Begin typing your search above and press return to search.

పవన్ తప్పించి ఆంధ్రోళ్లలో స్ఫూర్తి రగిలించే నాయకుడే లేరా?

By:  Tupaki Desk   |   16 March 2023 8:00 AM GMT
పవన్ తప్పించి ఆంధ్రోళ్లలో స్ఫూర్తి రగిలించే నాయకుడే లేరా?
X
ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఇంటి పెద్ద సరిదిద్ది.. వారిని సక్రమమైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి.. ఒక జాతి సైతం తాను చేయాల్సింది మర్చిపోయిన వేళ.. వారిని బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఎవరి మీద ఉంది? ఎవరు ఆ బాధ్యతను తీసుకుంటారు? సాధారణంగా పాలకులు.. లేదంటే పొలిటీషియన్లు.. మేధావి వర్గాలు గళం విప్పాల్సిన అవసరం ఉంది. బ్యాడ్ లక్ ఏమంటే.. అలాంటివేవీ ఏపీలో కనిపించవు. రాజకీయాల్ని అంతకంతకూ చౌకబారుతనంగా మార్చేయటం తప్పించి.. ఇంకేమీ అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించే నేతలతో నిండిపోయింది ఏపీ రాజకీయ రంగం.

ఇలాంటి వేళలో.. మిగిలిన రాజకీయ అధినేతలకు భిన్నంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు ఉందని చెప్పాలి. రోటీన్ రాజకీయ నాయకులకు భిన్నంగా.. కులాల లెక్కల కారణంగా చీలికలు పీలికలుగా మారిన ఆంధ్రోళ్లు చేసే తప్పుల్ని.. వారిలో నిండిపోయిన కుల జాఢ్యాన్ని వదిలించేందుకు కాస్తంత ఘాటు పదజాలంతో మాట్లాడుతూ.. ఆంధ్రోళ్లు మారాల్సిన అవసరాన్ని చెప్పే ప్రయత్నం చేసిన మొదటి అధినేతగా పవన్ కల్యాణ్ ను చెప్పాలి.

జనసేన పార్టీ పదోఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ మాటల్ని విన్నప్పుడు.. ఇన్నాళ్లకు ఆంధ్రోళ్లకు మార్గదర్శనం చేసే అసలైన నేత ఒకరు దొరికారన్న భావన కలుగక మానదు. నోరు తెరిస్తే ఓటు బ్యాంకు రాజకీయాలు.. ఎవరో ఒకరిని భుజాన వేసుకోవటం.. ప్రజల్ని వర్గాల చొప్పున తయారుచేసి.. ప్రత్యర్థుల మీద ఉసిగొల్పటం.. చులకన చేసేలా వ్యక్తిగత ధూషణలకు పాల్పడటం తప్పించి.. మనం ఎక్కడ ఉన్నాం? మన చుట్టు ఉన్న ప్రపంచం ఎక్కడ ఉంది? ఎలా ఉంది? మనం.. మన జాతి బాగుపడాలంటే ఏం చేయాలన్న దానిపై పవన్ చేసిన ప్రసంగం.. ఆయన మాటల్ని చూసినప్పుడు నిలువెత్తు నిజాయితీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ఆ మాటకు వస్తే.. ఒక రాజకీయ అధినేత ఇలాంటి మాటలు కూడా మాట్లాడారన్న విషయాన్ని ఆంధ్రోళ్లు మర్చిపోయి చాలాకాలమే అయ్యిందని చెప్పాలి. ఇలాంటి వేళ.. ఆంధ్రోళ్లకు పట్టిన కులగజ్జిని చీల్చి చెండాడేలా తన మాటలతో స్పూర్తిని రగిలించే ప్రయత్నాన్నిపవన్ చేశారని చెప్పాలి. ఈ సందర్భంగా సున్నిత అంశాల్ని అంతే సున్నితంగా.. జాగ్రత్తగా ప్రస్తావిస్తూ.. కులాల పిచ్చ నుంచి బయటపడాల్సిన అవసరాన్ని పవన్ నొక్కి చెప్పారని చెప్పాలి.

తనను కాపు నేతల చేత తిట్టిస్తూ.. తాను కమ్మవారికి కొమ్ముకాస్తున్ననట్లుగా విమర్శించే నేతలకు పవన్ ఘాటు చురకలు సంధించారని చెప్పాలి. "నేను తెలుగుదేశం పార్టీని అందలం ఎక్కించటానికి ఉన్నాను.కమ్మవారి కొమ్ముకాస్తున్నామని ఇక్కడ ఉన్న ఒక నాయకుడు అంటున్నాడు. నన్ను తిట్టే కాపు నాయకులందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఊడిగం చేస్తున్నారని నేను తిట్టలేనా? కానీ.. నాకు అది రాదు. నేను సమాజాన్ని విశాల దృష్టి తో చూసేవాడిని" అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు.. ఈ తరహాలో చెప్పాల్సిన విషయాన్ని ఇంత సూటిగా.. స్పష్టంగా చెప్పే నేతలు ఎంతమంది ఉన్నారన్నది ప్రశ్న.

ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. నిద్ర లేచింది మొదలు ఆంధ్రోళ్లకు బలహీనంగా మారిన కులాల్ని టార్గెట్ చేసి పబ్బం గడుపుకునే రాజకీయాలకు ప్రజలు బలి కాకూడదన్న ఆవేదన పవన్ మాటల్లో వినిపించిందని చెప్పాలి. పక్కనున్న తెలంగాణలోనూ కులాల ఉన్నా.. అక్కడి ప్రజల్లో మొదట కులాల కంటే కూడా తామంతా తెలంగాణ అన్న భావనకు అధిక ప్రాధాన్యత ఇస్తారని.. అలాంటి తీరు ఆంధ్రోళ్లకు అవసరమన్న విషయాన్ని చెప్పిన పవన్ మాటల్ని చూస్తే.. తమ తీరుతో ఆంధ్రోళ్లు సిగ్గుపడేలా చేయటమే కాదు.. వారిలో కొత్త స్ఫూర్తిని రగిలించేలా చేసే నాయకుడిగా పవన్ కనిపిస్తారు. మరి.. ఈ సామాజిక బాధ్యత కేవలం పవన్ కే పరిమితమా? ఏపీలో ఇలా మాట్లాడే వారు ఎవరూ లేరా? అంటే.. ఎవరూ లేరని చెప్పాల్సిన రావటమే అసలుసిసలు విషాదం. ఇప్పటికైనా పవన్ మాటల్లోని నిజాన్ని గుర్తించి ఆంధ్రోళ్లు ఆత్మావనలోకం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పక తప్పదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.