Begin typing your search above and press return to search.

పుచ్చుకున్న వాయినం ఇచ్చేందుకు ఓకే చెప్పిన పవన్

By:  Tupaki Desk   |   13 Nov 2019 1:24 PM GMT
పుచ్చుకున్న వాయినం ఇచ్చేందుకు ఓకే చెప్పిన పవన్
X
కొన్ని గంటల క్రితం విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎప్పటిలానే విమర్శలు గుప్పించారు. ఇటీవల కాలంలో బాబు దత్త పుత్రుడిగా మాటలు పడుతున్న వేళ.. బాబును విమర్శించకపోతే తప్పదన్నట్లుగా రెండు మూడు మాటలు అనేసి మమ అనిపించారు. అక్కడితో ఒక ఎపిసోడ్ ముగిసినట్లైంది. సాధారణంగా ఏదైనా పార్టీ మీద విమర్శలు గుప్పిస్తే.. అలా గుప్పించిన గంటల వ్యవధిలోనే విమర్శలకు గురైన పార్టీ.. విమర్శలు చేసిన పార్టీ అధినేత ఇంటికి వెళ్లి.. వారి మద్దతు కోరటం.. అందుకు విమర్శలు చేసిన పెద్ద మనిషి సైతం ఓకే.. ఓకే అనేసి మద్దతు ఇచ్చేయటం సాధ్యమా? అంటే నో అనేస్తారు.

కానీ.. టీడీపీ.. జనసేన మధ్య మాత్రం ఇలాంటివి కామన్ గా జరగుతాయి. అలా అని ఇద్దరూ ఒకే తానులో గుడ్డలన్న మాట అన్నంటనే పవన్ నో అంటే నో అనేస్తారు. మాటల్లో నో చెబుతూ.. చేతల్లో మాత్రం టీడీపీ అడుగుజాడల్లో నడిచే పవన్ కల్యాణ్.. తాజాగా ఇసుక కొరత(?) పేరుతో చంద్రబాబు చేస్తున్న దీక్షకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

తన నివాసానికి వచ్చిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు.. వర్ల రామయ్యతో ఏపీలోని ఇసుక కొరత మీద చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తమ పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతు కోరగా.. అందుకు తన సంఘీభావాన్ని ప్రకటించారుపవన్ కల్యాణ్. ఇదంతా చూస్తే.. మొన్న పవన్ చేసిన లాంగ్ మార్చ్ కు టీడీపీ మద్దతు ఇవ్వటం.. అందుకు బదులుగా రేపు (గురువారం) చంద్రబాబు చేస్తున్న దీక్షకు పవన్ మద్దతు ఇవ్వటం చూస్తే.. ఇచ్చినమ్మ వాయినం.. పుచ్చుకున్న వాయినం సామెత గుర్తుకు రాక మానదు.