Begin typing your search above and press return to search.

పవన్ ఆగ్రహానికి కారణం అదే..

By:  Tupaki Desk   |   9 Dec 2017 8:33 AM GMT
పవన్ ఆగ్రహానికి కారణం అదే..
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల రాజకీయ పర్యటన తీవ్ర చర్చకే దారి తీసింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనేక విషయాలపై ఓపెనయ్యాడు పవన్. ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొన్ని విమర్శలూ చెలరేగాయి. ఐతే పవన్ మాత్రం తానే చెప్పాలనుకున్నాడో అది ఓపెన్ గా చెప్పేశాడు. ఈ పర్యటన వల్ల పవన్ ఎంత లాభం.. ఎంత నష్టం అనే చర్చ నడుస్తోందిప్పుడు. ‘అజ్నాతవాసి’ విడుదలకు ముందు ఇలాంటి పర్యటన పెట్టుకోవాల్సింది కాదని కొందరంటే.. ఆ సినిమాకు ఇది కలిసొచ్చే విషయమే అని కొందరంటున్నారు. సినిమా ప్రమోషన్ కు పరోక్షంగా సహకరించడానికే పవన్ ఈ పర్యటన చేశాడనే వాళ్లు కూడా లేకపోలేదు.

ఐతే పవన్ మాత్రం అలాంటి భావనే ఎవరికీ రాకూడదన్న ఉద్దేశంతో ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఒక చోటికి పవన్ అభిమానులు ‘అజ్నాతవాసి’ టీషర్టులతో రావడం పట్ల పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇది పూర్తిగా రాజకీయ పర్యటన అని.. దీన్ని సినిమాలకు ముడిపెట్టడం పట్ల పవన్ అసంతృప్తి వ్యక్తం చేశాడని సమాచారం. ఇక్కడ సినిమా ప్రమోషన్లేంటని.. ఇది జనాలకు వేరే సంకేతాలిస్తుందని పవన్ అభిప్రాయపడ్డాడట. రాజకీయాల్ని.. సినిమాల్ని వేరుగా ఉంచలని.. ఈ రెంటినీ కలపకూడదని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ‘అజ్నాతవాసి’ టీషర్టులతో వచ్చిన వాళ్లపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలిసింది. తాను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల్ని పూర్తిగా వదిలేస్తానని పవన్ మరోసారి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.