Begin typing your search above and press return to search.

ఏళ్లు గడుస్తున్నా పోటెత్తటం తగ్గట్లేదు.. ఓట్లుగా మారవేంది పవన్?

By:  Tupaki Desk   |   20 Feb 2022 1:00 PM GMT
ఏళ్లు గడుస్తున్నా పోటెత్తటం తగ్గట్లేదు.. ఓట్లుగా మారవేంది పవన్?
X
భారీ వర్షాలు కురిసినప్పుడు.. వాగులు.. వంకలు పొంగి పొర్లినప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఆవిష్కృతం అవుతుంది. చుట్టూ బోలెడన్ని నీళ్లు. కానీ.. తాగేందుకు ఒక్క చుక్క పనికిరాదు. ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పరిస్థితి ఇదే రీతిలో ఉంటుంది.

ఆయన కాలు బయటపెడితే చాలు.. పవన్ ను చూసేందుకు జనాలు క్యూ కడతారు. రహదారులన్ని జనంతో కిక్కిరిపోతాయి. పవన్ మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. అంతా బాగుంది. ఇంత అభిమానం ఉన్న పవన్ కు ఓట్లు రాలవు ఎందుకు? ఓట్లు పడినా.. గెలుపు తీరాలకు చేరరెందుకు? అన్నది అసలు ప్రశ్న.

తాజాగా ఆయన హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి రావులపాలెం.. సిద్ధాంతం.. పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుతారు. అక్కడ సభ ముగించుకొని నరసాపురం నుంచి బయలుదేరి రాత్రి 8 గంటల వేళలో రాజమహేంద్రవరం చేరుకుంటారు.

హైదరాబాద్ లోని బేగం పేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాజమహేంద్రవరానికి వెళ్లిన పవన్ కోసం ఆయన అభిమానులు వేలాదిగా ఉదయం నుంచి ఎదురుచూస్తున్నారు.

ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చేసరికి.. వేలాదిమందితో అక్కడ నిండిపోవటమే కాదు.. ఆయన దారి పొడుగుతా అభిమానులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. నిజానికి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఆయనకున్న ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదనే చెప్పాలి.

మరింత అభిమానం ఉన్న రాజకీయ అధినేత.. తన పార్టీని పక్కన పెడదాం.. ఆయనకు ఆయన ఎందుకు గెలవరు? అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే.. మిగిలిన రాజకీయ పార్టీల మాదిరి.. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేకుండా ఉండరు. తానేం చెబుతారో.. అదే చేస్తుంటారు. ఏ ఆదర్శాలు చెబుతారో.. వాటికే కట్టుబడి ఉంటారు.

ఇవాల్టి రోజున ఏ రాజకీయ అధినేత.. తాను.. తన పార్టీ అభ్యర్థులు బరిలో దిగే నియోజకవర్గాల్లో మందుబాటిల్ పంచకుండా.. ఓటుకు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు? చివరకు తిరుగులేని ప్రజాదరణ ఉందని చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బరిలో ఉన్న నియోజకవర్గంలోనూ ఆయన పార్టీ వారు పోలింగ్ ముందు రోజు చేసే హడావుడి మామూలుగా ఉండదు.

కానీ.. పవన్ మాత్రం అందుకు ససేమిరా అంటారు. ఓటు అభిమానంతోనూ.. నమ్మకంతోనూ వేయాలే తప్పించి.. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవటానికి ఆయన ఆదర్శానికి విరుద్ధం.

బ్యాడ్ లక్ ఏమంటే.. నీతి తప్పని రాజకీయ పార్టీగా లోక్ సత్తాకు లభించిన పేరుప్రఖ్యాతులు.. క్రేజ్ జనసేన పార్టీకి మీడియాలో చోటు లభించలేదు. ప్రజాక్షేత్రంలో చూసినప్పుడు మాత్రం.. జనసేన పార్టీ వారు ఎలాంటి ప్రలోభానికి గురి చేయరన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అందుకే.. పవన్ మీద జనాల అభిమానం ఎప్పుడూ పొంగిపొర్లుతూనే ఉంటుంది.

కానీ.. అవి ఓట్లుగా కన్వర్ట్ కావటంలోనే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈసారైనా ఆ ప్రతికూలత నుంచి ఆయన పార్టీ బయటపడితే.. ఏపీ ప్రజలు సరికొత్త రాజకీయాన్ని చూసే అవకాశం ఉంటుంది. మరి.. ఏపీ ప్రజలు ఏం చేస్తారో చూడాలి.