Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫ్యాన్స్ కు గాలం వేస్తూ.. తనను తగ్గించుకున్న పవన్

By:  Tupaki Desk   |   1 July 2023 9:44 AM GMT
ప్రభాస్ ఫ్యాన్స్ కు గాలం వేస్తూ.. తనను తగ్గించుకున్న పవన్
X
తాను టార్గెట్ చేసుకున్న వారి పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలా అయితే విమర్శలు.. ఘాటు ఆరోపణలు చేస్తున్నారో.. తాను లక్ష్యంగా చేసుకున్న వర్గాల మనసుల్ని దోచుకునే విషయం లోనూ అంతే జాగ్రత్తగా ఉంటున్నారు. పలు అంశాల్ని ప్రస్తావిస్తున్న పవన్.. భీమవరం లో నిర్వహించిన సభలో మాట్లాడిన సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సరికొత్త గాలం వేసిన వైనం కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

భీమవరం లో ప్రభాస్ కు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారన్న ఆయన.. వారంతా తన కు మద్దతు ఇవ్వాలన్నారు. భీమవరం లో తనకు కొద్దిపాటి ఫ్యాన్ బేస్ మాత్రమే ఉందని వ్యాఖ్యానించటం గమనార్హం. తనను తగ్గించుకుంటున్న రీతి లో మాట్లాడాల్సిన అవసరం పవన్ కు లేకున్నా.. నాలుగు అడుగులు ముందుకు వేయటమే కాదు.. తనను తాను తగ్గించుకునేలా వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.

తనకు సినిమా హీరోలు అందరూ ఇష్టమేనని.. వారంతా సమానమే అన్న పవన్.. ప్రభాస్ మాదిరి తన కు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువన్న మాట పవన్ నోటి నుంచి రావటం గమనార్హం. "ఇక్కడ ప్రభాస్ అభిమానులు ఎక్కువ. మహేశ్ అభిమానులు ఎక్కువ. రాంచరణ్ అభిమానులు ఎక్కువ. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎక్కువ. ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ. నా అభిమానులు ఫర్లేదనుకోండి. నిజంగా నాకు అందరు హీరోలంటే ఇష్టం. ఈ మాట ను మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఎందుకంటే.. నేనెప్పుడు కూడా పవన్ కల్యాణ్ ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు. జనసేన పెట్టాను. నాకు జనం కావాలి" అని వ్యాఖ్యానించారు.

తనను అభిమానించే యువత.. తనను అభిమానించని యువత అని వేరుగా పెట్టుకోవటం ఇష్టం లేదన్నారు. తనను అభిమానించినా.. అభిమానించకున్నా మీరంతా కలిసి ఉండాలని.. ఎందుకుంటే మీరంతా ఆంధ్రా యువత అని వ్యాఖ్యానించారు. "మిమ్మల్ని హీరో అభిమానులుగా విడదీయటం ఇష్టం లేదు. 2015లో ఒక పోస్టర్ గొడవ భీమవరంలో చోటుచేసుకుంటే నాకు చాలా బాధేసింది. ఒక పోస్టర్ చించితే అంత గొడవ జరగాల్సిన అవసరం లేదు. ఒకవేళ పొరపాటున.. కావాలనే చేసినా క్షమించాలి. చిన్న గొడవ ను పెద్దది చేసుకోవద్దు. రెండు చేతులెత్తి వేడుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు.