Begin typing your search above and press return to search.

వ్యాలిడ్ పాయింటే..జనసేన ఆవిర్భావ సభ ఎక్కడ?

By:  Tupaki Desk   |   3 March 2020 3:30 PM GMT
వ్యాలిడ్ పాయింటే..జనసేన ఆవిర్భావ సభ ఎక్కడ?
X
మార్చి 14 వస్తుందంటే... జనసేన శ్రేణులు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టుగా కనిపించడం సర్వ సాధారణం. ఎందుకంటారా? ఆ రోజే కదా సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాననంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్... జనసేన పేరిట ఓ రాజకీయ పార్టీని ఆవిష్కరించింది. అంటే... మార్చి 145 జనసేన ఆవిర్బావ దినోత్సవమన్న మాట. మొన్నటిదాకా ఏటా మార్చి 14 సమీపిస్తుందోంటే... ఇటు ఫ్యాన్స్ తో పాటు అటు పవన్ కల్యాణ్ కూడా ఉత్సాహంగా కనిపించేవారు. ఆవిర్బావ దినోత్సవాన్ని ఎక్కడ నిర్వహించాలన్న విషయాన్ని చాలా ముందుగానే ప్రకటించేవారు. సదరు సభకు జనాన్ని బాగానే పోగేశేవారు. మొత్తంగా జనసైనికులకు మార్చి 14 ఓ పెద్ద పండుగ కిందే లెక్క.

ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా... ఈ దఫా అసలు జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందా? అని సాక్షాత్తు జనసైనికులే తమను తాము ప్రశ్నించుకుంటున్న పరిస్థితి చాలా వింతగానే అనిపిస్తోంది. ఏం పార్టీ అప్పుడే చచ్చిపోయిందా? అదేమీ లేదు గానీ... పార్టీ వ్యవహారాలపై నిన్నటిదాకా అన్నీ తానై నడిచిన పవన్ ఇప్పుడు ముఖానికి మళ్లీ రంగేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో సింగిల్ సీటు దక్కిన నేపథ్యంలో పార్టీని నడపాలంటే వనరుల సమీకరణకు సినిమాల్లో నటించక తప్పదన్న ఫిలాసఫీని వదిలిన పవన్ వెనువెంటనే మళ్లీ నటుడిగా మారిపోయారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరాంధ్ర సమీక్షలకు కూడా పవన్ హాజరుకాలేకపోయారు. పవన్ స్థానంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహన్ ఈ సమీక్షలను చూస్తున్నారు.

మరి పార్టీకి అంతో ఇంతో బలం ఉందని భావిస్తున్న ఉత్తరాంధ్ర సమీక్షలకే పవన్ హాజరుకాలేకపోతే... మరో 10 రోజుల్లో జనగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవాల మాటేమిటన్నదే కదా అసలు సిసలు ప్రశ్న. జనసేనకు సంబంధించి దాదాపుగా కీలక నిర్ణయాలు, కీలక ప్రకటనలు అన్నీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేదికలపై నుంచే వచ్చాయి. మరి ఇప్పుడు మార్చి 14 ఉరుకులు పరుగుల మీద వస్తోంది. ఇప్పటిదాకా అసలు ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తారా? లేదా? అన్న విషయంపైనా ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అదే సమయంలో సినిమా షూటింగ్ నిమిత్తం పవన్ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటూ జరుగుతుందా? అన్నది జనసైనికుల ధర్మ సందేహం. పార్టీ ప్రస్థానాన్ని పరిశీలించే ఎవరికైనా కూడా జనసైనికుల్లో వినిపిస్తున్న ఈ ధర్మ సందేహం కూడా వ్యాలిడ్ పాయింట్ గానే కనిపిస్తోంది.