Begin typing your search above and press return to search.

బాబుకు లెక్క‌ల పంచ్ వేసిన ప‌వ‌న్‌!

By:  Tupaki Desk   |   27 Feb 2019 4:39 AM GMT
బాబుకు లెక్క‌ల పంచ్ వేసిన ప‌వ‌న్‌!
X
గ‌డిచిన కొద్ది రోజులుగా కామ్ గా ఉన్న‌ట్లుగా క‌నిపించిన జ‌న‌సేన అధినేత తాజాగా క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో త‌న స్వ‌రాన్ని పెంచారు. 2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన బ‌లంతోనే టీడీపీ విజ‌యం సాధించింద‌ని.. అధికారాన్ని సొంతం చేసుకోగ‌లిగిన‌ట్లుగా పేర్కొన్నారు. జ‌న‌సేన‌కు అరిచి గోల చేసే ప‌ది మంది కుర్రాళ్లు త‌ప్పించి ఇంకెవ‌రూ లేర‌ని చెబుతున్నార‌ని.. అదంతా నిజం కాద‌న్నారు.

2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేనికులంతా క‌లిసి 12.5 శాతం ఓట్ల‌ను పూడ్చామ‌ని.. ఈ కార‌ణంతోనే రెండు శాతం ఓట్ల తేడాతో టీడీపీ బ‌య‌ట‌ప‌డింద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు. నిజంగానే జ‌న‌సేన అంత ప్ర‌భావం చూపించ‌లేకుంటే త‌మ‌ను చూసి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు? అంటూ ప్ర‌శ్నించారు. టీడీపీని గెలిపించిన జ‌న‌సేన సైనికుల మీద ఏ మూల‌కు వెళ్లినా బైండోవ‌ర్ కేసులు పెట్టించ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. జ‌న‌సేన సైనికులు ఏమైనా సంఘ విద్రోహ శ‌క్తులా? ఎవ‌రిమీద‌నైనా బాంబులు వేశారా? వేట కొడ‌వ‌ళ్ల‌తో నరికారా? అంటూ తీవ్రంగా ప్ర‌శ్నించారు.

జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని మరోసారి అన్నారు పవన్‌. ఇప్పటికే ఆసక్తి ఉన్న అభ్యర్థులంతా జనసేన కమిటీకి అప్లికేషన్స్ ఇచ్చారని.. అందులో వారిని ఎంపిక చేసి త్వరలోనే పోటీ చేయబోయే వారి వివరాలు ప్రకటిస్తామని చెప్పాురు. ఇందులో యువతతో పాటు మహిళలు - సీనియర్‌ సీటిజన్లు అందరూ ఉంటారని.. మన సమాజానికి అందరూ కావాలని అన్నారు పవన్‌. అయితే.. పవన్ ఎక్కడనుంచి పోటీ చేయబోతున్నారు అని అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సరిగ్గా బదులివ్వలేదు. మరోవైపు.. టీడీపీ - వైసీపీకి చెరి సమానమైన ఓట్లు వేస్తే.. తన పార్టీకి వచ్చిన సీట్లు కీలకంగా మారతాయని అంటున్నారు పవన్‌. అయితే.. చంద్రబాబు - టీడీపీ మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందని.. అందుకే ప్రత్యేక హోదా విషయంలో అటు బీజేపీని - ఇటు టీడీపీని పవన్‌ ఏమీ అనడం లేదని వైసీపీ విమర్శిస్తోంది.

దేశ భ‌క్తి బీజేపీకి మాత్ర‌మే సొంతం కాద‌ని.. తాము ఒక్క‌రిమే ప్రేమిస్తామ‌ని బీజేపీ భావిస్తోంద‌ని..వారి కంటే వంద రెట్లు ఎక్కువ‌గా భ‌ర‌త‌మాత‌ను తాము ప్రేమిస్తామ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.

తన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని తాను క‌ల‌వ‌టం వెనుక కార‌ణాన్ని చెప్ప‌కొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. ఏపీ రాష్ట్ర మంత్రి ప‌రిటాల సునీత ఇళ్ల‌కు ఎందుకు వెళ్లారు? అని త‌న‌ను చాలామంది ప్ర‌శ్నిస్తార‌ని.. త‌న‌కు ఎవ‌రితోనూ.. ఎప్పుడూ వ్య‌క్తిగ‌త ద్వేషాలు అన్న‌వి లేవ‌న్నారు. స‌యోధ్య‌తోనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం అవుతుంద‌ని తాను భావిస్తాన‌ని.. స‌యోధ్య కుద‌ర‌ని వేళ‌లో మాత్రం తాను యుద్ధం చేస్తాన‌ని చెప్పారు. మ‌రి.. బాబు గెలుపు వెనుక జ‌న‌సేన పాత్రపై లెక్క చెప్పిన ప‌వ‌న్ మాట‌ల‌కు బాబు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా? అని జ‌న‌సైనికులు ప్ర‌శ్నిస్తున్నారు.