Begin typing your search above and press return to search.

బాబును భారీగా ఇబ్బంది పెట్టిన ప‌వ‌న్ పంచ్ లు

By:  Tupaki Desk   |   15 March 2018 4:57 AM GMT
బాబును భారీగా ఇబ్బంది పెట్టిన ప‌వ‌న్ పంచ్ లు
X
ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టిన‌ట్లు చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ పై గ‌డిచిన నాలుగేళ్లుగా వేలెత్తి చూపిస్తున్న వారి నోట మాట రాకుండా చేశారు పార్టీ ఆవిర్భావ స‌భ‌తో. ఇంత‌కాలం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఈగ వాల‌కుండా ర‌క్ష‌గా ఉన్న ఆయ‌న నిప్పులు చెరిగారు. తూటాల్లాంటి మాట‌ల‌తో ఫైర్ చేసినంత ప‌ని చేసిన ప‌వ‌న్ మాట‌లు ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణ‌లోనూ సంచ‌ల‌నంగా మారాయి.

అన్నింటికి మించి చంద్ర‌బాబును ప్ర‌ధాని మోడీ ప‌క్క‌న పెట్ట‌టానికి కార‌ణం.. ఆయ‌న కుమారుడు లోకేశే అన్న మాట‌ను సూటిగా చెప్ప‌ట‌మే కాదు.. మీ అబ్బాయి అవినీతి వ్య‌వ‌హారాలు మీకు తెలుసా? అంటూ ప్ర‌శ్నించి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. సీఎంగా 29 సార్లు ఢిల్లీ వెళ్లినా ప్ర‌ధాని ప‌ట్టించుకోలేదంటూ ఈ మ‌ధ్య‌న త‌ర‌చూ ప్ర‌స్తావిస్తున్న బాబు మాట‌ను కోట్ చేస్తూ.. భ‌విష్య‌త్తులో బాబు నోటి నుంచి ఆ మాట రాకుండా చేసినంత ప‌ని చేశారు.

గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఐర‌న్ ఓర్ దోచేసిన‌ట్లుగా క‌థ‌నాలు రాశార‌ని.. ఏపీలో ఇసుక మాఫియా.. ఎర్ర‌చంద‌నాన్ని దోచుకుపోతున్న వైనంపై ఎందుకు క‌థ‌నాలు రాయ‌లేద‌న్న మాట‌ను ఆయ‌న సూటిగా సంధించారు. ఇక‌.. మ‌హిళా అధికారి వ‌న‌జాక్షి విష‌యంలో అధికార‌ప‌క్ష ఎమ్మెల్యే దాడికి దిగితే అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోని బాబు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. కొమ్ములున్నాయా? అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అవినీతిమ‌యం చేశారంటూ ఘాటుగా మండిప‌డ్డ ఆయ‌న‌.. క‌న‌క‌దుర్గ‌మ్మ గుడి ద‌గ్గ‌రి పార్కింగ్ వ‌సూళ్ల విష‌యంలోనూ ఎమ్మెల్యేకు వాటా పంపించాల్సి ఉంద‌న్న విష‌యాన్ని చెప్పి.. బెజ‌వాడ దుర్గ‌మ్మ సొమ్ముకూ ఆశ‌ప‌డ‌తారా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

విశాఖ‌లో భూక‌బ్జాల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. క‌బ్జాలు తెలంగాణ‌లో వింటుంటామ‌ని.. చివ‌ర‌కు విశాఖ‌కు కూడా పాకించేశార‌ని.. త‌న వ‌ద్ద‌కు ఎంతో మంది వ‌చ్చి మొత్తుకుంటున్న‌ట్లుగా చెప్పిన ప‌వ‌న్‌.. ఏపీ స‌ర్కారుపై ఒక‌టి రెండు కాదు.. త‌న సుదీర్ఘ ప్ర‌సంగంలో సింహ‌భాగం చంద్ర‌బాబును టార్గెట్ చేసిన ప‌వ‌న్ పంచ్ లు సంచ‌ల‌నంగా మారాయి. బాబుకు తెగ ఇబ్బంది క‌లిగించేలా.. డిఫెన్స్ లో ప‌డేలా ఉన్న పంచ్ ల్ని చూస్తే..

