Begin typing your search above and press return to search.

వైసీపీని దించేస్తా...పవన్ భీషణ శపధం

By:  Tupaki Desk   |   14 March 2022 3:44 PM GMT
వైసీపీని దించేస్తా...పవన్ భీషణ శపధం
X
ఏపీలో వైసీపీ సర్కార్ ని దించేసి కిందన కూర్చోబెడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీషణ శపధం చేశారు. అధికార మదంతో విర్రవీగుతున్న వైసీపీ అనే మహిషం కొమ్ములను విరిచేస్తామని ఆయన ప్రతిన పూనారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ మెల్లగా మొదలై ఆవేశంగా సాగింది. గంటన్నర పాటు సాగిన పవన్ తన ప్రసంగం మొత్తం వైసీపీని టార్గెట్ చేశారు.

అదే సమయంలో ఆయన వచ్చే ఎన్నికల్లో ఏపీ వికాసం కోసం అన్ని రాజకీయ శక్తులను అన్నీ కూడా ఏకం చేస్తామని చెప్పారు. నాడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ రోజుల్లో భారత దేశాన అన్ని పార్టీలు కలసినట్లుగా ఏపీలో కలవాలని పవన్ కోరడం అంటే ఏపీలో వైసీపీ తప్ప అన్ని ఒకే పక్షంగా ముందుకు సాగాలని చెప్పడమే అంటున్నారు.

ఇక వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తేలేదని పవన్ చెప్పడం ద్వారా ఏపీలో టీడీపీకి స్వీట్ న్యూస్ వినిపించించారు. బీజేపీని కలుపుకుని పోతూనే మిగిలిన పార్టీలను కూడా అక్కున చేర్చుకుంటామన్న భావన ఆయన పరోక్షంగా వినిపించారు.

ఒక విధంగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ స్పీచ్ వైసీపీకి గుండెల్లో రైళ్ళు పరిగెట్టించేదిగా ఉండగా ప్రతిపక్ష టీడీపీకి వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఏపీలో బీజేపీ జనసేన ఒక కూటమిగా ఏర్పాటు అవుతాయని, టీడీపీ వేరుగా పోటీ చేస్తే ఓట్ల చీలికతో మరో మారు అధికారంలోకి రావచ్చు అని వైసీపీ పెట్టుకున్న ఆశలను పసిగట్టినట్లుగా పవన్ స్పీచ్ లో చెప్పినది మాత్రం అధికార పార్టీ గుండెలు అదిరే న్యూసే.

ఒక్క ఓటు కూడా వైసీపీకి వ్యతిరేకంగా చీలిపోనీయమని ఆయన స్పష్టం చేయడం అంటే టీడీపీతో కూడా కలుస్తామని చెప్పడమే అంటున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు రోడ్డు మ్యాప్ కోసం తాను ఎదురుచూస్తున్నానని, వారు దిశానిర్దేశం చేస్తే ఏపీ రాజకీయ స్వరూపమే మార్చేస్తాను అని పవన్ చెప్పారు.

ఇక సుదీర్ఘంగా సాగిన పవన్ స్పీచ్ మొత్తం వైసీపీనే లక్ష్యంగా చేసుకోవడం విశేషం. మొత్తానికి చూస్తే ఏపీలో కొత్త రాజకీయాన్ని చూపిస్తాను అని చెప్పిన పవన్ దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో అడుగులు వేసేలా సీన్ అయితే కనిపిస్తోంది.