Begin typing your search above and press return to search.

పవన్ డేరింగ్ డెసిషన్... ?

By:  Tupaki Desk   |   7 Nov 2021 6:30 AM GMT
పవన్ డేరింగ్ డెసిషన్... ?
X
పవన్ కళ్యాణ్ డేరింగ్ అండ్ డేషింగ్ హీరో. అది వెండి తెర మీదనే కాదు రాజకీయాల్లో కూడా చూపించబోతున్నారా అంటే అవును అనే అంటున్నారు. పవన్ ది కచ్చితంగా ఏడేళ్ల రాజకీయ ప్రస్థానం. ఆయన 2014 మార్చిలో జనసేనను స్థాపించారు. నాడు పోటీ చేయకుండా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడంతో సరిపెట్టారు. ఇక 2019 ఎన్నికల వేళలో మాత్రం పోటీ చేశారు. ఇక 2024 ఎన్నికలకు జనసేనకు పదేళ్ళు నిండుతాయి. అపుడు కూడా పొత్తులతో ఎత్తులతో ముందుకు వచ్చి సర్దుకుంటే మాత్రం జనసేన ఇబ్బందులో పడుతుంది అన్నది ఆ పార్టీ శ్రేయోభిలాషుల భావనగా ఉందిట. అందుకే వారంతా కలసి పవన్ని సొంతంగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమంటున్నారుట.

వారు వీరూ చెప్పారనికాదు కానీ జనసేన ఒంటరిగానే పోటీ చేయడం మంచిదన్నదే రాజకీయ విశ్లేషకుల భావన కూడా. ఒక రాజకీయ పార్టీ బలం బలగం తెలియాలీ అంటే అది మంచి విధానం. ఒక పార్టీని జనాలు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా లేకపోతే ఎక్కడ లోటు పాట్లు ఉన్నాయి అన్నది కూడా సరిచూసుకుని సవరించుకునే అవకాశం ఉంటుంది. అందుకే పవన్ సొంతంగా పోటీ చేయాలన్నదే చాలా మంది భావన. ముఖ్యంగా జనసైనికులు కూడా అదే కోరుకుంటున్నారుట.

మరో వైపు చూస్తే బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులలో కూడా దీని మీదనే వాడిగా వేడిగా చర్చ సాగుతోందిట. పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా ఆయన ఎప్పటికీ సీఎం కాలేడు. ఇదే విషయాన్ని ఈ మధ్య మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు కనుక కుదిరితే వచ్చిన ఓట్ల షేర్ ఆధారంగానే సీట్ల షేరింగ్ ఉంటుంది అంటున్న అయ్యన్న మాటలు తీసుకుంటే జనసేన అతి కొద్ది స్థానాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. దాంతో పవన్ సొంతంగానే పోటీకి దిగడం బెటర్ అని కాపు నాయకులు కూడా అంటున్నారుట.

ఏపీలో టీడీపీ వైసీపీలకు ఆల్టర్నేషన్ గా పవన్ జనసేన ఎదగాలన్నదే వారి ఆలోచనగా ఉంది. దాంతో వారు పవన్ కి ఈ విషయంలో గట్టిగానే చెప్పారని టాక్ నడుస్తోంది. పవన్ కూడా టీడీపీ పొత్తుల గురించి ఆలోచించకుండా మొత్తానికి మొత్తం 175 సీట్లలో పోటీకి దిగితేనే మంచిది అంటున్నారు. ఇక పవన్ దీని మీద డేరింగ్ గానే ఒక డెసిషన్ తీసుకుంటారు అన్న మాట అయితే గట్టిగానే వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కనుక ఒంటరి పోరుకు దిగితే ఏపీ రాజకీయాలో భారీ రాజకీయ మార్పులే సంభవిస్తాయి. అధికార వైసీపీని ఢీ కొడుతూనే విపక్ష టీడీపీని కూడా ఆయన నిలువరించాల్సి ఉంటుంది. దాని కోసం తగిన కసరత్తు చేయాల్సిందే. అందుకే ఇపుడు మిగిలిన ఈ విలువైన సమయాన్ని వాడుకోవాలని అంటున్నారు. మొత్తానికి పవన్ మార్క్ పాలిటిక్స్ అన్నది 2024 లో చూడవచ్చు అని అంతా అంటున్నారు. సో పవన్ సొంతంగా పోటీ అంటే మాత్రం టీడీపీ నెత్తిన పిడుగు పడినట్లే.