Begin typing your search above and press return to search.

పవన్‌ - చంద్రబాబు చర్చించిన అంశాలు ఇవే!

By:  Tupaki Desk   |   8 Jan 2023 10:49 AM GMT
పవన్‌ - చంద్రబాబు చర్చించిన అంశాలు ఇవే!
X
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో చంద్రబాబు, పవన్‌ రెండున్నర గంటలపాటు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకొచ్చాయి. భేటీ అనంతరం చంద్రబాబు, పవన్‌ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరువురు నేతలు మండిపడ్డారు. రోడ్లపై బహిరంగ సభలు, రోడ్‌ షోలను నిషేధిస్తూ జగన్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో నంబర్‌ 1ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ముందుగా మాట్లాడుతూ ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనల నేపథ్యంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు, శాంతిభద్రతలు తదితర అంశాలపై చర్చించామని వెల్లడించారు. ప్రజల వద్దకు వెళ్లకుండా ప్రతిపక్ష నేతలను నియంత్రించేందుకే జీవో నంబర్‌ 1 పేరుతో జగన్‌ చీకటి జీవో తెచ్చారని పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల దగ్గరకు వెళ్లకూడదనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు అనుసరించాల్సిన అంశాలపై చంద్రబాబుతో చర్చించానని తెలిపారు. భవిష్యత్తులో జీవో నంబర్‌ 1ను వెనక్కి తీసుకునేందుకు ఏం చేయాలనేదానిపై మాట్లాడుకున్నామని తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణ పోలీసుల బాధ్యత అని పవన్‌ గుర్తు చేశారు. తమ మీటింగ్‌ లకు తామే లాఠీలు పట్టుకోవాలా? అని నిలదీశారు. అలాంటప్పుడు ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ దేనికి? పవన్‌ ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరు ఘటనలకు పోలీసు వైఫల్యమే కారణమని నిప్పులు చెరిగారు.

జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపైన పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. ఇరిగేషన్‌ మంత్రికి పోలవరం ప్రాజెక్టుకు గురించి తెలియదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చేసే విమర్శలన్నింటికీ ఈనెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగే సభలో సమాధానమిస్తానని పవన్‌ హెచ్చరించారు. ఏపీలోకి బీఆర్‌ఎస్‌ రావడంలో తప్పులేదని పవన్‌ వ్యాఖ్యానించారు. ఏ పార్టీలోకి అయినా చేరికలు సహజమన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఎలా పోరాడాలనేదానిపైనే ప్రధానంగా పవన్‌ కల్యాణ్‌తో చర్చించినట్లు తెలిపారు. ముందు ఏపీలో ప్రజాస్వామ్యం ఉండి రాజకీయ పార్టీలు సజావుగా కార్యకలాపాలు సాగించగలిగితే ఆ తర్వాత ఎన్నికలు, పొత్తులపై మాట్లాడొచ్చన్నారు. ఆంద్రప్రదేశ్‌ లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని ఆరోపించారు. ప్రజా జీవితం అంధకారంలోకి వెళ్లిందని తీవ్ర విమర్శలు చేశారు. జీవో నంబర్‌ 1 తీసుకొచ్చాక కుప్పంలో జరిగిన అరాచకాలపై సంఘీభావం తెలియజేసేందుకు పవన్‌ వచ్చారని.. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో జరగకూడనివి జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో ఆంక్షలు పేరుతో పవన్‌ కల్యాణ్‌ను హింసించారని గుర్తు చేశారు. ఇప్పటంలో అక్కడి ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లినా అలాగే పవన్‌ ను ఇబ్బందవి పెట్టారని మండిపడ్డారు. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగినా పోలీసులు స్పందించలేదన్నారు.

వైసీపీకి నేరాలు, అవినీతి చేయడం, వ్యవస్థలు నాశనం చేయడం అలవాటని మండిపడ్డారు. తమ సభలను అడ్డుకోవడానికి బ్రిటిష్‌కాలం నాటి జీవో తీసుకొచ్చారని నిప్పులు చెరిగారు. కుప్పంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. తన నియోజకవర్గానికి కూడా వెళ్లనీయకుండా చేశారని ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గానికి కూడా రానీయకుండా చేసేందుకు 2–3 వేల మంది పోలీసులను వాడారని నిప్పులు చెరిగారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో నంబర్‌ 1 కరెక్ట్‌ కాదని స్పష్టం చేశారు.


వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు వస్తే కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.