితే గొడవలు ఉండవని పవన్‌ చెప్పారు. కార్పొరేషన్లు పెట్టినంత మాత్రాన సామాజిక న్యాయం జరగదన్నారు. అన్ని కులాలు ఓట్లేస్తేనే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని పవన్‌ అన్నారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అరాచకం పెరిగిపోతుందని చెప్పారు. జగన్‌ దావోస్‌ పర్యటనతో కలిగిన లాభమేంటని పవన్‌ నిలదీశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే వైఎస్సార్‌సీపీకి ఎందుకని పవన్‌ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఉన్నంతవరకు పోలవరం పూర్తికాదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర వాటికి మళ్లిస్తున్నారని విమర్శించారు. బీజేపీతో పొత్తు ఇతర అంశాలపై చర్చిస్తామని తెలిపారు.