+ మీ అబ్బాయి లోకేష్‌ చేస్తున్న అవినీతి మీ దృష్టికి వచ్చిందా? ఎన్టీరామారావు రూ.2 కే బియ్యం ఇస్తే ఆయన మనమళ్లు ఏం చేస్తున్నారు. జగన్‌ ను ఎదుర్కోవాలంటే అవినీతి చేసుకోవాలంటున్నారు.

+ ఆంధ్రప్రదేశ్‌ ను అవినీతి మయం చేశారు. కరప్షన్‌ ఆంధ్రా చేశారు. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఆంధ్రప్రదేశ్‌ లో ఉందని సిగ్గుగా ఉంది. ఎన్ని ఎకరాలు కావాలి? ఎన్ని కోట్లు కావాలి? స్కాంల ఆంధ్రప్రదేశ్‌ కాకూడదని 2014 ఎన్నికల్లో మీకు మద్దతు పలికితే మీరు చేసింది ఏమిటి?

+ ఎర్రచందనాన్ని విక్రయిస్తే రూ.25 వేల కోట్లు వస్తుందని... దాంతో అద్భుతమైన రాజధానిని నిర్మించొచ్చని చంద్రబాబు పదే పదే చెప్పారు. ఇప్పుడు చూస్తే ఎర్రచందనం విక్రయాల ద్వారా రూ.1500 కోట్లైనా రాలేదని అంటున్నారు. ఎందుకండి కల్లబొల్లి మాటలు? సత్యమేవజయతే అంటున్నారు కదా! మాకు సత్యం చెప్పండి.... సత్యం మాట్లాడండి.. తెదేపా ప్రభుత్వం ప్రజల నమ్మకం కోల్పోయింది.

+ ముఖ్యమంత్రి 29 సార్లు దిల్లీ వెళ్లాను..అయినా ప్రధానమంత్రి పట్టించుకోలేదని అంటున్నారే...ముందు మన బంగారం మంచిదై ఉండాలి కదా! శేఖర్‌ రెడ్డి కేసులో మీ అబ్బాయి పేరు ఉన్నందునే ప్రధానమంత్రి మిమ్మల్ని పట్టించుకోవడం లేదని - బెదిరిస్తున్నారని అంటున్నారు.

+ ప్రమాదానికి గురైన మనిషిని దోచుకున్న తరహాలోనే... విభజనతో రోడ్డున పడ్డ ఆంధ్రప్రదేశ్‌ను కొందరు దోచుకుంటున్నారు. కన్నతల్లిని ఎవరైనా రక్షించుకుంటారు కానీ దోచుకుంటారా? కానీ కొంతమంది తెదేపా ఎమ్మెల్యేలు దోచుకుంటూ తెలుగుతల్లికి ద్రోహం చేస్తున్నారు. ఆ తల్లి శాపం వారికి తగులుతుంది.

+ ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు తహసీల్దార్‌ వనజాక్షి ప్రయత్నిస్తే...ఆ అధికారిణిపైన ఎలా దాడి చేస్తారు? ఏంటి.. ఆమెపై దాడి చేసిన ఎమ్మెల్యేకు కొమ్ములున్నాయా? చట్టం అతనికి వర్తించదా? అవన్నీ చూసి మీరు ఏం చేస్తున్నారు? ఆ ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తారా?

+ నేను ముఖ్యమంత్రి అల్లుడ్ని కాను. సీఎం కొడుకును కాదు. పోలీసు కానిస్టేబుల్‌ కొడుకును నేను. 1962లో మా నాన్న ఇక్కడే మంగళగిరిలో పోలీసు కానిస్టేబుల్‌ గా పనిచేశారు. నేను బాపట్లలో పుట్టాను. రాజకీయాల్లోకి నేను వచ్చింది...మనం కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు చేసి సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి. దోచుకోవడానికి కాదు.

+ బళ్లారిలో గాలి జనార్దన్‌ రెడ్డి ఖనిజాలు దోచేస్తున్నారని కథలు రాశారు. అది తప్పే.. మరి ఇసుక మాఫియాలోనూ - ఎర్రచందనం విషయంలోనూ మీరు చేస్తున్నది తప్పు కాదా?

