Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ను హిందూ వ్య‌తిరేకిగా టార్గెట్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   31 Dec 2020 12:30 AM GMT
జ‌గ‌న్‌ను హిందూ వ్య‌తిరేకిగా టార్గెట్ చేస్తున్నారా?
X
రాష్ట్రంలో రాజ‌కీయ వేడి పెరిగింది. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్న టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు ఇప్పుడు మ‌రో కొత్త ఎత్తుగ‌డ‌కు తెర‌దీశాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు అది బాగోలేదు.. ఇది బాగోలేదు.. అని ఆరోప‌ణ‌లు చేసిన ఈ పార్టీల నేత‌లు.. ఇప్పుడు నేరుగా జ‌గ‌న్‌ను హిందూ వ్య‌తిరేకిగా చిత్రించేందుకు ప్ర‌యాస ప‌డుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల ‌కులు. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. మ‌రోసారి ఏపీలో ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకున్నారు. ఇటీవ‌ల గుడివాడ‌లోనూ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా స్థానిక అంశాల‌ను ప్ర‌స్తావించిన ఆయ‌న మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేస్తూ.. వ్యాఖ్య‌లు సంధించారు.

ఇక‌, ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత సంచ‌ల‌నంగా మారాయి. రాష్ట్రంలో హిందూ ఆల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను జ‌గ‌న్ ఎందుకు ఖండించ‌డం లేద‌న్న ప‌వ‌న్‌.. జగన్‌ ఏ మతాన్ని విశ్వసించినా.. పరమతాన్ని గౌరవించాలన్నారు. గత దాడులను పట్టించుకోక పోవడం వల్లే వరుసగా దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రణాళికా బద్ధం గానే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని విమ‌ర్శ‌లు గుప్పించారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాదపు చర్యగా దీనిని అభివర్ణించారు.

కొన్నాళ్ల కింద‌ట తూర్పుగోదావ‌రి జిల్లా అంత‌ర్వేదిలో ర‌థం ద‌గ్ధ‌మైన ఘ‌ట‌న‌, విజ‌య‌వాడ‌లో దుర్గగుడికి చెందిన ర‌థానికి ఉన్న సింహాలు మాయ‌మైన ఘ‌ట‌న‌లు ఉటంకించిన ప‌వ‌న్‌.. ఆయా కేసుల్లో నిందితుల‌ను ప‌ట్టుకోలేక పోయార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆయా కేసుల‌పై సీబీఐ విచార‌ణ‌కుఆ దేశించాలని డిమాండ్ చేశారు. ఇలా.. ప‌వ‌న్ ఒక్క‌రే కాదు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు, టీడీపీ అదినేత చంద్ర‌బాబు కూడా ఆల‌యాల‌పై జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌ను రాజ‌కీయంగా వాడుకుని.. జ‌గ‌న్‌ను హిందూ వ్య‌తిరేకిగా ముద్ర‌వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇక‌, ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాద‌న చూస్తే.. ఆయా ఘ‌ట‌న‌ల‌పై ఇప్ప‌టికే విచార‌ణ చేప‌ట్టింది. పోలీసు బృందాలు కూడా త‌మ‌వంతు కృషి చేస్తూనే ఉన్నాయి. ఆయా విష‌యాలు తెలిసి కూడా ఈ పార్టీలు మూకుమ్మ‌డిగా జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డం వెనుక.. రాజ‌కీయంగా పైచేయి సాధించేందుకేన‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.