Begin typing your search above and press return to search.

అన్నవరంలో నా 'రెండు' చెప్పులు కొట్టేశారు.. అదిరిన పవన్ పంచ్

By:  Tupaki Desk   |   17 Jun 2023 10:10 AM GMT
అన్నవరంలో నా రెండు చెప్పులు కొట్టేశారు.. అదిరిన పవన్ పంచ్
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పంచ్ వేశారు. అది కూడా అలాంటి ఇలాంటి పంచ్ కాదు. ముతకగా మాట్లాడకుండా.. సింఫుల్ గా.. నాలుగు ముక్కుల్లో వేసిన పంచ్ కు పిఠాపురంలో నిర్వహించిన సభలో పెద్ద ఎత్తున స్పందన రావటమే కాదు.. పవన్ మాటల్ని వీడియోలో వింటున్న వారి ముఖాల్లోనూ నవ్వులు విరబూసాయి. జనసేనాని జనంలోకి వచ్చినంతనే.. రియాక్టు అయ్యే వైసీపీ నేతల్లో మాజీ మంత్రి పేర్ని నాని ముందుంటారు. తాజాగా పవన్ షురూ చేసిన వారాహి విజయయాత్రలో భాగంగా కత్తిపూడిలో తొలి బహిరంగ సభను నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. పవన్ ప్రసంగంపై స్పందించి.. ప్రెస్ మీట్ పెట్టిన పేర్ని నాని.. సందర్భం లేకుండా అప్పుడెప్పుడో పవన్ చెప్పులు చూపించి వార్నింగ్ ఇచ్చిన వైనాన్ని.. గుర్తు చేసేలా.. తన రెండు చెప్పుల్ని చూపించి.. మక్కెలు ఇరగదీస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పేర్ని నాని మాటల మీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. దీంతో.. ఆయనకు జనసేనాని ఏ తరహాలో సమాధానం చెబుతారు? అన్నది ఉత్కంటగా మారింది. అంచనాలకుతగ్గట్లే.. ఒక రోజు ఆలస్యంగా పేర్ని నాని చూపించిన రెండు చెప్పులకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు పవన్ కల్యాణ్. పిఠాపురంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన భారీ సభలో మాట్లాడిన పవన్.. పేర్ని నాని చెప్పుల ప్రస్తావనను.. ఆయన పేరు ప్రస్తావించకుండా తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొన్న అన్నవరం శ్రీ సత్యదేవుడి దర్శనానికి వెళ్లినప్పుడు తనకు ఎంతో ఇష్టమైన రెండు చెప్పుల్ని ఎవరో కొట్టేశారన్నారు. పవన్ నోటి నుంచి రెండు చెప్పుల ప్రస్తావన వచ్చినంతనే.. సభలో పాల్గొన్న వారంతా పెద్దఎత్తున రియాక్టు అయ్యారు.

పేర్ని నాని పేరును ప్రస్తావించకుండా పవన్ వేసిన పంచ్ ను ఆయన మాటల్లోనే చదివితే.. ''మొన్న అన్నవరం గుడికి వెళ్లినప్పుడు నాకు ఎంతో ఇష్టమైన రెండు చెప్పులను ఎవరో కొట్టేశారు. ఆ తర్వాత నాకు ఎవరో చెప్పారు.. మీ చెప్పులు టీవీలో ఓ వ్యక్తి చేతిలో కనిపించాయి అని. ఆ చెప్పులంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఆయన దగ్గర తీసుకొని, నా చెప్పులు నాకు ఇప్పించండి'' అని వ్యాఖ్యానించారు.

దీనికి కొనసాగింపుగా వైసీపీ నేతల్నిప్రస్తావిస్తూ.. 'ఇలా వైసీపీ నేతలు చెప్పులు కూడా కాజేస్తే ఎలా? దయచేసి ఆ చెప్పులు మాత్రం మర్చిపోకుండా ఇప్పించండి. గుళ్లలో చెప్పులు కూడా పట్టుకుపోయేలా ఈ నాయకులు తయారయ్యారు'' అంటూ అదిరే పంచ్ వేశారు. పవన్ నోటి నుంచి వచ్చిన రెండు చెప్పుల ప్రస్తావన జనసైనికుల్ని.. పవన్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. మరి.. ఈ చెప్పుల కామెంట్లకు పవన్ కు మాజీ మంత్రి పేర్ని నాని ఎలాంటి పంచ్ ఇస్తారో చూడాలి.