Begin typing your search above and press return to search.

గాంధీ జయంతి రోజున పవన్ కళ్యాణ్ శ్రమదానం

By:  Tupaki Desk   |   28 Sep 2021 7:40 AM GMT
గాంధీ జయంతి రోజున పవన్ కళ్యాణ్ శ్రమదానం
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై పలుమార్లు విమర్శలు గుప్పించిన ఆయన ఇక వేచి చూసేది లేదంటూ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు గాంధీ జయంతి రోజును మూహూర్తంగా ఫిక్స్ చేసుకున్నారు. దెబ్బతిన్న రోడ్ల దుస్థితిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పార్టీ శ్రేణులతో కలసి శ్రమదానం చేసి మరమ్మత్తు చేయాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందంటూ బహిరంగంగా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అల్టిమేటం జారీ చేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించకపోవడంతో జనసేన పార్టీ శ్రేణులతో కలసి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడంతోపాటు తన పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించారు.

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ పై అక్టోబర్ 2న ఉదయం 10గంటలకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. కాటన్ బ్యారేజీపై దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మత్తు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లా కొత్తచెరువుకు చేరుకుంటారు. ఈ గ్రామం వద్ద పుట్టపర్తి –ధర్మవరం రోడ్డు మరమ్మత్తు చేసే కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలసి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక ఈ మధ్య పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పరంగా కొంచెం దూకుడు చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం .. మండ‌ల, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కొన్ని చోట్ల స‌త్తా చాటడమే.

మండ‌ల, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కొన్ని చోట్ల స‌త్తా చాటింది. కొన్ని చోట్ల ఊహించ‌ని విధంగా విజయాల్ని సొంతం చేసుకుంది. దీంతో జ‌న‌సేన‌లోనూ అంత‌ర్మ‌థ‌నం ఏర్ప‌డింది. ప‌వ‌న్ క‌నుక కొద్దిగా పుంజుకుంటే, ఇక తిరుగులేద‌ని, పార్టీలో సీనియ‌ర్లు భావిస్తున్నారు. ఇక‌, ఇదే విష‌యంపై ప్ర‌ధాన మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయి. గ‌త ఎన్నిక‌ల్ త‌ర్వాత‌ ప‌వ‌న్ పెద్ద‌గా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చింది లేదు. కేవలం తిరుప‌తి ఉప ఎన్నిక త‌ర్వాత‌.. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలో వ‌చ్చిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితంతో మున్ముందు పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని జ‌న‌సేన అంచ‌నా వేసింది. కళ్యాణ్ మళ్లీ పాత రోజులని గుర్తు చేస్తూ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ హైలెట్ అవుతున్నారు. రిప‌బ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌ ఏపీ ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇక‌, ఇప్పుడు మ‌రో రూపంలో క్షేత్ర‌స్థాయిలో ప‌వ‌న్ దూకుడు చూపించేందుకు రెడీ అయ్యారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో కల్యాణ్ శ్రమదానం రూపంలో నిర‌స‌న వ్య‌క్తం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల గురించి జనసేన పార్టీ సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా ఉద్యమించిన సంగతి విదితమే. నాలుగు వారాలు గడువు ఇచ్చి వాటికి కనీసం మరమ్మతులైనా చేయాలని విజ్ఞప్తి చేసి... ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రహదారికి జనసేన శ్రేణులు మరమ్మతులు చేస్తాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ రహదారుల విషయంలో అలక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో శ్రమదానం ద్వారా జనసేన శ్రేణులు రహదారులకు మరమ్మతులు చేపడతాయని వెల్లడించింది.