Begin typing your search above and press return to search.

రాజకీయం అంటే పవర్ అనుకునేటోళ్ల కు పవన్ లాజిక్ ఎందుకు అర్థమవుతుంది?

By:  Tupaki Desk   |   12 May 2023 10:19 AM GMT
రాజకీయం అంటే పవర్ అనుకునేటోళ్ల కు పవన్ లాజిక్ ఎందుకు అర్థమవుతుంది?
X
వీడు మన స్థాయి కాదురా అన్న మాట అప్పుడప్పుడు స్నేహితుల గ్రూపుల్లో వినిపిస్తూ ఉంటుంది. ఆఫీసుల్లో చాలా తక్కువ సందర్భాల్లో ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. నిజమే అందరి మాదిరిగా ఉండేటోళ్లు కుప్పలు కుప్పలు కనిపిస్తారు. కానీ కొందరు మాత్రం అందుకు భిన్నం. రాజకీయం అన్నంతనే అయితే డబ్బు.. లేదంటే అధికారం. ఈ రెండింటి మధ్యే తిరగటం మనకు కొన్నేళ్లుగా అలవాటుగా మారింది. ఈ రెండు లేకుంటే.. రాజకీయం చేసేటోడు కామెడీగా కనిపిస్తాడు మనకు. దేశాన్ని ఉద్దరించేస్తాడట లాంటి మాటలు వినిపిస్తాయి. అలాంటి మాటలు మాట్లాడటానికి నోరు తిరగని వాడు.. సింఫుల్ గా ప్యాకేజీ స్టార్ అనే మాట అనేస్తాడు.

అవును.. పవన్ కల్యాణ్ ను అర్థం చేసుకోవటానికి ఈ తరంలో రాజకీయం చేసేవారికి రాజకీయం గురించి తమకు మించి ఇంకెవరికీ తెలీదని భావించే వారికి ఎంతవరకు అర్థమవుతాడు? అసలు అతని ఉద్దేశం ఏమిటి? అన్న దాని కంటే కూడా.. సీఎం పదవి ఎందుకు వద్దంటాడు? దీని వెనుక ఏదో ఉందన్న ప్రాథమిక ఆలోచన చూస్తేనే.. మన మనసులు ఎంతలా మారిపోయాయో అర్థమవుతుంది.

అధికారం కోసం ఏదన్న సిద్ధమయ్యే ఇప్పటి నేతలకు.. తన చుట్టూ ఉన్న ప్రజలు బాగుండాలని.. వారి ఆనందమే తనకు అధికారంతో సమానమని భావించే పవన్ లాంటోళ్లు అర్థమయ్యే ఛాన్సే లేదు. అధికారంలోకి రావటం కోసం ఆరాచకాలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని నిలుపుకోవటం కోసం మహా ఆరాచకాలు చేస్తూ..ప్రత్యర్థుల్ని ఎంత బలంగా తొక్కి పారేస్తారో వాడే.. తోపు మహానేతగా మారుతున్న వేళలో.. పవన్ లాంటోడు అర్థమయ్యే ఛాన్సు లేదు.

అధికారాన్ని అందుకోవటానికి న్యాయమైన పద్దతే తప్పించి.. విలువల్ని విడిచి పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించటానికి ససేమిరా అనే పవన్ లాంటోడు ప్యాకేజీ స్టార్ గా కనిపిస్తాడే కానీ.. పుస్తకాల్లో మాత్రమే కనిపించే విలువలున్న నాయకుడు కళ్ల ముందుకు వచ్చాడన్న భావన ఎందుకు కలుగుతుంది? రాజకీయం అంటే అధికారాన్ని చేతికిలోకి తీసుకోవటమే తప్పించి.. ఇంకేమీ కాదన్న భావన మెదడులోకి బాగా ఎక్కి పోయిన వేళ.. అంతకు మించి చాలానే ఉందన్నది మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తుంటే జీర్ణించుకోవటం కష్టమే.

తాము అభిమానించే నాయకుడు రాత్రికి రాత్రి అపర శక్తివంతుడై పోవాలి. తాము చేసే చెత్త పనులకు బాసటగా నిలవాలి లాంటి భావనే తప్పించి.. గత తరాలు చేసిన తప్పుల్ని ఈ తరంలో అయినా సరిదిద్ది.. విలువలతో కూడిన సమాజాన్ని.. పద్దతి కలిగిన వైఖరిని నేర్చుకోవాలన్న తపన లేని సమూహానికి.. పవన్ ప్యాకేజీ స్టార్ గా కనిపిస్తాడే తప్పించి.. పవర్ ఫుల్ లీడర్ గా ఎందుకు కనిపిస్తాడు చెప్పండి? మేధావిగా మాటల మాయాజాలంతో అందరిని ఆకర్షించే రాంగోపాల్ వర్మ లాంటి వ్యక్తుల కు.. రాజకీయం అంటే ముఖ్యమంత్రి పదవి మాత్రమే కాదనే పవన్ తీరు ఎప్పటికి అర్థం కాడు. అందుకే.. తనకు అర్థం కాని పవన్ ను ఆయన అభిమానులతోనే ఎక్కు పెట్టించేలా మాట్లాడుతుంటారు. ఆయన మీద వారిని ఎగదోసే విఫలయత్నం చేస్తుంటారు.