+ నన్ను ఇప్పటికీ పార్టీ వ్యవస్థాగత నిర్మాణం పూర్తి చేయలేదని చాలా మంది అంటున్నారు. ఇదంతా వ్యవస్థాగత నిర్మాణం కాదా? పంచాయతీ ఎన్నికలు - మండల పరిషత్‌ - మున్సిపల్‌ - కార్పొరేషన్‌ ఎన్నికలు వస్తున్నాయి కదా! అప్పుడు చూద్దాం.

+ మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామంటూ తెదేపా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు..అదే విషయంపైన నేను చెబితే ఎస్టీ యువతను నాపైకి ఉసిగొల్పారు. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న మత్స్యకారులు, ఆదివాసీలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు?

+ కంచే చేను మేస్తుంటే... కంచే చేను మేస్తుంటే పాలి కాపు మాత్రం ఏం చేయగలడు? ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితికి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. రాజు నీతి తప్పితే.. నేల సారం తప్పుతుంది. మీరు దోపిడీ చేస్తుంటే చూడటానికా? మీకు మద్దతు ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి చాలా ఎక్కువగా ఉందని ఓ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే చెబుతున్నాం.

+ మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? హెరిటేజ్‌ మిల్క్‌ ఫ్యాక్టరీల నుంచి రావడం లేదు కదా! మీ ఆస్తుల నుంచి తియ్యడం లేదు కదా! అలాంటప్పుడు రాబోయే ఎన్నికలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.25 కోట్లు సిద్ధం చేశామంటూ బాహాటంగా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు. దీని వల్ల ప్రకాశం పంతులు ఆత్మ క్షోభిస్తోంది. ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తుంది.

+ రూ.3 వేలకు లారీ ఇసుకను సరఫరా చేస్తే ప్రభుత్వానికి రూ.100 కోట్లు ఆదాయం వచ్చింది. అదే ఇసుక ఉచితమని చెప్పి..లారీ ఇసుకను రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. భవన నిర్మాణ ఖర్చులు పెంచడమే ఈ రాష్ట్రానికి మీరు చేసిన మేలా? ఇసుక మాఫియా భూమాతను అడ్డగోలుగా తవ్వేస్తోంది. ఇవన్నీ చూసి ఆ తల్లి ఉరుకుంటుందా? వంచించినందుకు తన అట్టడుగు పొరల్లోకి లాక్కెళ్లిపోతుంది.

+ మిమ్మల్ని(తెదేపా) పదవుల్లోకి ఎక్కించి మీతోనూ, మీ పిల్లలతోనూ కాలితో తొక్కించుకోడానికా మేం మీ వెనుక నడిచింది? అందుకా మీకు వత్తాసు పలికింది? దానికోసమా మీ కోసం ప్రచారం నిర్వహించింది? అమరావతి గురించి హేళనగా మాట్లాడుతున్నారని భావోద్వేగానికి గురైన సీఎం...గుంటూరులో అతిసారంతో చనిపోయిన వారిని చూసి ఎందుకు బాధపడలేకపోతున్నారు? శ్రీకాకుళంలో ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 55 మంది మరణిస్తున్నారు.. అయినా ఎందుకు చలించడం లేదు? బిడ్డలు అంటే కేవలం మీ బిడ్డలేనా? బయట బిడ్డలు కాదా?

+ తుందుర్రు మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకునే పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి మా విధానమని జనసేన సిద్ధాంతాల్లో పెట్టాం. అలాంటిది తుందుర్రు పార్కు కోసం ఉద్యమం చేస్తే మహిళలను 40 రోజులు జైల్లో పెడతారా?

+ ప్రభుత్వ పథకాలకు పేర్లు అంటే రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీవేనా? దేశమంతా దామోదరం సంజీవయ్య, డొక్కా సీతమ్మ వంటి వారి పేర్లు పెట్టలేమా? డొక్కా సీతమ్మ ఆహార పథకం అనే పేరు పెట్టాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? మరో పథకానికి దామోదరం సంజీవయ్య పేరు - ఆంధ్రులు అభిమానించే సర్దార్‌ గౌతు లచ్చన్న పేరు ఎందుకు పెట్టరు? జనసేన ఆ పనిచేసి చూపిస్తుంది. ప్రతి దానికీ చంద్రన్న పేరు పెట్టుకోకపోతే వారి పేర్లు కూడా పెట్టొచ్చు కదా!

మొత్తం మీరే అంటే మిగతా వారు నాయకులు కాదా?