ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒకటే స్టాండ్ మీద ఉంటున్నారు. ఆయన 2014లోనూ 2019లోనూ కూడా జగన్ సీఎం కాకూడదు అనే మాట్లాడారు. జగన్ని సీఎం ని కానీయను ఇది నా శాసనం అని కూడా చెప్పారు. అయితే 2019లో జగన్ సీఎం అయ్యారు. 151 సీట్లతో ఆయన గెలిచారు.
ఇక నాలుగేళ్ళ జగన్ పాలన దారుణంగా ఉందని, ఆయనను కనుక మరోసారి సీఎం ని చేస్తే ఏపీ అధోగతే అంటూ తాజాగా మంగళగిరిలో జరిగిన జనసైనికుల సభలో పవన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మనకు ప్రధాని ప్రత్యర్ధి కానీ టీడీపీ ఎలా అవుతుందని ఆయన జనసైనికులను ప్రశ్నించారు.
ఏపీలో పచ్చని చెట్లను కొట్టేసే వ్యక్తి సీఎం గా అవసరమా అని ఆయన నిలదీశారు. ఏపీలో దేవాలయాలను నాశనం చేస్తున్నారని, రైతుల ఇబ్బందులు తీర్చడం లేదని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని, అన్ని కులాలను హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తిని సీఎం గా మళ్లీ చేయకూడదని శపధం చేయాలని అన్నారు.
ఏపీలో ఫ్రాక్షనిజాన్ని ప్రవేశపెట్టారని ఆయన విమర్శించారు. ఏ వర్గం చూసినా ఆనందంగా లేదని, ఏపీలో మొత్తం ప్రజానీకం నరకం అనుభవిస్తున్నారని ఈ నేపధ్యంలో మనకు నచ్చని వ్యక్తిని ప్రజాస్వామ్య యుతంగా తప్పించేయడమే ఎన్నికల్లో చేయాల్సిన పని అని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లోకి ఊరకే రాలేదని, నిర్ణయాలు కూడా ఏదో తేలికగా తీసుకోనని ప్రతీ దాని వెనుక వ్యూహాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఏపీలో వైసీపీ ఉండకూడదు అన్నదే తన వ్యూహం ఆలోచన రాజకీయం అని పవన్ చెప్పారు. అందుకోసం తాను చేయాల్సింది చేస్తానని, జన సైనికులు కూడా చేయాలని ఆయన కోరారు. తాను ముఖ్యమంత్రిని కావాలంటే దానికీ వ్యూహాలు ఉన్నాయని, ముందు మన బాధ్యత టార్గెట్ అది కాదని జగన్ని గద్దె దించడమే అని పవన్ గట్టిగానే చెప్పేశారు. మనందరికీ ప్రత్యర్ధిగా ఉన్న జగన్ని మాజీ సీఎం ని చేయాలని ప్రతీ సైనికుడూ కంకణబద్ధుడు కావాలని ఆయన కోరారు.
ఏపీలో జగన్ పాలన ఉండకూడదన్నదే తన రాజకీయం, అదే తన విధానం అని ఆయన అన్నారు. ఆ దిశగా సాగుతున్న తన ఆలోచనలను అర్ధం చేసుకుని ఏపీని వైసీపీ ఏలుబడి నుంచి బయటపడేలా చేయాలని పవన్ కోరారు. . మొత్తానికి జన సైనికులకు ఆయన జగనే మన శత్రువు అని చెప్పారు.
చంద్రబాబు టీడీపీ సంగతి ఇపుడు కాదని మన ప్రధమ కర్తవ్యం మరచిపోరాదని, రాజకీయాల్లో వ్యూహాలే ఎపుడూ ముఖ్యమని తాను అందుకే ఆ దిశగా ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతున్నాను అని పవన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి జగన్ని వ్యతిరేకించి తన వ్యూహాలకు తన పొత్తుల ఎత్తులకు మద్దతుగా నిలవాలని పవన్ కోరడం విశేషం.