Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో తన ఓటమిపై పవన్ కల్యాణ్ షాకింగ్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   12 March 2023 10:45 AM GMT
ఎన్నికల్లో తన ఓటమిపై పవన్ కల్యాణ్ షాకింగ్ వ్యాఖ్యలు
X
జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో వరుస పెట్టి కార్యక్రమాల్నినిర్వహిస్తున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్. తాజాగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఆయన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాల మీద పవన్ మాట్లాడటం ఒక ఎత్తు అయితే.. తన ప్రసంగంలో భాగంగా 2019 ఎన్నికల్లో తాను పోటీ చేసిన స్థానాల్లో ఓటమి చెందటానికి కారణాలు ఏమిటన్న దానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

నిజానికి ఆయన నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ఇంతకు ముందు వచ్చింది లేదు. తాను కులాలకు.. మతాలకు అతీతంగా వ్యవహరిస్తారన్న దానికి తగ్గట్లే.. పవన్ చేతలు ఉంటాయని తెలుసు. తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడినే అయినప్పటికీ.. తనను కాపుగా మాత్రం చూడొద్దన్న మాట ఆయన నోటి నుంచి తరచు రావటంతో పాటు.. తాను కులానికి ప్రాధాన్యత ఇవ్వని తేల్చి చెప్పటం తెలిసిందే. అయితే.. గోదావరి జిల్లా నుంచి తాను పోటీ చేసిన స్థానంలో ఓటమిపై పవన్ వ్యాఖ్యానిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఎన్నికల్లో నన్నుకాపులు ఓన్ చేసుకొని ఉంటే నేను ఓడిపోయేవాడిని కాదు. గోదావరి జిల్లాల్లోజనసేన పార్టీకి వచ్చిన ఓట్లలో సగానికి పైగా బీసీలు వేసినవే " అని పేర్కొన్నారు. తాను ఏ ఒక్క కులానికి చెందిన నాయకుడ్ని కాదన్న పవన్.. అన్ని కులాల నాయకుడిగా అభివర్ణించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు.. శెట్టి బలిజలకు పడదని.. రెండు వారాలు అక్కడే కూర్చొని వారి మధ్య సయోధ్య చేసిన వైనాన్ని చెప్పుకొచ్చారు. దాని ఫలితంగానే శెట్టి బలిజల పండుగకు కాపులు శుభాకాంక్షలు చెప్పే పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేయటం గమనార్హం. మొత్తానికి తనను కాపు నాయకుడిగా అభివర్ణించే వారికి షాకిస్తూ.. తాను ఎన్నికల్లో ఓడిపోవటానికి కాపులే ఓట్లు వేయలేదన్న విషయం పవన్ నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.