Begin typing your search above and press return to search.

పేర్ని నానికి అలా చెక్ పెడుతున్న పవన్

By:  Tupaki Desk   |   4 March 2023 2:54 PM GMT
పేర్ని నానికి అలా చెక్ పెడుతున్న  పవన్
X
పేర్ని నాని. మాజీ మంత్రి. మంచిలీపట్నం ఎమ్మెల్యే. సీనియర్ మోస్ట్ లీడరు. ఆయన తండ్రి పేర్ని క్రిష్ణమూర్తి కూడా కాంగ్రెస్ లో వెలిగిన నాయకుడు. మాజీ మంత్రి. రాజకీయ కుటుంబానికి చెందిన పేర్ని నాని మీడియా ముందుకు వస్తే సెటైర్లు పేలుస్తూ మాట్లాడుతారు. ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ణి టార్గెట్ చేయడంలో ఆయన సదా ముందుంటారు.

పవన్ ఏపీకి ఎపుడు వచ్చి మాట్లాడినా ఆ వెంటనే కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నాని రెడీగా ఉంటారు. నాని వెటకారపు కామెంట్స్ తో జనసైనికులకు కారం పూస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ మూడు గంటల స్పీచ్ ని సైతం తన ముప్పయి నిమిషాల మీడియా మీటింగుతో పంచులతో ఏమీ కాకుండా చేసే నైపుణ్యం నాని సొంతం.

అందుకే జనసేన ఆయన్ని టార్గెట్ చేసింది. పవన్ ఏది మాట్లాడినా పేర్ని నానే ముందుకు వస్తారు. మరి ఆయనకు జనసేన ఏంటో చూపించాలి కదా అని ఆ పార్టీ నేతలు అంటున్నారు చూసి చూసి జనసేనకు మైలురాయి లాంటి పదవ వార్షికోత్సవ సభను మచిలీపట్నంలో పెట్టారు. పేర్ని నాని రాజకీయ అడ్డాగా ఉన్న బందరులో బస్తీమే సవాల్ అంటోంది జనసేన.

ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభకు అక్కడ వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో అత్యంత కీలకంగా ఉన్న మచిలీపట్నం రాజకీయ కార్యక్షేత్రంగా చాలా మందికి ఉంది. మచిలీపట్నంలో కాపులు బలమైన శక్తిగా ఉన్నారు. పేర్ని నాని మరోసారి పోటీ చేయకుండా తన కుమారుడు క్రిష్ణని పోటీకి పెట్టాలనుకుంటున్నారు.

అయితే జగన్ ఆయన్నే పోటీ చేయమంటున్నారు. దాంతో ఈసారి పేర్ని నాని రంగంలో ఉంటారు. ఇక చూసుకుంటే మచిలీపట్నంలో గతంలో ఉన్న పరిస్థితులు ఇపుడు లేవు అంటున్నారు. వైసీపీ పట్ల సానుకూలత పెద్దగా లేదని అంటునారు. కాపులు సైతం జనసేన వైపు అట్రాక్ట్ అవుతున్నారు. బీసీ నేతగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బలంగా ఉన్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో ఇపుడు జనసేన తన బలాన్ని పెంచుకోవడమే కాకుండా నాని అడ్డాను బద్ధలు కొట్టాలని చూస్తోంది. అందుకే కోరి మరీ అక్కడే మీటింగ్ పెడుతున్నారు అని అంటున్నారు. జనసేనకు మచిలీపట్నంలో ఇరవై ముప్పయి వేల దాకా ఓట్లు ఉన్నాయని అంటున్నారు. ఆ బలాన్ని పెంచుకోవడం కోసమే ఇపుడు పవన్ మీటింగ్ అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో పొత్తులు కనుక టీడీపీతో ఉంటే జనసేనకు ఈ సీటు దక్కదు. దానికి కారణం బలమైన బీసీ నేతగా కొల్లు రవీంద్ర ఉండడం. సో పొత్తులు ఉన్నా లేకునా మచిలీపట్నంలో నానిని ఓడించడమే లక్ష్యంగా చేసుకుని జనసేన పావులు కదుపుతోంది అని అంటున్నారు. అందుకోసమే మచిలీపట్నంలో పవన్ సమర శంఖరావం పూరిస్తారు అని అంటున్నారు. దీనికి కౌంటర్ గా నాని ఏమి చేయబోతారో చూడాలి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.