Begin typing your search above and press return to search.

విమ‌ర్శించినా ప‌ట్టించుకోవ‌ద్దు...ప‌వ‌న్ ట్వీట్!

By:  Tupaki Desk   |   7 Oct 2017 1:04 PM GMT
విమ‌ర్శించినా ప‌ట్టించుకోవ‌ద్దు...ప‌వ‌న్ ట్వీట్!
X
ఏపీలో జ‌న‌సేన‌ పార్టీ జెండానే లేదు....పవన్ గురించి ఆలోచించే టైం లేదు...మా ఫోక‌స్ అంతా వైసీపీపైనే....అంటూ జ‌న‌సేన అధినేత‌పై ఏపీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల‌కు ప‌వ‌న్ వ్యంగ్యంగా స్పందిస్తూ.....అశోక్ గ‌జ‌ప‌తిరాజు గారికి ప‌వ‌న్ ఎవ‌రో తెలియ‌దు....క‌నీసం పితానిగారికి నేనెవ‌రో తెలుసు..సంతోషం...అంటూ రిటార్ట్ ఇచ్చాడు. 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతాన‌ని, అక్టోబ‌ర్ నుంచి ఎక్కువ స‌మ‌యం రాజ‌కీయాల కేటాయిస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో, 2019 ఎన్నిక‌ల్లో త‌మ‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌ని తెలుగు త‌మ్ముళ్లు ఫిక్స‌యిన‌ట్టున్నారు. అందుకే, జ‌న‌సేన‌ - ప‌వ‌న్ పై ఇప్పుడు తార‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. గ‌తంలో ప‌వ‌న్ పై టీడీపీ నేత‌లెవ‌రూ విమ‌ర్శ‌లు చేయ‌వ‌ద్దంటూ హుకుం జారీ చేసిన చంద్ర‌బాబు ఇపుడు మౌనంగా ఉండ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ మ‌ద్ద‌తు లేకుండానే టీడీపీ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో రాబోయే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ లేకున్నా పెద్ద న‌ష్ట‌మేమీ లేద‌ని టీడీపీ అధినేత భావిస్తున్నార‌ని భోగ‌ట్టా. అందుకే బాబు....పితాని వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌లేద‌ని అనుకుంటున్నారు. దీంతో బాబు గారు త‌మ నోటికి లైసెన్స్ ఇచ్చిన‌ట్లు తెలుగు త‌మ్ముళ్లు భావిస్తున్నార‌ని వినికిడి. ఆ అండ‌తో రాబోయే రోజుల్లో ప‌వ‌న్ పై తెలుగు త‌మ్ముళ్ల విమ‌ర్శ‌లు తీవ్ర‌స్థాయిలో ఉన్నా అశ్చ‌ర్య‌పోన‌వస‌రం లేద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. పితాని కామెంట్స్ నేప‌థ్యంలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లకు, అభిమానుల‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ ద్వారా ఓ విజ్ఞ‌ప్తి చేశారు. త‌న‌పై ఎవ‌రైనా వ్యక్తిగత‌ విమర్శలు చేసినా, త‌న‌కు చెడ్డ పేరు తీసుకొచ్చేలా మాట్లాడినా కార్య‌క‌ర్త‌ల‌దరూ హుందాగా వ్యవహరించాల‌ని ప‌వ‌న్ కోరారు. కొంత‌మంది కావాల‌నే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల దృష్టి మ‌ర‌ల్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తార‌ని, వారిని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ప‌వ‌న్ సూచించారు.

"ప్రియమైన మీకు,

జనసేన శ్రేణులు, అభిమానులకు ఒక విన్నపం. ప్రస్తుతం మనం పార్టీ అంతర్గత నిర్మాణంలో తలమునకలయ్యాం. మరోవైపు, ప్రజాసమస్యలే పరమావధిగా ముందుకు సాగుతున్నాం. ఈ తరుణంలో కొంత మంది వ్యక్తులు మన దృష్టిని మరల్చడానికో, మనల్ని చికాకు పరచడానికో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటివాటిపై ఎవరూ స్పందించవద్దని కోరుతున్నా. నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా, నాకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా మాట్లాడినా... అందరూ హుందాగా వ్యవహరించండి. ఎందుకంటే, ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు భిన్నంగా, బాధ్యతాయుతమైన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు కోసం జనసేన ముందుకెళుతున్న సంగతి మీకు తెలిసిందే. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలనేది జనసేన నమ్మకం. దీన్ని ఆచరణలో చూపాలన్న అభిమతంతోనే జనసేన ఆవిర్భవించింది. మానవత్వమే మతంగా, సమాజ హితమే అభిమతంగా జనసేన రూపుదిద్దుకుంటోంది. యువత, భావితరాలు, సమాజం, దేశ భవిష్యత్తుకు విశాలమైనటువంటి ధృక్పథం కలిగిన రాజకీయాలు చాలా అవసరమని జనసేన నమ్ముతోంది. ఇలాంటి నేపథ్యంలో, మనపై వచ్చే విమర్శలకు మీరు ఆవేశాప‌డొద్దు. మీ ఆవేశం పార్టీకి మేలు చేయకపోగా... ఒక్కోసారి కీడు కూడా తలపెడుతుంది. మనపై చేస్తున్న ప్రతి విమర్శను కూడా పార్టీ లెక్కగడుతోంది. అవి హద్దులు మీరినప్పుడు పార్టీ స్పందిస్తుంది. మీరంతా పార్టీ కోసం హుందాగా పని చేయండి. మన ఓర్పే మన పార్టీకి రక్ష. జైహింద్‌". అంటూ ప‌వ‌న్ అభిమానుల‌ను కోరారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత‌ల రియాక్ష‌న్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ ట్వీట్ చూసిన తర్వాత తెలుగు త‌మ్ముళ్లు ప‌వ‌న్ పై విమ‌ర్శ‌క‌లకు పుల్ స్టాప్ పెడ‌తారా? లేక ఎలా విమ‌ర్శించినా స్పందించ వ‌ద్ద‌ని అభిమానుల‌ను ప‌వ‌న్ కోరారు కాబ‌ట్టి మ‌రిన్ని కామెంట్స్ చేస్తారా అన్న ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధానమివ్వాలి.