Begin typing your search above and press return to search.

మాజీ స్పీక‌ర్ కాళ్లు మొక్కి...ప‌వ‌న్ సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   3 Nov 2019 6:34 PM GMT
మాజీ స్పీక‌ర్ కాళ్లు మొక్కి...ప‌వ‌న్ సంచ‌ల‌నం
X
జేడీఎస్-కాంగ్రెస్ స‌ర్కారు బ‌ల‌పరీక్ష స‌మ‌యంలో...నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డం ద్వారా వార్త‌ల్లో నిలిచిన కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ గుర్తున్నారు క‌దా? తాజాగా ఆయ‌న మ‌రోరూపంలో వార్త‌ల్లోకి ఎక్కారు. ఈ ద‌ఫా విధాన నిర్ణ‌యంతో కాదు...జ‌నసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయ‌న‌ కాళ్లు మొక్కడం ద్వారా. ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉన్న కోలార్ జిల్లా శ్రీనివాసపుర తాలుకా లోని గౌనిపల్లిలో ప్రఖ్యాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి ఆలయ జీర్ణోద్ధారణ కార్యక్రమంలో జ‌రిగిన సంఘ‌టన ద్వారా.

విశాఖ‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం లాంగ్ మార్చ్ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల్సిన ప‌వ‌న్ అంత‌కుముందే... ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం గౌనిపల్లికి చేరుకొని ఆలయ జీర్ణోద్ధారణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి గోపాలగౌడ - మాజీ స్పీకర్ - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన మాజీ స్పీక‌ర్‌ రమేష్ కుమార్ సైతం విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా మాజీ స్పీక‌ర్ ర‌మేష్ స్ప‌ష్ట‌మైన తెలుగులో మాట్లాడుతూ...ప‌వ‌న్‌ ను ప్ర‌శంసించారు. బిజీ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ...ఈ కార్యక్రమానికి హాజరైనందుకు పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రమేష్ కుమార్ చెప్పారు. ఆయ‌న ఎన్నికల ప్రచార తీరును గ‌మ‌నించాన‌న - జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను తాను అధ్యయనం చేశానని ప్ర‌జాసంక్షేమం కోణంలో దాన్ని రూపొందించార‌న్నారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో...పవన్ కల్యాణ్‌కు ఎన్ని సీట్లు వచ్చాయనేది తనకు అనవసరమని - ఏపీలో ఎప్పటికైనా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్య‌క్తం చేశారు. దీంతో...అదే సమయంలో వేదిక మీద ముందు వరుసలో కూర్చున్న పవన్ కల్యాణ్ హఠాత్తుగా రమేష్ కుమార్‌ కు పాదాభివంద‌నం చేశారు.

ఇదిలాఉండ‌గా - ఇదే కార్యక్రమంలో మ‌రో ప్ర‌శంస‌లు సైతం ప‌వ‌న్ పొందారు. నంజావధూత స్వామి మాట్లాడుతూ..
ప‌వ‌న్ అసమాన పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారని, ఒక్క ఏపీలో మాత్రమే కాకుండా.. పొరుగు దక్షిణాది రాష్ట్రాల్లో యువతకు ప‌వ‌న్ కల్యాణ్ స్ఫూర్తినిస్తున్నారని చెప్పారు. ప‌వ‌న్‌ను జూనియర్ భగత్ సింగ్‌ గా అభివర్ణించారు. ఏపీలో ఎలాంటి ఎన్నికలు వచ్చినా జ‌నసేన‌ పార్టీ ఘన విజయాన్ని సాధించాలని - ప‌వ‌న్‌ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని - తన కోరిక నెరవేరాలని తాను వేణుగోపాల స్వామిని ప్రార్థిస్తున్నానని అన్నారు. కాగా, ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌ గా నిలిచారు. ఈ వేడుక‌కు హాజ‌రైన అనంత‌రం ఆయ‌న విశాఖ‌కు చేరుకొని...లాంగ్ మార్చ్‌ లో పాల్గొన్నారు.