Begin typing your search above and press return to search.

జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్

By:  Tupaki Desk   |   31 Dec 2017 8:02 AM GMT
జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్
X
జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తన పార్టీ అభిమానుల‌కు కొత్త సంవ‌త్స‌ర కానుక‌ను అందించారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లోని పరిపాలన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలి సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ స్వీకరించారు. అనంతరం పార్టీలోని ముఖ్యులకు ఆయన సభ్యత్వ నమోదు పత్రాలను అందచేశారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం రూపొందించిన సాఫ్ట్ వేర్ పై ఆయన సంతృప్తి వ్యక్తం చేసారు. త్వరలోనే రెండు రాష్ట్రాలలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. గత పదేళ్లకు పైగా తనను అనుసరిస్తున్న వారితో గత మూడు రోజులుగా విడతల వారీగా ఇష్టాగోష్టి సమావేశాలను పవన్ కళ్యాణ్ నిర్వహించారు. పార్టీ ఆశయాలు - సిద్ధాంతాలను వారికి వివరించారు. దీనితోపాటు రానున్న రోజులలో జనసేన నిర్వహించనున్న శిక్షణ శిబిరాల గురించి వారితో చర్చించారు. జనసేన పార్టీ కి స్పీకర్స్ - కంటెంట్ రైటర్స్ - అనలిస్టులు - సమన్వయకర్తలుగా పనిచేయడానికి ముందుకు వచ్చిన వారిలో తొలుత మహిళలు - సీనియర్ సిటిజెన్స్ కు ఒక వర్కుషాప్ నిర్వహించాలని నిర్ణయించారు. కొత్త సంవత్సరం తొలి రోజులలో ఈ వర్కషాప్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే పార్టీ ప్రతినిధులు ప్రకటిస్తారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఇప్పటికే తెలుగు రాష్ర్టాల్లో పార్టీ కార్యాల‌యాల‌ను జ‌న‌సేన సిద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ కార్యాల‌యంలో మ‌రిన్ని వ‌స‌తులు క‌ల్పించే క్ర‌మంలో భాగంగా ఐటీ సెంట‌ర్‌ను మ‌రింత క్రియాశృలంగా తీర్చిదిద్దారు. అదే వ‌రుస‌లో ఏపీలో కూడా కార్యాల‌యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే ఆ స్థ‌లం వివాదంలో ప‌డిన సంగ‌తి తెలిసిందే.