Begin typing your search above and press return to search.

ఒకే రోజు- బాబుకు జైకొట్టేసిన ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   31 July 2017 10:30 AM GMT
ఒకే రోజు- బాబుకు జైకొట్టేసిన ప‌వ‌న్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కోరిక‌ను జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గౌర‌వించారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యపై సీఎం చంద్రబాబు నాయుడితో సుమారు గంటకు పైగా సాగిన సమావేశం సంద‌ర్భంగా చంద్ర‌బాబు పెట్టిన కీల‌క ప్ర‌తిపాద‌న‌కు ప‌వ‌న్ ఓకే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జీవన్ దాన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో ఈ రోజు భేటీ అయిన పవన్ కల్యాణ్ ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనకు అంగీకరించారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యపై స్పందించి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన పవన్ కల్యాణ్ ను రాష్ట్రంలో ఆరోగ్య పరిరక్షణ కోసం జీవన్ దాన్ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాల్సిందిగా చంద్రబాబు కోరారు. అందుకు పవన్ కల్యాణ్ అంగీకరించారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాల‌పై స్పందించారు. ఉద్దానం బాధితులను ఆదుకోవాలని సీఎం ను కోరగా వెంటనే స్పందించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్దానం సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని పవన్‌ తెలిపారు. బాధితుల‌కు న్యాయం జ‌ర‌గాల‌నేదే తన ఉద్దేశ‌మ‌ని ప‌వ‌న్ చెప్పారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఉద్ధానం - పోలవరం - అమరావతి - రైతులకు నష్టపరిహారం అంశాలే కాకుండా రాష్ట్రంలో, కేంద్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు తెలిసింది.

మ‌రోవైపు ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి పవన్‌ కల్యాణ్‌ చొరవ తీసుకోవడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ కల్యాణ్‌ను అభినందించారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య 30 ఏళ్లుగా పీడిస్తూ ఉన్నా, అక్కడ కిడ్నీ వ్యాధులకు సరైన కారణాలను ఇంతవరకూ ఎవరూ కనుక్కోలేకపోయారని, నేడు పవన్‌ వ్యాధి పరిష్కారం కోసం కృషి చేయడం చాలా ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాగా, సీఎం చంద్రబాబు – పవన్‌ కల్యాణ్‌ భేటీ అనంతరం ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలపై వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ప్రజెంటేషన్‌ ఇచ్చారు.