Begin typing your search above and press return to search.

2024 టార్గెట్: పార్టీ నిధి కోస‌మే సినిమాలా?

By:  Tupaki Desk   |   26 Feb 2020 6:30 PM GMT
2024 టార్గెట్: పార్టీ నిధి కోస‌మే సినిమాలా?
X
రాజ‌కీయ పార్టీలు పెట్టి సేవ‌లు చేస్తామంటే స‌రిపోతుందా? పార్టీని నిల‌బెట్టుకోవ‌డం కోసం ఉన్న‌దంతా ఊడ్చి పెట్టాలి. ఊడిగం చేయాలి. రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించాలి. లేదంటే గ‌తానుభ‌వాలెన్నిటినో ఎగ్జాంపుల్ గా చూపించి జ‌నం చీవాట్లు పెట్టేస్తారు. అందుకే ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలివైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నార‌న్న టాక్ పరిశ్ర‌మ‌లో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

అస‌లు పార్టీ కార్య‌క‌లాపాలు వీడి దూరంగా వెళ్ల‌న‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్న‌ట్టుండి వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేయ‌డానికి కార‌ణ‌మేమిటి? అన్న‌ది విశ్లేషిస్తే.. ఇదంతా పార్టీ నిధిని స‌మీక‌రించేందుకేన‌న్న మాట వినిపిస్తోంది. అత‌డు చాలా ముందస్తు ఆలోచ‌న‌తోనే ఇలా యూట‌ర్న్ తీసుకున్నార‌న్న టాక్ ఇప్ప‌టికే ఉంది. రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం అయినా దానికోసం ప‌వ‌న్ అంతే ఇదిగా శ్ర‌మిస్తున్నారు.

ఆర్థిక అవ‌స‌రాలే ప‌వ‌న్ కు ముకుతాడు వేశాయి. అవ‌స‌రాలు తీరాలంటే త‌ప్ప‌దు క‌దా! అందుకే ఇప్పుడు అత‌డు క‌నీసం 400-500 కోట్ల నిధిని అయినా జ‌న‌సేన పార్టీని నిల‌బెట్టుకునేందుకు స‌మీక‌రించే యోచ‌న‌లో ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద‌ నిధిని 2024 ఎన్నిక‌ల నాటికి సిద్ధం చేయాల‌న్న‌ది ల‌క్ష్యం. ఆ క్ర‌మంలోనే దిల్ రాజు- బోనీతో క‌లిసి పింక్ రీమేక్ `లాయ‌ర్ సాబ్` ని ప్రారంభించారు. అటుపై క్రిష్ -ఏఎం ర‌త్నం .. హ‌రీష్ శంక‌ర్- మైత్రి ల‌తో సినిమాలకు క‌మిట‌య్యారు. ఇవే కాకుండా `గోపాల గోపాల` ఫేం డాలీ- రామ్ తాళ్లూరి సినిమాకి ఓకే చెప్పాడట‌. ఇంకా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లోనూ సినిమా చేయ‌నున్నాడు. ఇలా వ‌రుస‌గా టాప్ ప్రొడ్యూస‌ర్స్ కి సినిమాలు చేయాల‌ని భావిస్తున్నాడు అంటే ఆ మేర‌కు పారితోషికాల నిధిని స‌మీక‌రిస్తున్నాడ‌నే దీన‌ర్థం. అయితే ఇదంతా పార్టీ కోసం చేస్తున్న సాహ‌సం. ఒక‌ర‌కంగా వ్య‌క్తిగ‌త జీవితానికి స‌మ‌యం అన్న‌దే లేకుండా ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌యోగాల్ని అభిమానులు గ్ర‌హించి స్వ‌గ‌తిస్తున్నార‌నే చెప్పాలి.